రాక్షస పాలనకు చరమ గీతం | ysrcp leaders fires on tdp government in nellore Youth Conference | Sakshi
Sakshi News home page

రాక్షస పాలనకు చరమ గీతం

Published Sat, Jan 6 2018 10:16 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

ysrcp leaders fires on tdp government in nellore Youth Conference - Sakshi

సాక్షి, నెల్లూరు: చంద్రబాబు సాగిస్తున్న అరాచక, రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు అంతా సన్నద్ధం కావాలని వైఎస్సార్‌ సీపీ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. అహంకార పూరితంగా పాల న సాగిస్తున్న చంద్రబాబుకు యువత బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అందుకు సింహపురి నుంచే సింహనాదం మోగిద్దామంటూ సమరశంఖం పూరించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్‌లోని టౌన్‌హాల్‌లో ‘జగనన్న కోసం’ పేరిట శుక్రవారం నిర్వహించిన యువజన సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి యువత పెద్దఎత్తున తరలివచ్చింది. 

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే  రోజా మాట్లాడుతూ సింహం లాంటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా సింహపురి గడ్డనుంచే పిడికిలి బిగించి చంద్రబాబుకు దిమ్మతిరిగేలాచేద్దామన్నారు. పార్టీ రీజినల్‌ ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు  అహంకారపూరితంగా సాగిస్తు న్న రాక్షస పాలనకు చరమగీతం పాడదామన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు అనేక అవకాశాలు ఇచ్చే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ యువత సత్తా ఏమిటో టీడీపీ ప్రభుత్వానికి చూపిస్తామన్నారు. పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వైఎస్సార్‌ సీపీకి కంచుకోటగా ఉందన్నారు. 

నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సైనికులుగా ముందుకు కదులుదామన్నారు. గూడూరు నియోజవర్గ సమన్వయకర్త మేరిగ మురళి మాట్లాడుతూ మోసాలతో ఎంతోకాలం పాలించలేరనే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలన్నారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పొట్టేళ్ల శిరీష మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మహిళలే గుణపాఠం చెబుతారన్నారు. సదస్సులో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

యువతకు పెద్దపీట : కాకాణి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో యువతకు ప్రత్యేక స్థానం ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల సంగతి ఏమోకానీ చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని తాంత్రిక పూజలు చేయించినా చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. యువత మరింత ఉత్సాహంతో ముందుకు అడుగేసి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండి పార్టీని గెలిపించుకుందా మని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ సీపీని తిరుగులేని శక్తిగా చేద్దామన్నారు.

యువత వల్లే భవిష్యత్‌ : కిలివేటి
యువత చేతిలోనే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ ఉందని తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. వైఎస్సార్‌ సీపీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాలుగా మేలు కలుగుతుందన్నారు. చంద్రబాబు మాత్రం హోదాకు అడ్డు తగులుతున్నారన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం అడుగులో అడుగేద్దామన్నారు. హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ చాలన్న చంద్రబాబుకు బుద్ధి చెబుదామన్నారు.

ఎన్నికలకు ఎప్పుడొచ్చినా సిద్ధం : రామిరెడ్డి
ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబును ఎదుర్కొనేందుకు అం తా సిద్ధంగా ఉం డాలని కావలి ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఎన్నో విధాలుగా యువతను మోసం చేస్తున్నారన్నారు. యువత భవితను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలు సాగిస్తున్నారని చెప్పారు.        

అరాచక పాలన సాగుతోంది : కోటంరెడ్డి
రాష్ట్రంలో దుర్మార్గపు, అరాచక పాలన సాగుతోందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే నాయకుడు కాదని, నిజాయితీ రాజకీయాలకు చిరునామాగా ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని తాము గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి గర్వపడుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా చిరగడం ఖాయమని, వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరడం తథ్యమని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే చర్చ ప్రజల్లో జరుగుతోందన్నారు.     

 విజయమో.. వీర స్వర్గమో : అనిల్‌కుమార్‌
నిజాయితీగా రాజకీయాలు చేసే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపిద్దామని నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. విజయమో.. వీర స్వర్గమో అనే విధంగా ముందుకు సాగుదామని యువతకు పిలుపునిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బకొట్టాలని ఎంతోమంది చూస్తున్నారన్నారు. మనమంతా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకుని వద్దామన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే కొందరు సినిమా వాళ్లు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. చిరంజీవి తొమ్మిదేళ్లు కష్టంలో ఉంటే పట్టించుకోని ఒకాయన.. ఇప్పుడు మాత్రం అన్నకు ద్రోహం చేసిన వాళ్లను వదలనంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రతో టీడీపీలో వణుకు పుడుతోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి నెల్లూరు జిల్లా అండగా ఉందనే విషయాన్ని రానున్న ఎన్నికల్లో నిరూపిస్తామన్నారు.                   

ఘరానా మోసగాడు చంద్రబాబు : నల్లపరెడ్డి
ఘరానా మోసగాడు సీఎం చంద్రబాబు అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి యువతే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో యువత ప్రధాన భూమిక పోషించి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. త్వరలో జిల్లాకు రానున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను జయప్రదం చేయాలన్నారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా యువత అడుగు మందుకు వేయాలన్నారు.                         

విజయం కానుకగా ఇద్దాం : బొమ్మిరెడ్డి
జిల్లాలో వైఎస్సార్‌ సీపీకి తిరుగులేని మెజార్టీ తీసుకొచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని జెడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికలలో అందరం సమష్టిగా కష్టపడి అధికారంలోకి వద్దామన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్‌ సీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల దీవెనతో ముందుకు వెళదామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement