ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘నేస్తం’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మూడేళ్ళుగా ఈ పథకం అమలు కాకపోవడంతో పేద విద్యార్థినులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. దీంతోపాటు తీవ్ర ఒత్తిడికి గురవడంతో నిత్యం చదువుపై ఒకింత ఏకాగ్రత లోపిస్తోంది. ఎవరికి చెప్పుకోలేక లోలోన సతమతమవుతూ విద్యకు దూరమవుతున్నారు.
సత్తెనపల్లి : పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థినుల సౌకర్యార్థం... వారిని అన్ని విధాల ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘నేస్తం’ పథకం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న వారికి అండగా నిలవాలని దీన్ని చేపట్టింది. రుతుక్రమ సమయంలో 15 ఏళ్ళ లోపు బాలికలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని... మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించిన అప్పటి విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రుతు రుమాళ్ళ (న్యాప్‌కిన్స్)ను బాలికలకు ఉచితంగా అందజేశారు. వీటిని ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. అయితే, మూడేళ్లుగా ఈ పథకం అటకెక్కడంతో బాలికలకు రుమాళ్ళు అందడం లేదు. వీరు పేదవారు కావడం, రుతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం, నగదు చెల్లించి న్యాప్‌కిన్స్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బాలికకు అప్పట్లో 6 నుంచి 8 రుమాళ్ళు పంపిణీ చేశారు. మార్కెట్‌లో పదింటి ధర రూ.35 నుంచి రూ.50 పైనే ఉంటుంది.
ఇతర రాష్ట్రాల్లో..
కర్ణాటక, కేరళ, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో బాలికలకు రుమాళ్ళు అందజేస్తున్నారు. వీటిని అక్కడ ప్రభుత్వాలే కొనుగోలు చేసి ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నాయి. వీటిని వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫలితంగా పాఠశాలలకు దూరమయ్యే బాలికల సంఖ్య తగ్గినట్లు విద్యారంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక గదులు లేవు...
ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల వ్యక్తిగత అవసరాలకు ఏ పాఠశాలల్లోనూ ప్రత్యేకమైన గదులు కానరావడం లేదు. ఫలితంగా తరచూ విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పనలవి కావు. గదులు లేకపోవడం వలన బాలికలకు నేస్తం పథకాన్ని పునః ప్రారంభించడంతోపాటు వారి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సమస్యలు ఇలా.....
♦ రుతుక్రమం సమయంలో పరిశుభ్రత లేకపోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
♦ సరైన రక్షణ లేక బాలికలు తరగతి గదిలో భయం భయంగా కూర్చోవడంతో చదువు పై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది.
♦ ఇవన్నీ వెరసి విద్యార్థినుల్లో తెలియని బాధ, విసుగు లాంటి లక్షణాలు ఎక్కువ గా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.
♦ రుతుక్రమం సమయంలో నూనె పదార్థాలను అధికంగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, ఘాటైన మసాల, పుల్లని పదార్థాల జోలికి కూడా వెళ్ళకపోవడం ఉత్తమం.
♦ రుతు సమయంలో వ్యాయామం కూడదు.
♦ ప్రాసెస్ చేసిన ఆహారం, రోడ్డు పక్కన అమ్ముతున్న చిరు తిండ్లు, జంక్ ఫుడ్ తీసుకోకూడదు.
ఈ ఆహారం ఉత్తమం.....
♦ నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలనే తీసుకోవాలి.
♦ కాకరకాయ, గుమ్మడి గింజలు, బంగాళ దుంపలు, బొప్పాయి అధికంగా తీసుకోవాలి.
♦ పాలకూర, బీట్‌రూట్, మాంసం, డ్రై ఫ్రూట్స్, యాపిల్, ఉసిరి తదితరాలను తీసుకోవచ్చు.
♦ విటమిన్ డీ కోసం సాయంత్రం కాసేపు ఎండలో నిలబడడం వలన శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment