పల్లెల పాలిట మరణశాసం ఫ్లోరోసిస్‌ | Nellore Villages Suffering With Fluoride Disease | Sakshi
Sakshi News home page

పల్లెల పాలిట మరణశాసం ఫ్లోరోసిస్‌

Published Wed, May 1 2019 1:22 PM | Last Updated on Wed, May 1 2019 1:22 PM

Nellore Villages Suffering With Fluoride Disease - Sakshi

జన ప్రాణాధారమైన జలమే మరణశాసనాన్ని లిఖిస్తోంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన అధికారులు, పాలకుల నిర్లక్ష్యం పల్లెల పాలిట శాపంగా మారుతోంది. మానవుల స్వార్థ పూరిత చర్యలకు ప్రకృతి సిద్ధంగా లభించే గాలి, నీరు కలుషితంగా మారుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో నానాటికి పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో భూమి అంతర్గత పొరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి పొరల స్వరూపాలు కోల్పోయి సహజ మినరల్స్‌ శాతం అతిగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ఫ్లోరైడ్‌ శాతం పెరగడంతో ప్రాణాంతకమవుతోంది. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి పరిస్థితుల్లో ఫ్లోరోసిస్‌ మానవాళి ఆయష్షుకు ప్రతిబంధకం అవుతోంది. వింజమూరు మండలంలోని శంఖవరంలో ఏడాదికి కనీసం పది మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో కాలం చేస్తున్నారు. వందల సంఖ్యలో జనం కీళ్లు, కిడ్నీ వ్యాధులతో దుర్భర జీవనం సాగిస్తున్నారు.

నెల్లూరు, వింజమూరు: మండలంలో ఫ్లోరైడ్‌ పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాగేనీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా పెరగడంతో ఆ నీటిని తాగుతున్న జనం కీళ్ల, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని శంఖవరం, వెంకటాద్రిపాళెం, ఎ.కిస్తీపురం, నందిగుంట ఎస్సీ కాలనీ, తక్కెళ్లపాడు, రావిపాడు, గోళ్లవారిపల్లి, చౌవటపల్లిలో తాగునీటిలో 1.5 శాతం కంటే ఎక్కువగా ఫ్లోరిన్‌ ఉందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులే గుర్తించారు. అయితే ఆయా గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు అధికారులు, పాలకులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.

నీటి పథకాలు సరే..ఫ్లోరైడ్‌ నియంత్రణ శూన్యం
మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉన్నట్లు గుర్తించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీటి పథకాలు ఏర్పాటు చేశారు. శంఖవరంలో  ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ క్వాలిటీ ఫండ్‌ కింద అధునాతన వాటర్‌ ప్లాంట్‌ మంజూరైంది. మిగతా 7 గ్రామాల్లో రూ.6.4 లక్షల నిధులతో ఒక్కో వాటర్‌ ప్లాంట్‌ మంజూరు చేశారు. అయితే ఇవి అందుబాటులోకి వచ్చినా నీటిలో ఫ్లోరైడ్‌ నియంత్రణ జరగకపోవడంతో ఫ్లోరోసిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎముకలు, కీళ్లు బలహీనపడి తక్కువ వయస్సులో నడుము వంగి వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి. కొంత మంది పూర్తిగా నడవలేక కర్ర సాయంతోనూ, జోగాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ కిడ్నీవ్యాధిగ్రస్తుల సంఖ్య పదుల్లో ఉంది. వీరంతా నెల్లూరుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి వెళ్లి డయాలసిస్‌ చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. గత పదేళ్ల కాలంలో ఒక్క శంఖవరం ఎస్సీ కాలనీలోనే కిడ్నీ వ్యాధితో 38 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా గతంలో చేతి పంపుల్లోని ఫ్లోరైడ్‌ నీరు తాగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మండలంలో ఫ్లోరైడ్‌ ఉన్న  8 గ్రామాల్లో ఏడాదికి కనీసం పది మంది మరణిస్తున్నారు.

ఫ్లోరైడ్‌ పీడత గ్రామాలు పెరిగే అవకాశం
మండలంలో ఇప్పటికే  8 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గుర్తించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో వర్షపాతం శాతం గణనీయంగా పడిపోయాయని, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పాటు భూమి పొరల్లో సంభవించిన మార్పుల నేపథ్యంలో సహజ సిద్ధంగా లభిస్తున్న తాగునీటిలో మినరల్స్‌ శాతాలు పెరుగుతున్నాయిన చెబుతున్నారు. ఇంకా చాలా గ్రామాల్లో నీటి పరీక్షలు జరిపితే ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు.  

42 ఏళ్ల వయస్సులో జోగాడుతూ..
ఈమె పేరు బక్కా హజరత్తమ్మ. వయస్సు 42 ఏళ్లు ఫ్లోరైడ్‌తో రెండు కాళ్లూ నాలుగేళ్ల క్రితం నుంచి పని చేయలేదు. అప్పటి నుంచి జోగాడుతుంది. వికలాంగురాలై పింఛనుతో బతుకుతోంది. ఈ కుటుంబంలో ముగ్గురు కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఇల్లు విడిచి బయటకు రాలేని పరిస్థితి. తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి. 10 ఏళ్ల క్రితం వరకు ఈమె రోజూ కూలి పనులకు వెళ్లేది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇలా మారింది.

ఊతకర్ర సాయంతో..
ఈతని పేరు మాతంగి పెంచలయ్య. వయస్సు 47 సంవత్సరాలు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇప్పుడు అతను ఊత కర్ర సాయం లేనిదే నడవలేని పరిస్థితి. తాగునీటి వల్లేనని డాక్టర్లు చెప్పారు. ముగ్గురు బిడ్డలు. వారిని ఇంకా చదివించాలి. కాని పని చేయలేక వారిని కూడా ఏదో ఒక కంపెనీలోకి పంపించాలను కుంటున్నాడు. కుటుంబాన్ని పోషించాల్సిన తాను తన కుటుంబానికి భారమైనట్లు కన్నీటి పర్యంతమవుతున్నాడు.

కాళ్లు వాపులొచ్చాయి
నాకు 40 ఏళ్ల వయస్సు. నేను సంవత్సరం నుంచి కాళ్లు వాచి నడువలేక బాధపడుతున్నాను. ఆస్పత్రుల చుట్టూ తిరిగాను. సుమారు రూ.30 వేలు ఖర్చు పెట్టాను. నా భర్త కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులు నాకు వైద్యానికి సరిపోతున్నాయి.– విజయమ్మ, శంఖవరం ఎస్సీ కాలనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement