కాళ్ల పారాణి ఆరకముందే... | New Groom Died In Vizianagaram | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే...

Published Sun, Sep 9 2018 7:16 AM | Last Updated on Sun, Sep 9 2018 7:16 AM

New Groom Died  In Vizianagaram - Sakshi

కాళ్ల పారాణి ఆరలేదు.. మామిడి తోరణాలు తీయలేదు... వధూవరుల ఇంట పెండ్లి సందడి ముగియలేదు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. పెళ్లయిన 24 రోజులకే వరుడు కన్నుమూశాడు. అత్తవారింటికి వెళ్లిన తన కుమారుడు  శవమై రావడంతో వరుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లిలో చేసిన బాసలు మరిచి నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ నూతన వధువు భర్త మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. 

విజయనగరం / బలిజిపేట: పెళ్లయిన 24 రోజులకే నవవరుడు మృత్యువాత పడిన సంఘటన పెదపెంకిలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెర్లాం మండలం కుసుమూరు గ్రామానికి చెందిన మజ్జి  సూర్యనారాయణ (23)కు బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన పి.జ్యోతితో గత నెల 16న వివాహం జరిగింది. రాకపోకల్లో భాగంగా సూర్యనారాయణ భార్య జ్యోతితో కలిసి శుక్రవారం అత్తవారింటికి వచ్చాడు. సూర్యనారాయణ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు కావడంతో అత్తవారి పొలంలో ఎరువు చల్లేందుకు శనివారం వెళ్లాడు.

 పని పూర్తయిన తర్వాత తిరిగివస్తూ మార్గమధ్యలో ఉన్న శనపతి కోనేరులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. పొలానికి వెళ్లిన భర్త ఎంతకీ రాకపోవడంతో భార్య ఆందోళన చెందడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఇంతలో కోనేరులో  సూర్యనారాయణ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అందరూ గగ్గోలు పెట్టారు. భర్త మృతదేహంపై పడి జ్యోతి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. మృతుడి తల్లిదండ్రులు, జ్యోతి తల్లిదండ్రులు గణపతి, సింహాద్రమ్మలు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ పెంకి పార్వతి, వేణనాయుడు, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ఓదార్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement