ఆర్టీసీ విలీనం! | A new public transport department will be set up to integrate RTC employees into government | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విలీనం!

Published Wed, Sep 4 2019 3:47 AM | Last Updated on Wed, Sep 4 2019 8:02 AM

A new public transport department will be set up to integrate RTC employees into government - Sakshi

మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు నివేదిక అందజేస్తున్న నిపుణుల కమిటీ చైర్మన్‌ ఆంజనేయరెడ్డి, సభ్యులు. చిత్రంలో మంత్రులు బుగ్గన, పేర్ని నాని, అధికారులు

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఆయన ఆమోదం తెలపడంతో 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 90 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి.. నిపుణుల కమిటీలోని సభ్యులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ శాఖ కిందకు వస్తారు. మరో వైపు ప్రస్తుతం ఉన్న ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచాలని నిర్ణయించారు. బస్సు చార్జీలు ఫెయిర్‌గా ఉండేలా ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు. దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకురావాలని చెప్పారు. ఈ మేరకు నిర్ణయాలను బుధవారం మంత్రివర్గం ఆమోదించనుంది. 

త్వరలో విధివిధానాలు ఖరారు
ఆర్టీసీ విలీనం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3,300 కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు భారం పడుతుందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ భారాన్ని భరించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విధివిధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్నారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక లాభాల బాటలో పరుగెత్తించడమే కాకుండా దేశంలోనే నంబర్‌ వన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారన్నారు. చాలా అంశాలపై అధ్యయనం జరిగాకే ముఖ్యమంత్రి.. ఆర్టీసీ విలీన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో అభద్రతా భావంతో ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగులు కావాలన్న వారి కల ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయంతో నెరవేరబోతోందని పేర్కొన్నారు. దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశ పెట్టి.. బస్సు అంటే రాష్ట్ర బస్సే ఎక్కాలన్నంతగా ఆధునికీకరించాలని సీఎం చెప్పారన్నారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ విలీనం ఆమోదం పొందుతుందని మంత్రి వెల్లడించారు.  
 

టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు 
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రి మండలి సమావేశంలో ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలుపనున్నారు. ప్రస్తుతం పాలక మండలి సభ్యుల సంఖ్య 19 ఉండగా, ఇకపై 25కు (ఎక్స్‌అఫీషియో సభ్యులు కాకుండా) పెంచనున్నారు. నూతన ఇసుక విధానానికి, మావోయిస్టు.. దాని అనుబంధ సంస్థలపై నిషేధాన్ని పొడిగిస్తూ జారీ చేసిన జీవోలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.

కార్మికుల్లో హర్షాతిరేకాలు 
సాక్షి, విజయవాడ : తమను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించనున్నందుకు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ చిరకాల కోరిక నెరవేర్చిన సీఎంకు రుణ పడి ఉంటామని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయు) నాయకులు పలిశెట్టి దామోదరరావు, వైవీరావులు అన్నారు. విలీన కమిటీకి ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు ఇచ్చిన అన్ని డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అన్ని సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించేలా చూడాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement