nestham foundation
-
బడికొస్తా.. నిరాశ
పశ్చిమగోదావరి, నిడమర్రు: విద్యా హక్కు చట్టం ప్రకారం బాలికా విద్యను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాలది. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అనేక పథకాలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీరుగారుతున్నాయి. ఏటా ప్రభు త్వ విద్యార్థినులకు అందించే న్యాప్కిన్ల పంపిణీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ‘నేస్తం’ పథకం అటకెక్కింది. 9వ తరగతి బాలికలకు ఉచిత సైకిళ్ల పథకం రెండేళ్లుగా వాయిదాలతో సా..గు..తోంది. గతేడాది అందాల్సిన ఉచిత సైకిళ్లకు సర్కారు మంగళం పాడింది. ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 8, 9వ తరగతుల విద్యార్థినులను మాత్రమే విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంది. లక్ష్యంపై నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2016లో ‘బడికొస్తా’ పథకాన్ని ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యకే బాలికలు పరిమితం కాకుండా ఉన్నత విద్యలోనూ కొనసాగించాలనేది ఈ పథకం లక్ష్యం. ఇంటికి పాఠశాల దూరంగా ఉండడంతో చదువుకు స్వస్తి చెప్పకుండా 9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఉచితంగా సైకిల్ ఇచ్చేలా కార్యాచరణ రూపొం దించారు. 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో నమోదైన 9వ తరగతి విద్యార్థినులు 16,841 మందికి సైకిళ్లు పంపిణీ చేయాల్సుంది. ఐతే వారంతా 10వ తరగతిలోకి చేరాక 2017–18లో సైకిళ్లను అందించారు. ఈ ఏడాది 8, 9వ తరగతుల విద్యార్థినులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నేటికీ ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. మరో మూడు నెలల్లో ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. గతేడాది మంగళం 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించిన సైకిళ్లను ఏడాది తర్వాత 2017–18 విద్యా సంవత్సరంలో పంపిణీ చేశారు. గతేడాది 9వ తరగతి చదివిన బాలికలకు నేటికీ సైకిళ్లు అందలేదు. ఈ ఏడాది 9వ తరగతితో పాటు 8వ తరగతి బాలికలకూ సైకిళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రటించింది. ఈ నేపథ్యంలో గతేడాది తొమ్మిది చదివిన విద్యార్థినుల పరిస్థితి ఏమిటని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఏడెడ్ పాఠశాలల్లో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సామాజక వర్గాల బాలికలకు ఉచితంగా సైకిళ్లు అందిస్తారు. అర్హులు 35,200 మంది గతంలో జిల్లాలో 16,841 మందికి సైకిళ్లు అందాయి. సైకిళ్లను ఆధార్ అనుసంధానం చేసి బయోమెట్రిక్ హాజరు ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వివిధ కారణాల దృష్ట్యా జిల్లాలో 2,122 సైకిళ్లు మిగిలిపోయాయి. ఇవి ఆయా పాఠశాలల్లో, ఎంఆర్సీ భవనాల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం 8,9 తరగతుల్లో నమోదైన బాలికలు 35,200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సైకిల్ ఖరీదు రూ.3,680గా టెండర్ పూర్తి చేసినట్లు మే నెలలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సైకిళ్ల పంపిణీకి రూ.12.95 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను విద్యార్థులకు సంబంధించిన ఆయా సామాజిక వర్గాల కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గుత్తేదారులు సైకిల్ విడిభాగాలు తీసుకొచ్చి పాఠశాలల వద్దే సైకిళ్లు బిగించి హెచ్ఎంలకు అందించనున్నారు. సైకిళ్లు అందలేదు గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివిన విద్యార్థినులకు సైకిళ్లు అందలేదు. 2016–17లో 9వ తరగతి చదివిన వారికి టెన్త్‌లోకి వచ్చాక సైకిళ్లు ఇచ్చారు. మా పాఠశాలకు రవాణా సౌకర్యం లేని మందలపర్రు, గుణపర్రు తదితర గ్రామాల నుంచి విద్యార్థినులు వస్తారు. వీరికి సైకిళ్లు ఇస్తే హాజరు శాతం పెరుగుతుంది.– యర్రంశెట్టి శేషగిరి, హెచ్ఎం, నిడమర్రు అర్హత కోల్పోయాను ఐదు కిలో మీటర్ల దూరంలోని మండల కేంద్రం నిడమర్రులో ఉన్న జెడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఏడాది నుంచి సైకిల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఏడాది నుంచి 8, 9వ తరగతి బాలికలకే ఇస్తానంటున్నారు. నాకు సైకిల్ వచ్చే అవకాశం లేదు.– సీహెచ్ లాస్యప్రియ, 10వ తరగతి విద్యార్థిని, మందలపర్రు సైకిళ్లు త్వరలో అందిస్తాం బడికొస్తా పథకం సైకిళ్లు త్వరలో అందిస్తాం. ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 8, 9వ తరగతి విద్యార్థినుల వివరాలు ఉన్నతాధికారులకు అందించాం. గతేడాది మిగిలిన సైకిళ్లను మినహాయించి కొత్త సైకిళ్లు అందిస్తామన్నారు. అప్పటికి వాటిని జాగ్రత్త చేయమన్నారు.– సబ్బితి నర్సింహమూర్తి, జిల్లా అధ్యక్షులు, ఎంఈఓల సంఘం -
నేస్తమా..నీ జాడేదీ?
