నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక రెండవసారి కూడా వాయిదా వేశారు. క్వారంలేక వాయిదావేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించి ఎన్నికల హాలు నుంచి వెళ్లిపోయారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఆయన చెప్పలేదు. టిడిపి జడ్పిటిసి సభ్యులు హాజరైనట్లు సంతకం చేయడానికి నిరాకరించారు. వారితోపాటు వైఎస్ఆర్ సిపి కావలి జడ్పిటిసి సభ్యురాలు పెంచలమ్మ కూడా సంతకం చేయడానికి నిరాకరించారు.
నెల్లూరు జిల్లా పరిషత్లో 46 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. వాటిలో 31 స్థానాలను వైఎస్ఆర్ సిపి గెలుచుకుంది. 15 స్థానాలను మాత్రమే టిడిపి గెలుచుకుంది. 24 మంది వైఎస్ఆర్ సిపి సభ్యులు కలసి వచ్చారు. ఎన్నికలు నిర్వహించే హాలులోకి 23 మంది వెళ్లారు.
ఆ తరువాత పెంచలమ్మను పోలీసులు తీసుకువెళ్లారు. వైఎస్ఆర్‌సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. పెంచలమ్మను సమావేశం హాలుకు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఆ తరువాత సమావేశం హాల్‌కు వచ్చిన పెంచలమ్మను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఎక్కడకు తీసుకువెళ్లింది తెలియలేదు. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని పోలీసులు వివరణ ఇచ్చారు. కాసేపట్లో ఎన్నిక ఉండగా తీసుకెళ్లడమేంటని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బారికేడ్లను తొలగించేందుకు టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆరుగురు జడ్పిటిసి సభ్యులు టీడీపీ వరుసలోకి వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని వారిని కలెక్టర్ హెచ్చరించారు. ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీ వరుసలోకి వెళ్లాలని కలెక్టర్ చెప్పారు. అయినా ఆ ఆరుగురు ఆయన మాటలను పట్టించుకోలేదు. వారిని బయటకు వెళ్లిపొమ్మని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో నలుగురు వైఎస్ఆర్ సిపి సభ్యులను పోలీసులు బయటకు పంపించారు. వారు మళ్లీ జడ్పీ హాల్‌లోకి వచ్చారు. టీడీపీ వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. రహస్య ఓటింగ్‌కు టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. అది కుదరదని జిల్లా కలెక్టర్ చెప్పారు. చివరకు కోరంలేక ఎన్నిక వాయిదావేసినట్లు కలెక్టర్ ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.