సీతానగరం, బొబ్బిలి: అంతా ఊహించినట్టే ఎన్‌సీఎస్ యాజమాన్యంపై చెరుకు రైతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫ్యాక్టరీ ఎం.డి., డెరెక్టర్, ప్రజాప్రతినిధులను చుట్టుముట్టి తమ బకాయిల మాటేంటని నిలదీశారు. గత ఏడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరుకుకు సంబంధించిన బకాయిలు చెల్లించేవరకూ క్రషింగ్ మాటను ఎత్తవద్దని రైతులు కరాఖండీగా చెప్పడంతో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఏడాది తరువాత మళ్లీ మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా, మా జీవితాలతో ఆటలాడింది చాలదా అం టూ రైతులు దుమ్మెత్తి పోశారు.
దీంతో ఆ ప్రాంగణంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రషింగ్ మొదలు పెట్టే ముందు ఆనవాయితీ ప్రకారం రైతులతో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే సమావేశాన్ని శనివారం సాయంత్రం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం ఆవరణలో నిర్వహించారు. ఎప్పటిలాగే ఎం.డి. చాంబర్‌లో నిర్వహించడానికి ఎం.డి. నాగేశ్వరరావు, డెరైక్టరు శ్రీనివాస్‌లు ఏర్పాట్లు చేశారు. కేవలం 50 మంది రైతులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే సమావేశానికి రమ్మని సమాచారం అందించారు. అయితే సమావేశం పెడుతున్నారన్న సమాచారం తెలుసుకొని రైతులు వందల సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. నాలుగు గోడల మధ్య సమావేశం సరికాదని, ఆరుబయట పెట్టాలంటూ డిమాండ్ చేయడం కార్యాలయం ఫోర్ట్‌కో వద్దకు మార్చారు.
రైతులు, ప్రజాప్రతినిధులు, యాజమాన్యం వచ్చి కూర్చున్నా పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు రాలేదు. ఆయన కోసం కొంత సేపు వేచి చూశారు. ఎమ్మెల్యే చిరంజీవులు వచ్చాక ఎం.డి. నాగేశ్వరరావు ప్రసంగం మొదలు పెట్టారు. జాతీయ వ్యాప్తంగా సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పడంతో రైతులు ఒకే సారి అడ్డుతగిలారు. ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, బకాయిలు చెల్లించమని అడుగుతుంటే ఎక్కడ సంగతులో ఎందుకు చెబుతున్నారంటూ ఒకే సారి రైతులంతా అందోళనకు దిగారు. బకాయిలు చెల్లింపులు, ఈ ఏడాది మద్దతు ధర గురించి చెప్పకుండా మాట్లాడుతుండడంతో వేదిక వద్దకు వెళ్లి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏపీ చెరుకు రైతు సంఘ నాయకులు రెడ్డి శ్రీరాంమూర్తి, లక్ష్ముంనాయుడు, గేదెల సత్యనారాయణ, సీడీసీ డెరైక్టరు బేతనపల్లి శ్రీరాంమూర్తి, ఆదర్శ రైతు ముప్పాల మురళీకృష్ణ తదితరులు ఎం.డీ, డెరైక్టరు, ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు.
బకాయిలు చెల్లింపులు ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ పట్టుబట్టారు. ఇంకా పది కోట్ల రూపాయల బకాయి ఉందని, ఈ నెలాఖరునాటికి కొంత, డిసెంబరు పదో తేదీనాటికి పూర్తిగా చెల్లింపులు చేస్తామని ఎం.డీ ప్రకటించారు. దీంతో మరింత ఆవేదనకు గురైన రైతులు తీవ్ర పదజాలంతో యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మీ ఫ్యాక్టరీకి చెరుకును తోలుతున్నామంటే మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదని కొందరు రైతులు, మీరు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల మా ఇళ్లలో శుభ కార్యాలు జరగడం లేదని మరికొందరు యాజమాన్యం, ప్రజాప్రతినిధులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రైతులు, యాజమాన్యం ప్రతినిధుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ ఆధ్వర్యంలో సీఐలు చంద్రశేఖర్, కాంతారావులు, ఎస్‌ఐలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని అందోళన చేస్తున్న వారిని అదుపు చేశారు.
దీంతో ఈ సమావేశానికి పోలీసులను ఎందుకు పిలిచారని, మీకు రక్షణగా ఉండడానికా, మమ్మల్ని బయటకు పంపడానికా అంటూ మరో సారి విరుచుకుపడ్డారు. ఈలోగా ఎమ్మెల్యే చిరంజీవులు కలగజేసుకొని యాజమాన్యం వ్యవహార శైలి ఏమీ బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బకాయిలు చెల్లించాకే క్రషింగ్ చేయాలని సూచిస్తూ అక్కడ నుంచి వె ళ్లిపోయారు. ఆ తరువాత ఎం.డీ, డెరైక్టరు, సీఈఓలు కూడా అక్కడ నుంచి ఛాంబర్‌లోనికి వెళ్లిపోయారు. దీంతో రైతులు తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ కార్యాలయం ముందు నినాదాలు చేసి కొంత సేపు బైఠాయించారు. ఈ సమావేశానికి మాజీ ప్రభుత్వ విప్ శంబంగి వెంకటచినప్పలనాయుడు, మాజీ మంత్రి డాక్టరు పెద్దింటి జగన్మోహనరావు, మాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, సీడీసీ అసిస్టెంటుకేన్ కమిషనర్ ముత్యాలు తదితరులు హాజరయ్యారు.
అనుకున్నట్టే అయ్యింది...
Published Sun, Nov 23 2014 2:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement