
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారిని తరిమికొట్టే సమరంలో ముందు వరుసలో నిలిచిన వారందరికీ తూర్పు నౌకాదళం సెల్యూట్ చేయనుంది. ప్రజల తరఫున వారికి ఆదివారం వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న విశాఖలోని ఆస్పత్రులపై హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపిస్తారు. అలాగే ఆర్‌కే బీచ్ సాగర తీరంలో గౌరవ వందనం చేస్తారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి కోవిడ్–19తో అవిశ్రాంతంగా పోరాడుతూ విధులు నిర్వర్తిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించి తూర్పు నౌకాదళం అధికారులు ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
► ముందుగా నగరంలోని ప్రభుత్వ టీబీ, ఛాతీ ఆస్పత్రులతోపాటు, గీతం, విమ్స్ ఆస్పత్రి సిబ్బందికి త్రివిధ దళాల బృందం కృతజ్ఞతలు తెలుపుతుంది. అనంతరం నేవీ హెలికాఫ్టర్ ఉదయం 9.15 నుంచి 9.45 గంటల మధ్య ప్రాంతంలో ఆకాశంపై చక్కర్లు కొడుతూ కోవిడ్ ఆస్పత్రులపై పూల వర్షం కురిపిస్తుంది.
► రెండో కార్యక్రమంలో రాత్రి 7.30 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్‌కే బీచ్ సాగర తీరంలో రెండు యుద్ధనౌకల్లో విద్యుద్దీపాలు వెలిగించి గౌరవ వందనం చేస్తారు.
► ఇక మూడోదిగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పచ్చని బాణసంచా కాల్చనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి శనివారం రాత్రి ఆర్‌కే బీచ్‌లో రిహార్సల్స్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment