కొత్త గూటికి దారేదీ?
Published Tue, Dec 10 2013 2:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజన, వచ్చే సార్వత్రిక ఎన్నికల పోరుకు సెమీఫైనల్స్‌గా పరిగణించిన నాలుగు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం.. ఇక్కడ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలలో గుబులు రేపాయి. నిన్నమొన్నటి వరకు విభజన నిర్ణయంపై ఊగిసలాడుతున్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌లో ఉంటే తమ అడ్రస్ గల్లంతవుతుందనే అభిప్రాయానికి వచ్చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగి పోటీకి దిగినా బోర్లా పడటం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పార్టీలో ఉంటే పుట్టి మునగడం తప్పదనుకుంటున్నా వారికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను వీడి ప్రజాదరణ కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ వైపు అడుగు వేద్దామంటే అక్కడ బెర్త్‌లు ఖాళీ లేవు. టీడీపీ వైపు వెళదామంటే ప్రజా విశ్వాసం కోల్పోయిన ఆ పార్టీలోకి వెళ్లినా రాజకీయ భవిష్యత్ ఉండదన్న శంకతో మల్లగుల్లాలుపడుతున్నారు.
వెళ్లినా టిక్కెట్టు వచ్చేనా..?
జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నవి నాలుగు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరునిగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాకినాడ సిటీ నియోజకవర్గం పోగా మిగిలిన 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం (పీఆర్పీ విలీనంతో వచ్చిన నలుగురితో కలిపి) ఉంది. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌కు చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో వీరం తా ఏ పార్టీలోకి వెళాలి, వెళ్లినా టిక్కెట్టు గ్యారంటీ ఉంటుందా లేదా అనే మీమాం సతో కొట్టుమిట్టాడుతున్నారు. విభజన ప్రకటన వెలువడ్డప్పుడే ఏదో ఒక నిర్ణ యం తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరి స్థితి ఎదురయ్యేది కాదని ఎమ్మెల్యేలు, ఎంపీలు వాపోతున్నట్టు సమాచారం. అప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించిన జాబితాలో ఉంటామనే భయంతో వెనక్కు తగ్గిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ అధిష్టానమే తమను రాజకీయంగా సమాధి చేసేందని అంతర్గత సంభాషణల్లో మొత్తుకుంటున్నారు.
పయనమెటో వేచి చూడాల్సిందే..
రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఇద్దరు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నలుగురు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త జెండా పట్టుకోవడానికి తహతహలాడుతున్నట్టు సమాచారం. రాజమండ్రి పరిధిలో ఒక ఎమ్మెల్యే గత సాన్నిహిత్యం తో వైఎస్సార్ సీపీ నేతలను కలిసి తనను పార్టీలోకి తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. కోనసీమలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్ సీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నా వారిపై నెలకొన్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో వారికి అవకాశం కల్పించకూడదనే అభిప్రాయం వైఎస్సార్ సీపీ నేతల నుంచి వ్యక్తమైందంటున్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ప రిధిలో ఒక ముఖ్యనేత అయితే తన భార్య కు టీడీపీ తరఫున కాకినాడ పార్లమెంటు స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సంబంధిత నేతపై అవినీతి, ముడుపుల వంటి ఆరోపణలు ఉండటంతో టీడీపీ అధిష్టానం అందుకు సానుకూలత వ్యక్తం చేయలేదంటున్నారు. ఇదే నియోజకవర్గం పరిధిలో ఒక సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున గెలుపొందిన ఒక ఎమ్మెల్యే వచ్చేసారి కాంగ్రెస్ తరఫున అదే స్థానం నుంచి పోటీకి వెనుకడుగు వేస్తున్నారని, అలాగని ఎటూ తేల్చుకోలేక తలపట్టుకుంటున్నారని సమాచారం.
Advertisement