నవ వధువు ఆత్మహత్య
మధురానగర్ : కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు కానరాని లోకాలకు చేరుకుంది. అయోధ్యనగర్ లోటస్‌ల్యాండ్‌మార్క్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోటస్‌ల్యాండ్ మార్క్ ఎనిమిదో బ్లాక్ వద్ద రోడ్డుపై ఓ యువతి మృతదేహం పడి ఉంది. ఆ ప్రాంతంలో నివాసం ఉండే 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానికులతో కలిసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఆమె వడదెబ్బకు చనిపోయి ఉంటుందని భావించారు. సింగ్‌నగర్ ఎస్‌ఐ ఇంద్రశ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ నాయక్ సిబ్బందితో వచ్చి మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు తీవ్రగా యత్నించారు.
ఫలితం లేకపోవటంతో లోటస్‌ల్యాండ్‌మార్క్‌లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఆ యువతి 8వ బ్లాకు లోపలికి వెళ్లడం, ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోవటం కనిపించాయి. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. ఎస్.వెంకటేశ్వరరావు రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. లోటస్ ల్యాండ్ మార్క్ ఎనిమిదో బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె సౌజన్య(25)కు ఈనెల 20వ తేదీన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం చేశారు. సౌజన్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. దంపతులిద్దరూ హైద్రాబాద్‌లోనే ఉంటున్నారు.
వెంకటేశ్వరరావు దంపతులు వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెనాలి వెళ్లారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో సౌజన్య ఎనిమిదో బ్లాకులోకి వెళ్లింది. అనంతరం ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ చూస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు దంపతులు తెనాలి నుంచి తిరిగి వచ్చారు.
కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటేశ్వరరావు వద్ద నుంచి సౌజన్య భర్త ఫోన్ నంబరును పోలీసులు తీసుకుని కాల్ చేశారు. తన భార్య డ్యూటీకి వెళ్లిందని, తానుకూడా డ్యూటీలో ఉన్నానని చెప్పారు. కుమార్తె మృతదేహం వద్ద వెంకటేశ్వరరావు దంపతులు విలపిస్తున్న తీరు చూపరుల కంట తడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బుల్లా సేవలు
సౌజన్య చనిపోయినప్పటినుంచి రాత్రి వరకు 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానికులతో కలిసి ఘటనాస్థలిలోనే ఉన్నారు. పోలీసులు మృతురాలి వివరాలు తెలుసుకోవటంలో అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. సౌజన్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.