
మృతశిశువును చూస్తున్న స్థానికులు (ఇన్‌సెట్) కంప చెట్లలో ఉన్న మృతశిశువు
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మిట్టమడి వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు పసి కందు మృతదేహాన్ని పడేసి వెళ్లడం కలకలం సృష్టించింది. వీధిలోని ఒక ప్రైవేట్ పాఠశాల వెనుక వైపున ఖాళీ ప్రదేశంలో బుధవారం ఉదయం ఆడ శిశువు మృతదేహం ఉందని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున గుమి కూడారు. విషయం తెలియడంతో వన్‌టౌన్ పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆడపిల్ల అని వదిలించుకోవడానికి ఎవరైనా జీవించి ఉండగానే పసికందును పడేశారా.. లేక మృత శిశువును పారేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీధిలోనూ, చుట్టు పక్కల ప్రాంతాల్లో కాన్పు అయిన మహిళల వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేకరిస్తున్నారు వారి నివేదిక ఆధారంగా మృత శిశువు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. పసి కందు మృతదేహాన్ని ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది తీసుకొని వెళ్లారు.