విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో నగదు బదిలీ పథకం అమలుకు అధికారులు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సోమవారం జేసీ తన చాంబర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వంట గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం వర్తించనుండడంతో ఈ నెలాఖరులోగా ఆధార్‌తో బ్యాంకు అకౌంట్లు, గ్యాస్ కనెక్షన్లను 70 శాతం వరకు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 9,44,694 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వీరందరికీ నగదు బదిలీ పథకం వర్తించనుందని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ డబ్బులు నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనే ఒక నెల అడ్వాన్సుగా జమవుతాయన్నారు.
93 శాతం ఆధార్ పూర్తి : జిల్లాలో మొత్తం 42,88,113 మంది జనాభా ఉండగా, వీరిలో 37,08,259 మందికి కార్డులు మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 60 శాతం మందికి కార్డుల పంపిణీ జరిగిందన్నారు. ఇంకా 5,79,854 మంది ఆధార్ తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెల ఒకటో తేదీలోగా ఆధార్ కోసం వివరాలను నమోదు చేసుకోవాలని, లేకుంటే సబ్సిడీ గ్యాస్ లభించే అవకాశం ఉండదన్నారు. నాన్‌సబ్సిడీలో రూ.992కు సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆధార్‌కార్డులు వచ్చిన వారందరి బ్యాంకు, గ్యాస్ కనెక్షన్ల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఆధార్‌కార్డులు ఉన్న వారు వెంటనే బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలని, ప్రస్తుతం అన్ని జాతీయ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇస్తున్నారని తెలిపారు.
అవసరమైతే కొత్తగా ఆధార్ కేంద్రాలు : జిల్లాలో కొన్ని రేషన్‌దుకాణాల పరిధిలో 60 శాతం వరకు మాత్రమే ఆధార్ నమోదు జరిగినట్టు తెలుస్తోందన్నారు. దీనిపై ఇటీవలే డీలర్లతో సమావేశం నిర్వహించామన్నారు. కార్డుదారులు ఎవరైనా ఆధార్ తీసుకోని పక్షంలో ఎంత మంది ఉన్నారో గుర్తిస్తే వారి కోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఎన్‌పీఆర్ తప్పనిసరి : నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ(ఎన్‌పీఆర్) బయోమెట్రిక్‌ను జిల్లా ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ముంబయిలో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకొని దేశంలో అన్ని కోస్తా ప్రాంతాల్లో ఈ ఎన్‌పీఆర్‌ను కేంద్రం చేపడుతోందన్నారు. రక్షణపరంగా ఇది అత్యవసరమన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో సర్టిఫికెట్లు : ప్రసుత్తం తహశీల్దార్లు అందరూ సమైక్యాంధ్ర కోసం సమ్మెలో ఉండడంతో ఆయా కార్యాలయాల్లో పూర్తి సేవలు స్తంభించాయని జేసీ చెప్పారు. దీంతో ధ్రువపత్రాల కోసం విద్యార్థులు, ఉద్యోగులు కొంత ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగ, ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక ధ్రువపత్రాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. సమ్మె అనంతరం వీరికి పూర్తి స్థాయి పత్రాలు మంజూరు చేస్తామని చెప్పారు.