సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ భూ సమీకరణలో కొత్తకోణం బయటకొచ్చింది. ఒకపక్క టీడీపీ నేతలు రైతులను నయానో, భయానో తమ దారికి తెచ్చుకుని భూ సమీకరణకు అనుకూలంగా దగ్గరుండి లేఖలు ఇప్పిస్తుంటే వారి వారసులు మాత్రం పిటిషన్ దాఖలు చేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన భూ సమీకరణ గడువు శనివారంతో ముగియనుంది. దీంతో ప్రభుత్వం టీడీపీ నేతలను రంగంలోకి దించింది. భూ సమీకరణకు అంగీకరించని రైతులకు ఎవరితో స్నేహాలు, బంధుత్వాలు ఉన్నాయి, ఎవరు చెబితే వింటారు.. వంటి వివరాలు సేకరించి నేతలు రంగంలోకి దిగారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన కారుమంచి అనిల్, ఆయన కుమారుడు ఇంద్రనీల్ తొలినుంచి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. గురువారం వరకు వారు భూ సమీకరణ కు అంగీకరిస్తూ పత్రాలు ఇవ్వలేదు. వీరి కుటుంబంతో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయన్ని రంగంలోకి దింపి ఒత్తిడి పెంచింది. రాజమండ్రి నుంచి కృష్ణాయపాలెం చేరుకున్న గన్ని కృష్ణ తన స్నేహితుడు కారుమంచి అనిల్‌ను ఒప్పించి భూ సమీకరణకు అనుకూలంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధనుంజయరావుకు లేఖ ఇప్పించారు.
తన తండ్రిపై ప్రభుత్వం, టీ డీపీ నేతలు ఒత్తిడి తెచ్చి భూ సమీకరణకు అనుకూలంగా లేఖ ఇప్పిస్తున్న విషయం తెలుసుకున్న కారుమంచి ఇంద్రనీల్ వెంటనే తన సోదరితో కలిసి సెక్షన్ నోటీసు జారీచేశారు. భూ సమీకరణకు అనుకూలంగా తన తండ్రి ఇచ్చిన అంగీకారపత్రం చెల్లదని, ఆ భూమి తన తాతముత్తాతల స్వార్జితం కాబట్టి తమకు మాత్రమే హక్కు ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులో తన తండ్రి అనిల్‌తో పాటు సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలె క్టర్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
కృష్ణాయపాలెంలో అనిల్ భూ సమీకరణకు తాను సుముఖమని లేఖ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆ గ్రామంలో వంద శాతం సమీకరణ పూర్తయినట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఆ ప్రకటన చేస్తున్న సమయంలోనే అనిల్ తన కుమారుడి నుంచి అందిన నోటీసు ప్రతిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అందచేశారు. ఇదిలా ఉంటే పలువురు రైతుల వారసులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు తెలిసింది. వారసులు కోర్టు నోటీసులు జారీచేసిన పక్షంలో, కోర్టులో కేసు తేలేవరకు ప్రభుత్వం బలవంతంగా భూ సమీకరణ చేసేందుకు అవకాశం లేదు.
భూ సమీకరణలో కొత్తకోణం
Published Sat, Feb 28 2015 1:53 AM | Last Updated on Mon, Aug 20 2018 2:00 PM
Advertisement
Advertisement