కడలి అలలన్ని కలలతో..కొత్త జోష్
జీవితంలో గతించిన ప్రతి క్షణమూ.. ఏదో ఒక అనుభవాన్నో, అనుభూతినో నమోదు చేస్తుంది. అది..కిలకిల నవ్వు కావచ్చు. వెక్కెక్కి పడే రోదన కావచ్చు. శిఖరాన్ని చుంబించిన విజయానందం కావచ్చు. అగాధాల్లోకి కూలబడ్డ వైఫల్యం కావచ్చు. పసిబుగ్గల మార్దవాన్ని తాకిన దివ్య స్పర్శ కావచ్చు. కసికన్నులు కురిపించిన ద్వేషాగ్ని కాక కావచ్చు. అవును.. కాలమంటేనే అంత! అది కానరాకున్నా దానితోనే పెనవేసుకుని సాగే జీవితమంటేనే అంత! గతించే సంవత్సరం ఓ అనుభవమైతే..రానున్న ఏడాది ఓ ఆలంబనం! 2015 కాలిడే వేళ.. ఏటా మాదిరే అంతా మంచే జరగాలన్న ఆకాంక్షతో రానికి ఆహ్వానం పలికారు.
సాక్షి, రాజమండ్రి : కోటి కాంతులీనుతుందని, ఆశలన్నీ తీరుస్తుందని, కలలన్నీ సఫలం చేస్తుందని.. చిన్నాపెద్దా కొత్త సంవత్సరానికి వెల్లువెత్తిన ఉత్సాహంతో, ఉద్వేగంతో స్వాగతం పలికారు. జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. యువకుల్లో జోష్ పరాకాష్టకు చేరింది. పరస్పర ఆలింగనాలు.. కరచాలనాలతో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నిష్ర్కమిస్తున్న 2014కు వీడ్కోలు చెపుతూ, 2015కు ఆహ్వానం పలుకుతూ వేసిన రంగుల ముగ్గులతో ముంగిళ్లు కొత్తకళను సంతరించుకున్నారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి వేడుకలు ఊపందుకున్నాయి. సమయం సరిగ్గా 11గంటల 59 నిముషాల 59 సెకన్లు అయ్యేసరికి.. కేరింతలు మిన్నుముట్టాయి. బంధుమిత్రులు, ఆత్మీయులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకదగ్గరే ఉన్న వారు ఒకరికొకరు తీపి తినిపించుకున్నారు.
బుధవారం రాత్రి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో వీధులు కుర్రకారు సందడితో మార్మోగాయి. వందలాదిమంది యువకులు మోటారు సైకిళ్లపై హల్‌చల్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. రాత్రి 10 గంటల నుంచే ప్రధాన కూడళ్లలో గస్తీకి పూనుకున్నారు. హుషారుగా రోడ్డుపై సందడిచేస్తూ తిరుగుతూ శుభాకాంక్షలు చెప్పుకోవడం మినహా దూకుడు, దురుసుతనాలతో పేట్రేగే వారిని నివారింరాఉ. కానీ మద్యం షాపులు మాత్రం రాత్రి 12 దాటేవరకూ తెరిచే ఉండడంతో సందుల్లో గొందుల్లో మందుబాబులు గలాటా సృష్టించారు. జిల్లాలో 11 గంటలకల్లా మద్యం షాపులు మూసేయాలని నిబంధన ఉన్నా పాటించిన వారే లేరు.
అక్కడక్కడా ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచి ఉన్నాయి. చిన్న, పెద్ద రెస్టారెంట్లు డబుల్ ధమాకాలు ప్రకటించాయి. రివర్‌బే, ఆనంద్ రీజెన్సీ, షెల్టన్, లాహాస్పిన్ వంటి పెద్ద హోటళ్లు కస్టమర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్దాపురం, పిఠాపురం, తుని, మండపేట, సామర్లకోట, రామచంద్రపురం, అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రంపచోడవరం వంటి ప్రాంతాల్లోనూ కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. చర్చిలు, ఆలయాలు, మసీదుల్లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా సందడి నెలకొంది. గురువారం వైకుంఠ ఏకాదశి కావడంతో పలు ఆలయాల్లో ఆ సన్నాహాలు కనిపించాయి.