New angle
-
రంగారెడ్డి: వీడిన మైనర్ రాజా కేసు మిస్టరీ
సాక్షి, రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి మైనర్ బాలుడు రాజా పాశ్వాన్(17) హత్య కేసు మిస్టరీ వీడింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో బాలుడిని గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడు పంకజ్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు విస్తుపోయే విషయాలు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పంకజ్ భార్యపై మైనర్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ కోపంతోనే పథకం ప్రకారమే బాలుడిని పంకజ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. కాగా, బీహార్‌కు చెందిన సంజయ్ పాశ్వాన్ భార్య, కుమారుడితో కలిసి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కాటేదాన్ లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతడి కుమారుడు ఇదే ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో పని చేసేవాడు. శనివారం ఉదయం పనికి వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి వచ్చాడు. శనివారం కావడంతో షాప్‌కు వెళ్తి బత్తా తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. దుకాణ యజమాని వద్దకు వెళ్లి ఆరా తీయగా డబ్బులు తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆదివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మాణుష్య ప్రాంతంలో బండరాయిపై బాలుడు పడి ఉన్నట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పంకజ్ భార్యను బెదిరించి రాజా పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు తేలింది. ఆ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన పంకజ్.. పథకం ప్రకారమే కూరగాయలు కోసే కత్తితో రాజాని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: ఉరేసుకుందా.. గుండెపోటా? -
హైదరాబాద్ ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో కొత్తకోణం
-
టెన్త్ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం.. ఎగ్జామ్ సెంటర్లో జరిగింది ఇదేనా..?
సాక్షి, వరంగల్: పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో ఎవరో చేసిన తప్పిదానికి విద్యార్థి డిబార్ కావడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనతో ఐదేళ్ళు డిబార్ అయిన దండెబోయిన హరీష్ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థి హరీష్‌తో పాటు తల్లి లలిత పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని డిబార్‌ను ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటిపర్యంతమై అధికారులను వేడుకున్నారు. హన్మకొండ జిల్లా కమలాపుర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి రాస్తున్న విద్యార్థి హరీష్ నుంచి శివ అనే బాలుడు రెండు రోజుల క్రితం హిందీ ప్రశ్నాపత్రం లాకెళ్లి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ కేసు సంచలనంగా మారి బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు పది మందిపై కేసు నమోదు చేశారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి ఇన్విజిలేటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. విద్యార్థి హరీష్‌ను ఐదేళ్లు డిబార్ చేశారు. డిబార్ అయిన హరీష్ ఈ రోజు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని బోరున విలపించారు. పరీక్ష రాస్తున్న సమయంలో హఠాత్తుగా తాను కూర్చున్న కిటికీ వద్దకు ఓ వ్యక్తి వచ్చి క్వశ్చన్ పేపర్ అడిగాడు.. తను ఇవ్వనని చెప్పాను కొంత సమయం గడిచాక వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడనుకుని క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టి ఆన్సర్ పేపర్ పై మార్జిన్ కొట్టుకుంటుండగా మళ్లీ ఆ వ్యక్తి వచ్చి ప్రశ్నపత్రం లాక్కుని ఫొటో తీసుకుని మళ్లీ పేపర్ నావైపు విసిరాడు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు లేకుంటే చంపుతామని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్‌ప్లాన్ అంత వరకే తనకు తెలుసని ఆ తరువాత ఎం జరిగిందో తనకు తెలియదని విద్యార్థి హరీష్ అంటున్నాడు. ఈ రోజు ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి సెంటర్ వద్దకు రాగానే డిఈఓ హాల్ టికెట్ తీసుకుని సంతకం తీసుకున్నాడని ఎందుకు సంతకం తీసుకున్నారని అడిగితే హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఐదేళ్లు డిబార్ చేశామని తెలిపారని అన్నారు. తనకు తెలియకుండా జరిగిన తప్పుకు శిక్ష వేయడం అన్యాయమని కన్నీరుమున్నీరయ్యాడు. ఎవరో చేసిన తప్పుకు నేను బలి అయ్యానని, నా భవిష్యత్తును నాశనం చేయొద్దని శనివారం జరిగే గణితం పరీక్షకు అధికారులు అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు హరీష్‌తోపాటు తల్లి లలిత సైతం కన్నీరుమున్నీరుగా విలపిస్తూ నా కొడుకు భవిష్యత్తుతో ఆడుకోవద్దని వేడుకున్నారు. ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరో చేసిన తప్పును నాకొడుకు శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కష్టం చేసుకుని బతికే కుటుంబం మాది.. ఏంజెపి గురుకుల్ పాఠశాలలో హాస్టల్లో చదివిస్తున్నామని, న్యాయం చేయాలని విద్యార్థి తల్లి కోరుతుంది. -
తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా డబ్బు కొట్టేసింది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో రూ.10 కోట్లును కొట్టేసిన సాయికుమార్.. ఏపీ సీడ్స్ కార్పొరేషన్లో రూ.5 కోట్ల ఎఫ్డీలను డ్రా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు సాయికుమార్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!) ఏపీ సంస్థల నుంచి డిపాజిట్లను ఐవోబీ బ్యాంక్ నుంచి బదిలీ చేశారు. ఐవోబీ నుంచి ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా బదిలీ, విత్ డ్రా చేయగా, ఏపీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లను కాజేసినట్లుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఏపీ అధికారులకు సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. సాయికుమార్ ముఠాపై రెండు కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై పోలీసులు దృష్టి పెట్టారు. చదవండి: అత్త తిట్టిందని.. కోడలు ఎంత పని చేసిందంటే..! -
‘నాన్నా.. నా మనసేమీ బాలేదు’
‘నాన్నా.. నా మనసేమీ బాలేదు. ఈ రోజు ఒంగోలులోనే ఉంటా’ తండ్రితో మద్ది వెంకటసాయి చివరి మాటలివి. తెల్లారేసరికి ఆ మాటలు మృతదేహం రూపంలో కనిపించాయి. ప్రేమను జయించిన ఆ జంటకు పరిస్థితులే యమపాశాల్లా మారాయా? పిల్లల క్షణికావేశం.. పెద్దల మంకుతనమే ప్రేమజంటను జీవశ్చవంలా మార్చాయా? రైలు పట్టాలపై ఛిద్రమైన ప్రేమకథలోని ఓ కొత్త కోణం ఇది. చీమకుర్తి: ప్రేమజంట ఆత్మహత్య ప్రతి ఒక్కరిలో ఆవేదనే మిగిల్చింది. కకావికలంగా మారిన ఆ రైలు పట్టాలే ఈ కన్నీటి కథకు సాక్ష్యం. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వెంకటసాయి, నాగతేజ ఒంగోలు సమీపంలోని పెళ్లూరు–రైజ్ కాలేజ్ మధ్యనున్న రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి తన కుమారుడు తనతో మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుని మద్ది నారాయణ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ‘‘ఇంట్లో నుంచి సాయంత్రం ఆరు గంటలకు బయటకు వెళ్తున్నా నాన్నా అన్నాడు. రోజుటిలాగే అనుకున్నా.. మళ్లీ రాత్రి 9:30 గంటలకు ఫోన్లో మాట్లాడుతూ నేను ఒంగోలులో ఉన్నా నాన్నా.. నా మనసేమీ బాగోలేదు’’ అని చెప్పినప్పుడైనా ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా జరగకుండా ఉండేదని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటసాయి చెన్నై ఎందుకు వెళ్లాడు? ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటలో వెంకటసాయి తండ్రి నారాయణ చెప్పిన మాటల ప్రకారం.. ఆత్మహత్యకు ఆరు రోజుల ముందు వెంకటసాయి తనకు ఉద్యోగం వచ్చిందని, సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి రూ. 10 వేలు కావాలని తండ్రిని అడిగాడు. అందులో రూ. 5 వేలతో ఫోన్ కొనుక్కొని మిగిలిన డబ్బులతో చెన్నై వెళ్లాడు. వెంకటసాయి ఒంటరిగా కాకుండా తాను ప్రేమించిన అమ్మాయి నాగతేజను కూడా చెన్నై తీసుకెళ్లినట్లు తెలిసింది. కొరియర్ సరీ్వస్‌లో పనిచేసేందుకు వెళ్లిన వెంకటసాయికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. నాగతేజను చూసిన కొరియర్ సరీ్వస్ యాజమాన్యం ఇంత చిన్న వయస్సులో ఇలా అమ్మాయిని తీసుకొస్తే కేసులు అవుతాయి.. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి రా అన్నారని తమకు తెలిసిందని నారాయణ చెప్పారు. దీంతో వెంకటసాయి ఏం చేసేది లేక ఆ తర్వాత రోజే ఒంగోలు తిరిగొచ్చేశాడు. చెన్నై నుంచి వచ్చిన తర్వాత వెంకటసాయి తనలో తను కుమిలిపోయి చివరకు ఏం చేయలేక తాను ప్రేమించిన అమ్మాయితో ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్నెల్ల కిందటే ఇంట్లో నుంచి బయటకొచ్చిన నాగతేజ నాగతేజ ఆరు నెలల కిందటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులోని హాస్టల్లో ఉంటుందని తండ్రి రవీంద్ర తెలిపారు. ఏడాదిన్నర కిందట నాగతేజ ఇంట్లో వారిని ఎదిరించి నేను వెంకటసాయినే పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పుడు పెద్దలు పోలీసులతో మాట్లాడి సర్దిచెప్పటంతో కొన్నాళ్ల పాటు వారిద్దరి మధ్య ప్రేమకు విరామం ఏర్పడింది. ఇంతలో ఏమైందో ఏమో మరి నాగతేజ ఇంట్లో నుంచి బయటకు రావడంతోనే వారి మధ్య ప్రేమ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. దీంతో రవీంద్ర చేసేది లేక ఒంగోలులోని హాస్టల్లో ఉంటుందిలేననుకున్నాడు. వెంకటసాయితో చెన్నై వెళ్లడం, వారిద్దరు ఆత్మహత్య చేసుకునే వరకు తనకు తెలియదని రవీంద్ర చెప్పాడు. ఇద్దరికి తల్లిదండ్రుల నుంచి సరైన ఆమోదం లభించకపోవడం, బయట కలిసి జీవించడంలో ఆర్థిక ఇబ్బందులు తోడవడం, ఇంట్లో నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో బతుకు చాలా భారంగా ఉందని లేత మనస్సులు జీవితాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమై ఆత్మహత్యవైపు పురికొల్పిందని ప్రేమజంట బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కులాలు కలవని ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో చీమకుర్తి, తొర్రగుడిపాడు గ్రామంలో బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రాణం పోయినట్లయింది.. : యువకుడి తండ్రి నారాయణ ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి 9:30 గంటలకు తండ్రితో ఫోన్లో మాట్లాడిన వెంకటసాయి తాను స్నేహితుడి రూమ్‌లో ఉన్నానని చెప్పాడు. తీరా తెల్లారేసరికి రైల్వే పోలీసులు ఫోన్ తీసి తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడనడంతో ప్రాణం పోయినట్లయిందని నారాయణ వాపోయాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నా కొడుకును కష్టపడి కూరగాయలు అమ్మి చదివించానని, ప్రేమలో పడి తెలిసీ తెలియని వయస్సులో ఆత్మహత్యకు పూనుకున్నాడని బోరున విలపించాడు. ఏదోక ఉద్యోగంలో సెటిలైతే కులం గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసే వాడినంటూ ఆవేదన చెందారు. పూర్తి వివరాలు తనదాకా తీసుకురాకుండానే వాడి మనస్సులోనే కుమిలిపోయి ఆత్మహత్య వైపు అడుగులు వేశాడు. జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా మమ్మలను అఘాతంలోకి నెట్టాడని నారాయణ వాపోయాడు. నారాయణ కుటుంబ సభ్యుల రోదనలు, ఆవేదనలు చూసి తొర్రగుడిపాడు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. చదవండి: బండారం బట్టబయలు: బుల్లెట్‌పై దొరల్లా వచ్చి... హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం -
పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటనపై అన్నికోణాలలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 11:30 గంటలకు మంత్రి పేర్నినాని పై ఆయన నివాసం వద్ద హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడు తాపీ పనిచేసే బడుగు నాగేశ్వరరావు.. అతని దగ్గరున్న తాపీతో రెండు సార్లు కడుపులో పొడవటానికి ప్రయత్నించాడని చెప్పారు. మొదటిసారి పొడిచినపుడు బెల్ట్‌కి గుచ్చుకోవడంతో మంత్రి అప్రమత్తమై అతనిని వెనక్కి నెట్టారు. వెంటనే మంత్రి గన్‌మెన్, సెక్యూరిటీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: మంత్రి పేర్ని నానిపై దుండగుడి దాడి) నిందితుడు నాగేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడని, నాగేశ్వరరావు సోదరి ఉమాదేవి టీడీపీ మండల నాయకురాలిగా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. మంత్రిపై హత్యాయత్నంలో ఎవరి హస్తముందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, పూర్తి కారణాలు తెలియాల్సివుందని ఆయన తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం నిందితుడిని ఆసుపత్రికి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇది రాజకీయ కోణమా.. లేక మరేదైనా ఉద్దేశమా అనేది విచారణలో తెలియాల్సివుంది. మంత్రి పేర్నినానిని కలిసి బాధను చెప్పుకోడానికి వచ్చినట్లు నిందితుడు చెబుతున్నాడు.. కానీ నిజమెంతో తెలుసుకోవాల్సి ఉంది. బాధ చెప్పుకునే వ్యక్తి.. ఆయుధంతో ఎందుకు వచ్చాడో విచారిస్తున్నాం. తాజా ఘటన నేపథ్యంలో మంత్రి భద్రతపై ఏఆర్ ఎఎస్పీతో సమీక్షిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. హత్యాయత్నాన్ని ఖండించిన డిప్యూటీ సీఎం మచిలిపట్నం: పేర్నినానిపై హత్యాయత్నాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఖండించారు. ఆయన మంత్రి పేర్ని నానిని పరామర్శించి, దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు రాబట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆళ్ల నాని అన్నారు. -
భూ సమీకరణలో కొత్తకోణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ భూ సమీకరణలో కొత్తకోణం బయటకొచ్చింది. ఒకపక్క టీడీపీ నేతలు రైతులను నయానో, భయానో తమ దారికి తెచ్చుకుని భూ సమీకరణకు అనుకూలంగా దగ్గరుండి లేఖలు ఇప్పిస్తుంటే వారి వారసులు మాత్రం పిటిషన్ దాఖలు చేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన భూ సమీకరణ గడువు శనివారంతో ముగియనుంది. దీంతో ప్రభుత్వం టీడీపీ నేతలను రంగంలోకి దించింది. భూ సమీకరణకు అంగీకరించని రైతులకు ఎవరితో స్నేహాలు, బంధుత్వాలు ఉన్నాయి, ఎవరు చెబితే వింటారు.. వంటి వివరాలు సేకరించి నేతలు రంగంలోకి దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన కారుమంచి అనిల్, ఆయన కుమారుడు ఇంద్రనీల్ తొలినుంచి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. గురువారం వరకు వారు భూ సమీకరణ కు అంగీకరిస్తూ పత్రాలు ఇవ్వలేదు. వీరి కుటుంబంతో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయన్ని రంగంలోకి దింపి ఒత్తిడి పెంచింది. రాజమండ్రి నుంచి కృష్ణాయపాలెం చేరుకున్న గన్ని కృష్ణ తన స్నేహితుడు కారుమంచి అనిల్‌ను ఒప్పించి భూ సమీకరణకు అనుకూలంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధనుంజయరావుకు లేఖ ఇప్పించారు. తన తండ్రిపై ప్రభుత్వం, టీ డీపీ నేతలు ఒత్తిడి తెచ్చి భూ సమీకరణకు అనుకూలంగా లేఖ ఇప్పిస్తున్న విషయం తెలుసుకున్న కారుమంచి ఇంద్రనీల్ వెంటనే తన సోదరితో కలిసి సెక్షన్ నోటీసు జారీచేశారు. భూ సమీకరణకు అనుకూలంగా తన తండ్రి ఇచ్చిన అంగీకారపత్రం చెల్లదని, ఆ భూమి తన తాతముత్తాతల స్వార్జితం కాబట్టి తమకు మాత్రమే హక్కు ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులో తన తండ్రి అనిల్‌తో పాటు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలె క్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. కృష్ణాయపాలెంలో అనిల్ భూ సమీకరణకు తాను సుముఖమని లేఖ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆ గ్రామంలో వంద శాతం సమీకరణ పూర్తయినట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఆ ప్రకటన చేస్తున్న సమయంలోనే అనిల్ తన కుమారుడి నుంచి అందిన నోటీసు ప్రతిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అందచేశారు. ఇదిలా ఉంటే పలువురు రైతుల వారసులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు తెలిసింది. వారసులు కోర్టు నోటీసులు జారీచేసిన పక్షంలో, కోర్టులో కేసు తేలేవరకు ప్రభుత్వం బలవంతంగా భూ సమీకరణ చేసేందుకు అవకాశం లేదు.