అత్తిలి ఎంఆర్సీలో ఏడాదిన్నరగా మూలుగుతున్న బడికొస్తా పథకం సైకిళ్లు
పశ్చిమగోదావరి, నిడమర్రు: విద్యా హక్కు చట్టం ప్రకారం బాలికా విద్యను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాలది. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అనేక పథకాలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీరుగారుతున్నాయి. ఏటా ప్రభు త్వ విద్యార్థినులకు అందించే న్యాప్‌కిన్ల పంపిణీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ‘నేస్తం’ పథకం అటకెక్కింది. 9వ తరగతి బాలికలకు ఉచిత సైకిళ్ల పథకం రెండేళ్లుగా వాయిదాలతో సా..గు..తోంది. గతేడాది అందాల్సిన ఉచిత సైకిళ్లకు సర్కారు మంగళం పాడింది. ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 8, 9వ తరగతుల విద్యార్థినులను మాత్రమే విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంది.
లక్ష్యంపై నిర్లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2016లో ‘బడికొస్తా’ పథకాన్ని ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యకే బాలికలు పరిమితం కాకుండా ఉన్నత విద్యలోనూ కొనసాగించాలనేది ఈ పథకం లక్ష్యం. ఇంటికి పాఠశాల దూరంగా ఉండడంతో చదువుకు స్వస్తి చెప్పకుండా 9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఉచితంగా సైకిల్ ఇచ్చేలా కార్యాచరణ రూపొం దించారు. 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో నమోదైన 9వ తరగతి విద్యార్థినులు 16,841 మందికి సైకిళ్లు పంపిణీ చేయాల్సుంది. ఐతే వారంతా 10వ తరగతిలోకి చేరాక 2017–18లో సైకిళ్లను అందించారు. ఈ ఏడాది 8, 9వ తరగతుల విద్యార్థినులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నేటికీ ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. మరో మూడు నెలల్లో ఈ విద్యా సంవత్సరం ముగియనుంది.
గతేడాది మంగళం
2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించిన సైకిళ్లను ఏడాది తర్వాత 2017–18 విద్యా సంవత్సరంలో పంపిణీ చేశారు. గతేడాది 9వ తరగతి చదివిన బాలికలకు నేటికీ సైకిళ్లు అందలేదు. ఈ ఏడాది 9వ తరగతితో పాటు 8వ తరగతి బాలికలకూ సైకిళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రటించింది. ఈ నేపథ్యంలో గతేడాది తొమ్మిది చదివిన విద్యార్థినుల పరిస్థితి ఏమిటని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఏడెడ్ పాఠశాలల్లో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సామాజక వర్గాల బాలికలకు ఉచితంగా సైకిళ్లు అందిస్తారు.
అర్హులు 35,200 మంది
గతంలో జిల్లాలో 16,841 మందికి సైకిళ్లు అందాయి. సైకిళ్లను ఆధార్ అనుసంధానం చేసి బయోమెట్రిక్ హాజరు ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వివిధ కారణాల దృష్ట్యా జిల్లాలో 2,122 సైకిళ్లు మిగిలిపోయాయి. ఇవి ఆయా పాఠశాలల్లో, ఎంఆర్సీ భవనాల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం 8,9 తరగతుల్లో నమోదైన బాలికలు 35,200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సైకిల్ ఖరీదు రూ.3,680గా టెండర్ పూర్తి చేసినట్లు మే నెలలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సైకిళ్ల పంపిణీకి రూ.12.95 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను విద్యార్థులకు సంబంధించిన ఆయా సామాజిక వర్గాల కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గుత్తేదారులు సైకిల్ విడిభాగాలు తీసుకొచ్చి పాఠశాలల వద్దే సైకిళ్లు బిగించి హెచ్‌ఎంలకు అందించనున్నారు.
సైకిళ్లు అందలేదు
గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివిన విద్యార్థినులకు సైకిళ్లు అందలేదు. 2016–17లో 9వ తరగతి చదివిన వారికి టెన్త్‌లోకి వచ్చాక సైకిళ్లు ఇచ్చారు. మా పాఠశాలకు రవాణా సౌకర్యం లేని మందలపర్రు, గుణపర్రు తదితర గ్రామాల నుంచి విద్యార్థినులు వస్తారు. వీరికి సైకిళ్లు ఇస్తే హాజరు శాతం పెరుగుతుంది.– యర్రంశెట్టి శేషగిరి, హెచ్‌ఎం, నిడమర్రు
అర్హత కోల్పోయాను
ఐదు కిలో మీటర్ల దూరంలోని మండల కేంద్రం నిడమర్రులో ఉన్న జెడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఏడాది నుంచి సైకిల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఏడాది నుంచి 8, 9వ తరగతి బాలికలకే ఇస్తానంటున్నారు. నాకు సైకిల్ వచ్చే అవకాశం లేదు.– సీహెచ్ లాస్యప్రియ, 10వ తరగతి విద్యార్థిని, మందలపర్రు
సైకిళ్లు త్వరలో అందిస్తాం
బడికొస్తా పథకం సైకిళ్లు త్వరలో అందిస్తాం. ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 8, 9వ తరగతి విద్యార్థినుల వివరాలు ఉన్నతాధికారులకు అందించాం. గతేడాది మిగిలిన సైకిళ్లను మినహాయించి కొత్త సైకిళ్లు అందిస్తామన్నారు. అప్పటికి వాటిని జాగ్రత్త చేయమన్నారు.– సబ్బితి నర్సింహమూర్తి, జిల్లా అధ్యక్షులు, ఎంఈఓల సంఘం
Comments
Please login to add a commentAdd a comment