ఘటనాస్థలంలో పోలీసులు
సాక్షి, రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి మైనర్ బాలుడు రాజా పాశ్వాన్(17) హత్య కేసు మిస్టరీ వీడింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో బాలుడిని గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడు పంకజ్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ కేసులో ఇప్పుడు విస్తుపోయే విషయాలు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పంకజ్ భార్యపై మైనర్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ కోపంతోనే పథకం ప్రకారమే బాలుడిని పంకజ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు.
కాగా, బీహార్‌కు చెందిన సంజయ్ పాశ్వాన్ భార్య, కుమారుడితో కలిసి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కాటేదాన్ లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతడి కుమారుడు ఇదే ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో పని చేసేవాడు. శనివారం ఉదయం పనికి వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి వచ్చాడు. శనివారం కావడంతో షాప్‌కు వెళ్తి బత్తా తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు.
రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. దుకాణ యజమాని వద్దకు వెళ్లి ఆరా తీయగా డబ్బులు తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆదివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మాణుష్య ప్రాంతంలో బండరాయిపై బాలుడు పడి ఉన్నట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పంకజ్ భార్యను బెదిరించి రాజా పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు తేలింది. ఆ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన పంకజ్.. పథకం ప్రకారమే కూరగాయలు కోసే కత్తితో రాజాని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
చదవండి: ఉరేసుకుందా.. గుండెపోటా?
Comments
Please login to add a commentAdd a comment