ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అనిల్‌కుమార్ యాదవ్
- పదే పదే తప్పుడు వార్తలు రాస్తే.. అబద్ధాలు నిజాలు కావు
- నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు సిటీ: ఆంధ్రజ్యోతి దినపత్రిక 10 రోజులుగా తనపై పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తోందని.. పదేపదే రాస్తే అబద్ధాలు నిజాలు కావని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని నిరసిస్తూ నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట గురువారం శాంతియుత ధర్నా చేసేందుకు ఆయన పూనుకున్నారు. ఆ క్రమంలో పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ తమపై అసత్య కథనాలు రాస్తున్నందుకు నిరసనగా శాంతియుత ధర్నా చేసేందుకు వచ్చామని, అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. శుక్రవారం పండుగ అయినందున ధర్నా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. దీంతో పోలీసులపై గౌరవంతో ధర్నాను విరమించుకుంటున్నట్టు ఎమ్మెల్యే అనిల్ ప్రకటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. దీనికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు ప్రచురించడం బాధ కలిగించిందన్నారు.
నిజాయతీని నిరూపిం చుకుంటా..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశపూ ర్వకంగా తమను బెట్టింగ్ కేసుల్లో ఇరికించేందుకు ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయిస్తున్నట్టు ఉందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. క్రికెట్ బుకీ శంషీర్ తన అనుచరుడని రాశారని, అతడు ఏ టీడీపీ నేతకు అనుచరుడో ప్రజలకే తెలుసని అన్నారు. ప్రతిరోజూ పనిగట్టుకుని తమను ఇబ్బంది పెట్టేందుకు ఏదో ఒక కథనం రాస్తున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు చేసి ఎన్ని కథనాలు రాసినా.. తన నిజాయతీని ప్రజాక్షేత్రంలో నిరూపిం చుకుంటానని తెలిపారు. తనపై అసత్య వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికపై పరు వు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.