రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసినా ఏమీ చేయలేమని స్పష్టం చేస్తూ ‘నో చేంజ్ ’ అంటూ పరీక్షల విభాగం ఇచ్చిన లెటర్
ఒకప్పుడు పదో తరగతి పాస్ అయితేనే గొప్ప.. కానీ ఇప్పుడు పదో తరగతి చదివే ప్రతి విద్యార్ధి లక్ష్యం 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడమే..నిజం చెప్పాలంటే విద్యార్థి కంటే అతను చదివే కార్పొరేటు స్కూళ్లది ఇదే తాపత్రయం.. ఆ లక్ష్యంతోనే ఓ మాదిరి స్టూడెంట్‌ను కూడా రుద్ది రుద్ది 10బై10 తెప్పించేస్తుంటారు.అలాంటిది ఓ స్టూడెంట్ బాగా చదివి కూడా పబ్లిక్ పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకోలేకపోయాడు..!
ఎందుకో అనుమానమొచ్చి రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేస్తే జవాబుపత్రం ఇచ్చారు.దాన్ని పరిశీలిస్తే సదరు విద్యార్థి అన్ని ప్రశ్నలకూ సరిగ్గానే సమాధానాలు రాసినట్లు స్పష్టమైంది. కానీ దిద్దిన మాస్టారే తప్పులో కాలేశారు. తక్కువ మార్కులతో మాయ చేశారు. ఫలితంగా విద్యార్థికి గ్రేడ్ పాయింట్లు తగ్గిపోయాయి.పోనీ ఏదో తప్పు జరిగిపోయింది.. సరిదిద్దండి.. అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు.చివరికి విద్యార్థి తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్తేగానీ దిగిరాలేదు.. ‘వామ్మో.. మా పరువుపోద్ది.. అయిందేదో అయ్యింది వదిలేయండి’.. అంటూ వెంటపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని సీతమ్మధారకు చెందిన పుట్టి గౌతమ్‌సాయి 2017 మార్చిలో కొటక్ సెలేషియన్ స్కూలులో పదోతరగతి పరీక్షలు రాశాడు. ఫలితాల్లో ఒక్క తెలుగులో మినహా అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించాడు. తెలుగులో మాత్రం 9 గ్రేడ్ పాయింట్లు రావడంతో మొత్తంగా 9.8 గ్రేడ్ పాయింట్లు మాత్రమే లభించాయి. 10కి 10 రావాల్సిన తనకు.. పైగా తెలుగు పరీక్ష బాగా రాసినా ఎందుకిలా జరిగిందని అనుమానమొచ్చి వెంటనే రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేశాడు. అప్పట్లో హైదరాబాద్‌లోని చాపల్‌రోడ్‌లో ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు దరఖాస్తు చేశాడు. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు స్పందించిన పరీక్షల విభాగం ‘నో చేంజ్’ అంటూ లిఖితపూర్వక సమాచారం పంపించి.. గౌతమ్ సాయి రాసిన జవాబుపత్రాల జెరాక్స్ కాపీలను పంపించింది.
జవాబుపత్రాలతోబయటపడిన పొరపాట్లు
సరిగ్గా అక్కడే దిద్దిన మాస్టారు తప్పు.. రీవాల్యుయేషన్‌లోనూ సరిదిద్దని ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం నిర్వాకం బయటపడ్డాయి. తెలుగు పేపర్‌లో మొదటి 9 ప్రశ్నల వరకు సరైన సమాధానాలకు రెండు మార్కులు ఇవ్వాల్సి ఉండగా, 10, 11, 12 ప్రశ్నలకు సరైన సమాధానాలకు ఐదు మార్కులు ఇవ్వాల్సి ఉంది. గౌతమ్‌సాయి 10, 11, 12 ప్రశ్నలకు సరైన సమాధానం రాసినప్పటికీ... మొదటి తొమ్మిది ప్రశ్నలకు రెండేసి మార్కులు వేసుకుంటూ వచ్చిన ఎగ్జామినర్ ఆ ఐదు మార్కుల ప్రశ్నలకు కూడా పొరపాటుగా రెండు మార్కులు చొప్పునే వేసేశారు. దీంతో మొత్తానికి అతని మార్కుల శాతం తగ్గి గ్రేడ్ పడిపోయింది. ఇదంతా జవాబుపత్రాలను చూస్తే అర్ధమైంది.
ఏడాదిన్నర తిరిగినాపట్టించుకోని పరీక్షల విభాగం
వెంటనే విద్యార్ధి తనకు జరిగిన అన్యాయాన్ని పరీక్షల విభాగం దృష్టికి తీసుకువెళ్లి గ్రేడ్ సరిచేయాల్సిందిగా దరఖాస్తు చేశాడు. అయితే తామేమీ చేయలేమని అధికారులు తేల్చిచెప్పేశారు. పొరపాటు స్పష్టంగా తెలుస్తోంది కదా.. కాస్త సరిచేయమని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో సదరు విద్యార్ధి తండ్రి, ఏయూలో ప్రొఫెసర్‌గా చేస్తున్న పుట్టి శ్రీనివాసరావు పక్కా ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు.
అప్పటివరకు ఎన్నిసార్లు కలిసినా స్పందించని పరీక్షల విభాగం అధికారులు హైకోర్టులో రిట్ ఫైల్ చేయగానే దిగొచ్చారు. ఈసారికి వదిలేయండి.. ఎక్కడో పొరపాటు జరిగింది.. అని విన్నవించుకున్నారు. అయితే విషయం కోర్టులో ఉంది కాబట్టి దానిపై ఏమీ మాట్లాడలేనని విద్యార్ధి తండ్రి పరీక్షల విభాగం అధికారులకు స్పష్టం చేసేశారు. ఇక్కడ విషయమేమిటంటే.. సదరు విద్యార్ధి తండ్రి, ఏయూలో సీనియర్ ప్రాఫెసర్ కావడం, ఎంత ఖర్చయినా హైదరాబాద్, అమరావతిలకు తిరగడం. హైకోర్టు న్యాయవాది తన బంధువు కావడంతో రిట్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుని విషయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వరకూ తీసుకువెళ్లగలిగారు. కానీ ఇదే అన్యాయం సామాన్యుడికి జరిగితే ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment