వెంకట సాయి (ఫైల్)- నాగతేజ (ఫైల్)
‘నాన్నా.. నా మనసేమీ బాలేదు. ఈ రోజు ఒంగోలులోనే ఉంటా’ తండ్రితో మద్ది వెంకటసాయి చివరి మాటలివి. తెల్లారేసరికి ఆ మాటలు మృతదేహం రూపంలో కనిపించాయి. ప్రేమను జయించిన ఆ జంటకు పరిస్థితులే యమపాశాల్లా మారాయా? పిల్లల క్షణికావేశం.. పెద్దల మంకుతనమే ప్రేమజంటను జీవశ్చవంలా మార్చాయా? రైలు పట్టాలపై ఛిద్రమైన ప్రేమకథలోని ఓ కొత్త కోణం ఇది.
చీమకుర్తి: ప్రేమజంట ఆత్మహత్య ప్రతి ఒక్కరిలో ఆవేదనే మిగిల్చింది. కకావికలంగా మారిన ఆ రైలు పట్టాలే ఈ కన్నీటి కథకు సాక్ష్యం. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వెంకటసాయి, నాగతేజ ఒంగోలు సమీపంలోని పెళ్లూరు–రైజ్ కాలేజ్ మధ్యనున్న రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి తన కుమారుడు తనతో మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుని మద్ది నారాయణ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ‘‘ఇంట్లో నుంచి సాయంత్రం ఆరు గంటలకు బయటకు వెళ్తున్నా నాన్నా అన్నాడు. రోజుటిలాగే అనుకున్నా.. మళ్లీ రాత్రి 9:30 గంటలకు ఫోన్‌లో మాట్లాడుతూ నేను ఒంగోలులో ఉన్నా నాన్నా.. నా మనసేమీ బాగోలేదు’’ అని చెప్పినప్పుడైనా ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా జరగకుండా ఉండేదని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకటసాయి చెన్నై ఎందుకు వెళ్లాడు?
ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటలో వెంకటసాయి తండ్రి నారాయణ చెప్పిన మాటల ప్రకారం.. ఆత్మహత్యకు ఆరు రోజుల ముందు వెంకటసాయి తనకు ఉద్యోగం వచ్చిందని, సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి రూ. 10 వేలు కావాలని తండ్రిని అడిగాడు. అందులో రూ. 5 వేలతో ఫోన్ కొనుక్కొని మిగిలిన డబ్బులతో చెన్నై వెళ్లాడు. వెంకటసాయి ఒంటరిగా కాకుండా తాను ప్రేమించిన అమ్మాయి నాగతేజను కూడా చెన్నై తీసుకెళ్లినట్లు తెలిసింది. కొరియర్ సరీ్వస్‌లో పనిచేసేందుకు వెళ్లిన వెంకటసాయికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. నాగతేజను చూసిన కొరియర్ సరీ్వస్ యాజమాన్యం ఇంత చిన్న వయస్సులో ఇలా అమ్మాయిని తీసుకొస్తే కేసులు అవుతాయి.. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి రా అన్నారని తమకు తెలిసిందని నారాయణ చెప్పారు. దీంతో వెంకటసాయి ఏం చేసేది లేక ఆ తర్వాత రోజే ఒంగోలు తిరిగొచ్చేశాడు. చెన్నై నుంచి వచ్చిన తర్వాత వెంకటసాయి తనలో తను కుమిలిపోయి చివరకు ఏం చేయలేక తాను ప్రేమించిన అమ్మాయితో ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆర్నెల్ల కిందటే ఇంట్లో నుంచి బయటకొచ్చిన నాగతేజ
నాగతేజ ఆరు నెలల కిందటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులోని హాస్టల్‌లో ఉంటుందని తండ్రి రవీంద్ర తెలిపారు. ఏడాదిన్నర కిందట నాగతేజ ఇంట్లో వారిని ఎదిరించి నేను వెంకటసాయినే పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పుడు పెద్దలు పోలీసులతో మాట్లాడి సర్దిచెప్పటంతో కొన్నాళ్ల పాటు వారిద్దరి మధ్య ప్రేమకు విరామం ఏర్పడింది. ఇంతలో ఏమైందో ఏమో మరి నాగతేజ ఇంట్లో నుంచి బయటకు రావడంతోనే వారి మధ్య ప్రేమ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.
దీంతో రవీంద్ర చేసేది లేక ఒంగోలులోని హాస్టల్‌లో ఉంటుందిలేననుకున్నాడు. వెంకటసాయితో చెన్నై వెళ్లడం, వారిద్దరు ఆత్మహత్య చేసుకునే వరకు తనకు తెలియదని రవీంద్ర చెప్పాడు. ఇద్దరికి తల్లిదండ్రుల నుంచి సరైన ఆమోదం లభించకపోవడం, బయట కలిసి జీవించడంలో ఆర్థిక ఇబ్బందులు తోడవడం, ఇంట్లో నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో బతుకు చాలా భారంగా ఉందని లేత మనస్సులు జీవితాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమై ఆత్మహత్యవైపు పురికొల్పిందని ప్రేమజంట బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కులాలు కలవని ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో చీమకుర్తి, తొర్రగుడిపాడు గ్రామంలో బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రాణం పోయినట్లయింది.. : యువకుడి తండ్రి నారాయణ
ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి 9:30 గంటలకు తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన వెంకటసాయి తాను స్నేహితుడి రూమ్‌లో ఉన్నానని చెప్పాడు. తీరా తెల్లారేసరికి రైల్వే పోలీసులు ఫోన్ తీసి తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడనడంతో ప్రాణం పోయినట్లయిందని నారాయణ వాపోయాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నా కొడుకును కష్టపడి కూరగాయలు అమ్మి చదివించానని, ప్రేమలో పడి తెలిసీ తెలియని వయస్సులో ఆత్మహత్యకు పూనుకున్నాడని బోరున విలపించాడు. ఏదోక ఉద్యోగంలో సెటిలైతే కులం గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసే వాడినంటూ ఆవేదన చెందారు. పూర్తి వివరాలు తనదాకా తీసుకురాకుండానే వాడి మనస్సులోనే కుమిలిపోయి ఆత్మహత్య వైపు అడుగులు వేశాడు. జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా మమ్మలను అఘాతంలోకి నెట్టాడని నారాయణ వాపోయాడు. నారాయణ కుటుంబ సభ్యుల రోదనలు, ఆవేదనలు చూసి తొర్రగుడిపాడు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
చదవండి:
బండారం బట్టబయలు: బుల్లెట్‌పై దొరల్లా వచ్చి...
హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం
Comments
Please login to add a commentAdd a comment