సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో మరో డ్రామాకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ‘మార్పు కోసం’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రతిపక్ష నేతను అంతమొందించేందుకు పథకం వేసిన పెద్దలే తాజా నాటకానికీ సూత్రధారులనే ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరావు రాసినట్లుగా చెబుతున్న 11 పేజీల లేఖలో పేర్కొన్న అంశాలనే ఓ పుస్తకంగా ముద్రించి నిందితుడికి ప్రచారం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు తాను చెప్పదలుచుకున్న అంశాలను శ్రీనివాసరావు 22 పేజీల నోట్‌బుక్‌లో రాసినట్టు అతడి తరపు న్యాయవాది ఎ.సలీం ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ మంత్రి, జైళ్ల శాఖ డీఐజీ, డీజీలకు లేఖ రాస్తానని చెప్పారు. పుస్తకం పేరుతో శ్రీనివాసరావు కాగితాలపై రాసిన విషయాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి తెలియజేస్తానని విశాఖ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనిదే ఖైదీలు రాసిన పుస్తకం విడుదలకు వీలు కాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment