సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్నికల ప్రక్రియను భగ్నం చేయడానికి మావోయిస్టు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు పేర్కొన్నారు. ఈవీఎంలు తస్కరించడం, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకునేందుకు వ్యూహం పన్నినట్లు చెప్పారు. ఆయుధాలతో సంచరిస్తున్న కొందరు నక్సల్స్‌ను విశాఖపట్నం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ వీఎస్‌కే కౌముది, ఐజీ హరీష్‌కుమార్‌గుప్తా, ఎస్పీ రమేష్‌లతో కలిసి మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను వివరించారు. ఏ పార్టీ వారు డబ్బులు ఇచ్చినా తీసుకోండంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల ప్రజలకు సూచించటాన్ని జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారని డీజీపీ తెలిపారు.
ఈసారి ఎన్నికల సందర్భంగా తరలిస్తున్న రూ.131 కోట్లకు పైగా నగదును సోమవారం వరకు స్వాధీనం చేసుకోగా సరైన ఆధారాలు, పత్రాలు చూపిన వారికి మాత్రం తిరిగి ఇచ్చినట్లు వెల్లడించారు.