
కొత్త ఉత్సాహం
ఎన్నికల్లో గెలిచారు. ఎప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కుదామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేసి అధికారులతో....
- నెరవేరనున్న జిల్లా కొత్త ఎమ్మెల్యేల ఆశలు
- 19న ప్రమాణస్వీకారం
- తొలిసారి అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సన్నద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో గెలిచారు. ఎప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కుదామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేసి అధికారులతో సమీక్షలు కూడా చేస్తుండడంతో తమకా అవకాశం ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలకు ఈ నెల 19న ముహూర్తం ఖరారుకావడంతో తమ ఆశలు నెరవేరబోతున్నాయని సంబరపడుతున్నారు.
తొలిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కనున్న జిల్లాలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఆనందమిది. ఈ నెల 19న వీరంతా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో వాసుపల్లి గణేష్‌కుమార్(విశాఖ దక్షిణం), విష్ణుకుమార్‌రాజు(విశాఖ ఉత్తరం), పీలా గోవింద్(అనకాపల్లి), పల్లా శ్రీనివాస్ (గాజువాక), గిడ్డి ఈశ్వరి(పాడేరు), కిడారి సర్వేశ్వరావు(అరకు), వంగలపూడి అనిత (పాయకరావుపేట), బూడి ముత్యాలనాయుడు(మాడుగుల) ఉన్నారు.
వాస్తవానికి గెలిచిన పదిరోజుల్లోగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియ చాలా రోజులు వాయిదా పడింది. దీనికితోడు కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కనీసం రాజధాని లేకపోవడం, ఆస్తుల పంపకం, ఉద్యోగుల కేటాయింపు, అసెంబ్లీ విభజన, ముఖ్యమంత్రి పేషీలు తేల్చడం తదితర అంశాలు మరో కారణం. మే 16న కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికి కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం కోసం జూన్ 8 వరకు ఆగడంతో అసెంబ్లీ సమావేశాలు చాలా ఆలస్యమయ్యాయి.
దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వాయిదా పడుతూ వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలయితే ప్రమాణస్వీకారం చేయకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా అప్పుడే నియోజకవర్గాల్లో పెత్తనం కూడా మొదలుపెట్టేశారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ అధికారులను ఇంటికి పిలిపించుకుని అభివృద్ధి పనులపై సమీక్ష కూడా ప్రారంభించారు.
అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ రెండు అడుగులు ముందుకువేసి నేరుగా అధికారిక సమీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా ఇలా సమీక్షలు జరపడంపై గవర్నర్‌కు ఫిర్యాదు కూడా వెళ్లింది. మరి కొందరైతే నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం, తమకు నియోజకవర్గ నిధులు ఎన్ని వస్తాయి?, ఇప్పటివరకు మంజూరైన నిధులెన్ని?, నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు?, ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి?.. వంటి వివరాలను ఆరా తీసి ఉంచారు.
19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నందున కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు రెండు రోజులు ముందుగానే హైదరాబాద్‌కు పయనమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రక్రియ ముగిశాక నియోజకవర్గాలకు ఊరేగింపుగా వచ్చి అనుచరులతో భారీగా ర్యాలీ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.