సాక్షి, అమరావతి బ్యూరో : బాలికలను అన్నింటా ఆగ్రగామిగా నిలబెడతాం...వారి కాళ్లపై నిలబడేలా చేస్తాం... అంటూ ఊదరగొట్టే ప్రసంగాలు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. బాలికల కనీస అవసరాలు, వారి ఇబ్బందులను తీర్చలేకపోతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత కొరవడి అనారోగ్యం పాలవుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నామని ప్రకటనలను గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. గతంలో ఉన్న పథకాలను టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి అటకెక్కిస్తోంది. అలాంటి పథకాల్లో నేస్తం పథకం ఒకటి. ఈ పథకం కింద 8, 9, 10 తరగతుల విద్యార్థినులకు న్యాప్‌కిన్లను పంపిణీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికా విద్యను ప్రోత్సహించేందుకు గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో నేస్తం కార్యక్రమాన్ని అమలు చేసింది. విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలపై అవగాహన కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఆ పథకం ఇప్పుడు ఎక్కడా...ఏ పాఠశాలలో అమలవటం లేదు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తమ బిడ్డలను నెలలో కొద్ది రోజులు పాఠశాలకు దూరం చేస్తున్నారు. ఈ పరిస్థితితో వారి చదువుకు ఆటంకం కలుగుతోంది.
జిల్లాలో ఎదురు చూపులే....
జిల్లా వ్యాప్తంగా 2852 పాఠశాలలు ఉండగా అందులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు 13,970 మంది, 9వ తరగతిలో 12,436, 8వ తరగతిలో 11,560 మంది కలసి సుమారు 38 వేల మంది బాలికలు ఉన్నారు. వీరు కాక మోడల్ స్కూల్స్, సంక్షేమ హాస్టల్ వంటి సంస్థల్లో మరో నాలుగు వేల మంది దాకా ఉన్నారు. మొత్తం 42 వేల మంది విద్యార్థినులు ఈ పథకానికి ఆర్హులున్నారు. వీరికి ప్రతి ఏడాది సరిపడా శానిటరీ న్యాప్‌కిన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేస్తుందే తప్ప బాలికలకు అవసరమైన న్యాప్‌కిన్ల పంపిణీకి మాత్రం చేతులు రావడంలేదు. విద్యార్థినులు ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాప్‌కిన్లను ఇవ్వకపోవడంతో వారి వేదన వర్ణనాతీతం. ఎవరికి చెప్పుకోలేని ఇటువంటి సున్నితమైన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.
తొలి ఏడాదితోనే మంగళం...
ప్రభుత్వ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు న్యాపికిన్ కిట్‌లను సర్వశిక్ష అభియాన్ ద్వారా పంపిణీ చేసేలా 2013–14 విద్యా సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది టీడీపీ దీన్ని ఆరోగ్య శాఖకు అప్పగించింది. ఆ ఒక్క ఏడాది మాత్రమే ఆశా కార్యకర్తల ద్వారా ఒక కిట్ ( 8 పీస్‌లు )ను రూ.8కి విక్రయించేలా చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాప్‌కిన్లను పంపిణీ ఊసే ఎత్తలేదు. విద్యార్థినులు సమస్యను ఆర్థం చేసుకొని ఈ ఏడాదైనా ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకుంటాందా అని విద్యార్థినుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
అవగాహన కార్యక్రమాలేవీ ?
విద్యార్థినులకు నెలసరి కౌమార దశలో ప్రారంభం అవుతుంది. దీంతో వారికి అవగాహన లేకపోవడంతో చాలా భయాందోళన ఉంటారు. ఆరోగ్యశాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ ఇటువంటి కార్యక్రమాలేవి ప్రభుత్వం చేపట్టడం లేదు. వేల కోట్లు వృథా చేస్తూ జ్ఞానధార వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సర్కార్‌కి ఇటువంటి అవగాహన పెంచే సదస్సులను మాత్రం ఏర్పాటు చేయడం లేదు.
ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం
గతంలో సర్వశిక్షా అభియాన్ ద్వారా పంపిణీ చేశాం. తరువాత వాటి సరçఫరా అందలేదు. ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
–ప్రసాద్, సర్వశిక్షా అభయాన్ పీఓ
Comments
Please login to add a commentAdd a comment