నెల్లూరులో వైఎస్సార్ సీపీ సంబరాలు
నెల్లూరు:జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆదివారం జరిగిన జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ తాజా విజయంతో జిల్లాలో వైఎస్సార్ పార్టీ మరింత బలపడిందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాను టీడీపీ ఎలాగైనా కైవసం చేసుకుందామని భావించి వైఎస్సార్ సీపీ జడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేసినా.. చివరకు పార్టీ జయకేతనం ఎగురవేయడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇక్కడ నెల్లూరు జిల్లా పరిషత్లో 46 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. వాటిలో 31 స్థానాలను వైఎస్ఆర్ సిపి గెలుచుకుంది. 15 స్థానాలను మాత్రమే టిడిపి గెలుచుకుంది. అయితే కొంతమంది వైఎస్సార్ సీపీ సభ్యులను టీడీపీ తమవైపుకు తిప్పకోవడంతో ఎన్నికపై చివరి వరకూ ఆసక్తి నెలకొంది. దీంతో జడ్పీ చైర్మన్ ఎన్నికను లాటరీ ద్వారానే నిర్ణయించాల్సి వచ్చింది. లాటరీ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికలో వైఎస్సార్ సీపీ విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అక్రమాలు పాల్పడిన ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొబోతోందని వైఎస్సార్ సీపీ నాయకులు హెచ్చరించారు. ప్రశాంతంగా జరగాల్సిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్త వాతావరణంలో జరగడం దురదృష్టకరమైనా.. చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్సార్ సీపీ నాయకులు స్పష్టం చేశారు.