సాక్షి, అమరావతి బ్యూరో : బాలికలను అన్నింటా ఆగ్రగామిగా నిలబెడతాం...వారి కాళ్లపై నిలబడేలా చేస్తాం... అంటూ ఊదరగొట్టే ప్రసంగాలు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. బాలికల కనీస అవసరాలు, వారి ఇబ్బందులను తీర్చలేకపోతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత కొరవడి అనారోగ్యం పాలవుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నామని ప్రకటనలను గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. గతంలో ఉన్న పథకాలను టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి అటకెక్కిస్తోంది. అలాంటి పథకాల్లో నేస్తం పథకం ఒకటి. ఈ పథకం కింద 8, 9, 10 తరగతుల విద్యార్థినులకు న్యాప్కిన్లను పంపిణీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికా విద్యను ప్రోత్సహించేందుకు గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో నేస్తం కార్యక్రమాన్ని అమలు చేసింది. విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలపై అవగాహన కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఆ పథకం ఇప్పుడు ఎక్కడా...ఏ పాఠశాలలో అమలవటం లేదు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తమ బిడ్డలను నెలలో కొద్ది రోజులు పాఠశాలకు దూరం చేస్తున్నారు. ఈ పరిస్థితితో వారి చదువుకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలో ఎదురు చూపులే.... జిల్లా వ్యాప్తంగా 2852 పాఠశాలలు ఉండగా అందులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు 13,970 మంది, 9వ తరగతిలో 12,436, 8వ తరగతిలో 11,560 మంది కలసి సుమారు 38 వేల మంది బాలికలు ఉన్నారు. వీరు కాక మోడల్ స్కూల్స్, సంక్షేమ హాస్టల్ వంటి సంస్థల్లో మరో నాలుగు వేల మంది దాకా ఉన్నారు. మొత్తం 42 వేల మంది విద్యార్థినులు ఈ పథకానికి ఆర్హులున్నారు. వీరికి ప్రతి ఏడాది సరిపడా శానిటరీ న్యాప్కిన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేస్తుందే తప్ప బాలికలకు అవసరమైన న్యాప్కిన్ల పంపిణీకి మాత్రం చేతులు రావడంలేదు. విద్యార్థినులు ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాప్కిన్లను ఇవ్వకపోవడంతో వారి వేదన వర్ణనాతీతం. ఎవరికి చెప్పుకోలేని ఇటువంటి సున్నితమైన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తొలి ఏడాదితోనే మంగళం... ప్రభుత్వ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు న్యాపికిన్ కిట్లను సర్వశిక్ష అభియాన్ ద్వారా పంపిణీ చేసేలా 2013–14 విద్యా సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది టీడీపీ దీన్ని ఆరోగ్య శాఖకు అప్పగించింది. ఆ ఒక్క ఏడాది మాత్రమే ఆశా కార్యకర్తల ద్వారా ఒక కిట్ ( 8 పీస్‌లు )ను రూ.8కి విక్రయించేలా చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాప్కిన్లను పంపిణీ ఊసే ఎత్తలేదు. విద్యార్థినులు సమస్యను ఆర్థం చేసుకొని ఈ ఏడాదైనా ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకుంటాందా అని విద్యార్థినుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అవగాహన కార్యక్రమాలేవీ ? విద్యార్థినులకు నెలసరి కౌమార దశలో ప్రారంభం అవుతుంది. దీంతో వారికి అవగాహన లేకపోవడంతో చాలా భయాందోళన ఉంటారు. ఆరోగ్యశాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ ఇటువంటి కార్యక్రమాలేవి ప్రభుత్వం చేపట్టడం లేదు. వేల కోట్లు వృథా చేస్తూ జ్ఞానధార వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సర్కార్‌కి ఇటువంటి అవగాహన పెంచే సదస్సులను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం గతంలో సర్వశిక్షా అభియాన్ ద్వారా పంపిణీ చేశాం. తరువాత వాటి సరçఫరా అందలేదు. ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. –ప్రసాద్, సర్వశిక్షా అభయాన్ పీఓ -
