నేడు విధులకు హాజరు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రెండురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించి శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు జిల్లాకు వస్తున్న కొత్త జాయింట్ కలెక్టర్ మురళికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో గత కొంతకాలంగా పక్కదారి పట్టిన రెవెన్యూ పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఇసుక దొంగ రవాణా యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే.
ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతుండటం, అధికారులపై సైతం దాడులకు తెగబడుతుండటంతో వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు సిబ్బంది భయపడుతున్నారు. కృష్ణానదీతీరంలో ఇసుక దొంగ రవాణాకు చెక్ పెట్టాలి. విజయవాడ రెవెన్యూ డివిజన్‌లోని పలు గ్రామాల్లో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక రవాణాను అరికట్టాలి. ఇసుక మాఫియా ఆగడాలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంది. మరోపక్క ప్రజాపంపిణీ వ్యవస్థ జిల్లాలో పక్కదారి పట్టింది. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు యథేచ్ఛగా తరలించేస్తున్నారు.
జిల్లాలో కొందరు అధికారులు, డీలర్లతో కుమ్మక్కై ప్రజాపంపిణీ వ్యవస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రతీ మండలంలో ఫిర్యాదులు కోకొల్లలుగా ఉన్నాయి. బినామీ డీలర్లను ఏరేసి ఆ స్థానంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగేలా కొత్త డీలర్ల నియామకాలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల్లో, రెవెన్యూ డివిజన్‌లలో పెండింగులో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కొన్ని మండల కేంద్రాల్లో పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులు ఉన్నాయి. సొమ్ము ఇవ్వలేని బక్కరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూవివాదాలు పరిష్కారం కాక అనేకమంది బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్సైజ్, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, సినిమాహాళ్ల నిర్వహణపై అజమాయిషీ కొరవడింది. ఎంతోకాలంగా వాటిపై తనిఖీలు లేకపోవటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అన్నింటీకి మించి ఈ జిల్లాలో రాజకీయ పరిస్థితులు పెనుసవాలుగా మారనున్నాయి.
కొత్త జేసీకి సవాళ్లెన్నో
Published Fri, Jan 24 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement