శంషాబాద్, న్యూస్‌లైన్: నిందితుల కంటికి కనిపించని ఆ నాలుగో సింహమే సీసీ కెమెరా. వీటి ద్వారా పలు సంచలనాత్మక కేసుల గుట్టును ఇట్టే విప్పారు మన పోలీసులు. సాధారణ, రద్దీ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. మంచి ఫలితాలు సాధించిన మన పోలీసులు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై మాత్రం ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ మార్గంలో దొంగలు, ఉగ్రవాదులు రాకపోకలు సాగించినా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.
బెంగళూరు జాతీయ రహదారి (శంషాబాద్) నుంచి రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయం వరకు 8 కి లో మీటర్లు గల ఈ రహదారి మీదుగా వీవీఐపీ, వీఐపీలు, దేశవిదేశాల నుంచి వచ్చే వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఇంతటి ప్రధాన్యత గల ఈ మార్గంలో ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ఐఎస్‌ఐ ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టులోకి చొరబడి విమానాలను హైజాక్ చేసే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ముష్కరుల టార్గెట్‌లో ఉన్న ఈ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్లక్ష్య చేస్తున్నారు. జీఎంఆర్‌ఐ, సైబరాబాద్ పోలీసుల సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది.
శుక్రవారం రాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ ఎయిర్‌పోర్టు బయట నిలబడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసి, జాతీయ రహదారి వరకూ తీసుకెళ్లి పారిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు ఇప్పటి వరకు ఆ క్యాబ్ ఆచూకీ, కనీసం దాని రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా కనిపెట్టలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఈ మార్గంలో సీసీ కెమెరాలు లేకపోవడమే. సీసీ కెమెరా ఉండి ఉంటే దాని ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కనిపెట్టి.. కటకటాల్లోకి నెట్టి ఉండేవారు.
నిఘా నేత్రంపై నిర్లక్ష్యం
Published Sun, Jan 26 2014 11:15 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement