సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు (ఏఆర్‌పీ)ను 120 రోజులకు పెంచుతూ రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రాబోతోంది. ఇప్పటివరకు 60 రోజులుగా ఉన్న గడువును నాలుగు నెలలకు పెంచుతున్నట్టు ఇటీవలి బడ్జెట్‌లో రైల్వే మంత్రి ప్రతిపాదించారు. దీనివల్ల బ్లాక్ టికెటింగ్ పెరిగే అవకాశం ఉన్నా దాన్ని అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించటం విశేషం. 2012 వరకు ఈ గడువు 90 రోజులుగా ఉండేది. ఆ తర్వాత దాన్ని 120 రోజులకు పెంచారు. తిరిగి 2013 మే 1 నుంచి దాన్ని 60 రోజులకు కుదించారు. 120 రోజుల ముందే టికెట్లను జారీ చేశాక రైలు చార్జీలు పెరిగితే, ఆ పెరిగిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవటం అంత సులభం కాదని, దీనివల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు అప్పట్లో రైల్వేశాఖ దృష్టికి తెచ్చారు. ఒక్క దక్షిణ మధ్య రైల్వే అధికారులే నిత్యం రూ.25 లక్షల వరకు వసూలు చేయాల్సి వస్తున్నా రోజుకు రూ.15 లక్షలకు మించి వసూలు చేయలేకపోతున్నట్టు అప్పట్లో ఉదాహరించారు. దీంతో గడువును 60 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ దాన్ని ఇప్పుడు 120 రోజులకు పెంచారు.