నేస్తమా.. నువ్వెక్కడ?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘నేస్తం’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మూడేళ్ళుగా ఈ పథకం అమలు కాకపోవడంతో పేద విద్యార్థినులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. దీంతోపాటు తీవ్ర ఒత్తిడికి గురవడంతో నిత్యం చదువుపై ఒకింత ఏకాగ్రత లోపిస్తోంది. ఎవరికి చెప్పుకోలేక లోలోన సతమతమవుతూ విద్యకు దూరమవుతున్నారు. సత్తెనపల్లి : పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థినుల సౌకర్యార్థం... వారిని అన్ని విధాల ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘నేస్తం’ పథకం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న వారికి అండగా నిలవాలని దీన్ని చేపట్టింది. రుతుక్రమ సమయంలో 15 ఏళ్ళ లోపు బాలికలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని... మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించిన అప్పటి విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రుతు రుమాళ్ళ (న్యాప్కిన్స్)ను బాలికలకు ఉచితంగా అందజేశారు. వీటిని ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. అయితే, మూడేళ్లుగా ఈ పథకం అటకెక్కడంతో బాలికలకు రుమాళ్ళు అందడం లేదు. వీరు పేదవారు కావడం, రుతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం, నగదు చెల్లించి న్యాప్కిన్స్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బాలికకు అప్పట్లో 6 నుంచి 8 రుమాళ్ళు పంపిణీ చేశారు. మార్కెట్లో పదింటి ధర రూ.35 నుంచి రూ.50 పైనే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో.. కర్ణాటక, కేరళ, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో బాలికలకు రుమాళ్ళు అందజేస్తున్నారు. వీటిని అక్కడ ప్రభుత్వాలే కొనుగోలు చేసి ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నాయి. వీటిని వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫలితంగా పాఠశాలలకు దూరమయ్యే బాలికల సంఖ్య తగ్గినట్లు విద్యారంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రత్యేక గదులు లేవు... ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల వ్యక్తిగత అవసరాలకు ఏ పాఠశాలల్లోనూ ప్రత్యేకమైన గదులు కానరావడం లేదు. ఫలితంగా తరచూ విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పనలవి కావు. గదులు లేకపోవడం వలన బాలికలకు నేస్తం పథకాన్ని పునః ప్రారంభించడంతోపాటు వారి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సమస్యలు ఇలా..... ♦ రుతుక్రమం సమయంలో పరిశుభ్రత లేకపోవడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ♦ సరైన రక్షణ లేక బాలికలు తరగతి గదిలో భయం భయంగా కూర్చోవడంతో చదువు పై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. ♦ ఇవన్నీ వెరసి విద్యార్థినుల్లో తెలియని బాధ, విసుగు లాంటి లక్షణాలు ఎక్కువ గా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. ♦ రుతుక్రమం సమయంలో నూనె పదార్థాలను అధికంగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, ఘాటైన మసాల, పుల్లని పదార్థాల జోలికి కూడా వెళ్ళకపోవడం ఉత్తమం. ♦ రుతు సమయంలో వ్యాయామం కూడదు. ♦ ప్రాసెస్ చేసిన ఆహారం, రోడ్డు పక్కన అమ్ముతున్న చిరు తిండ్లు, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఈ ఆహారం ఉత్తమం..... ♦ నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలనే తీసుకోవాలి. ♦ కాకరకాయ, గుమ్మడి గింజలు, బంగాళ దుంపలు, బొప్పాయి అధికంగా తీసుకోవాలి. ♦ పాలకూర, బీట్రూట్, మాంసం, డ్రై ఫ్రూట్స్, యాపిల్, ఉసిరి తదితరాలను తీసుకోవచ్చు. ♦ విటమిన్ డీ కోసం సాయంత్రం కాసేపు ఎండలో నిలబడడం వలన శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. -
రక్తదానానికి విశేష స్పందన
ఒకే రోజు 1,523 మంది రక్తదానం నెల్లూరు(అర్బన్): స్థానిక రామలింగాపురంలో నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు కోరెం ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో 1,523 మంది రక్తదానం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ రక్తదాన శిబిరంలో 140 మంది మహిళలు పాల్గొనడం విశేషం. యువజన సంక్షేమ కార్యాలయం సహకారం అందించింది. ఇండియన్ రెడ్‌క్రాస్, పెద్దాసుపత్రి, నారాయణ బ్లడ్ బ్యాంకులకు సేకరించిన రక్తాన్ని అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ నేస్తం ఫౌండేషన్ సేవలను అభినందించారు. రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమేనని తెలిపారు. ఇలాంటి సేవలు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి, సెట్నల్ సీఈవో డా.సి.వి.సుబ్రహ్మణ్యం, రాజకీయ నాయకులు నూనె మల్లిఖార్జున యాదవ్, యరబోలు రాజేష్, ముత్యాల చంద్రమోహన్, వేల్పుల మహేష్, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రక్తదాన మోటివేటర్ బయ్యా ప్రసాద్, రెడ్‌క్రాస్ చైర్మన్ డా.ఎ.వీ సుబ్రహ్మణ్యం, డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు.