సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా త్వరలో నూతన పారిశ్రామిక విధానం తీసుకురానున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక పాలసీలు వచ్చే ఏడాదితో ముగియనుండడంతో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. గతంలో ప్రకటించిన రాయితీలు, పాలసీలు కేవలం వాళ్లకు కావాల్సిన వారికి మాత్రమే ప్రయోజనాలు వర్తించేవని, దీంతో కార్పొరేట్ సంస్థల్లో ఒక రకమైన ఆందోళన ఉండేదన్నారు. ఇప్పుడు అలా కాకుండా అందరికీ వర్తించే విధంగా గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పాత పాలసీల గడువు ముగిసే లోపు 100 రోజుల కార్యక్రమం లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు.
రూ.7,000 కోట్లు అడిగాం...
పారిశ్రామిక రంగానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.7,000 కోట్లు, ఐటీ శాఖకు రూ.1,400 కోట్ల నిధులను కేటాయించాల్సిందిగా ఆర్థిక మంత్రిని కోరినట్లు గౌతంరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 70 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం మేరకు కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఐటీపై ప్రత్యేక దృష్టి
బెంగళూరు, పూణే నగరాలతో పోటీ పడే విధంగా విశాఖ నగరానికి ఐటీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఐటీ పెట్టుబడుల్లో వేగంగా విస్తరించడానికి విశాఖకు అపార అవకాశాలున్నాయని అన్నారు. విశాఖ తర్వాత మంగళగిరి, తిరుపతి వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు, చెన్నై, బెంగళూరులకు దగ్గరగా ఉన్న తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు.
త్వరలో నూతన పారిశ్రామిక విధానం
Published Thu, Jul 4 2019 4:48 AM | Last Updated on Thu, Jul 4 2019 4:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment