
మాజీ సీఎం ఫొటో, పేర్లతో సంచరిస్తున్న 104 వాహనం
గండేపల్లి(తూర్పు గోదావరి): సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో అత్యధిక మెజార్టీతో అనూహ్యరీతిలో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ప్రజలకు మంచిపాలనతోపాటు నవరత్నాల పథకం అమలుచేసేందుకు శ్రమిస్తున్న వైనం అందరికీ ఎరుకే. నూతన ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నా ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాజీల ఫొటోలను, వారిపేర్లను కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలందిస్తున్న 104 వాహనంపై నేటికీ మాజీ సీఎం చంద్రబాబు ఫొటో, చంద్రన్న సంచార చికిత్స అని పేర్లు ఉండడం ఆరోగ్యశాఖ అధికారుల నిద్రమత్తుకు నిదర్శనంగా నిలుస్తోంది.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి నామకరణం చేసినా వాహనంపై మాజీల ఫొటోలు ఉండటంపై ఆపార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి వైద్య సేవలందిస్తున్న 104, 108 వాహనాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటోలను ఉపయోగించాలని అలాగే పేర్లు మార్పుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment