న్యూ జోష్
న్యూ జోష్
Published Tue, Dec 31 2013 4:17 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
పండగలెన్ని వచ్చినా... న్యూ ఇయర్‌కుండే ప్రత్యేకతే వేరు. భేదం లేకుండా అంతా కలిసి చేసుకునే పండగ ఇది. ఇళ్ల ముందు ఆడపడుచుల సందడి... రోడ్లపై కుర్రకారు కేరింతలు... వారికి తగ్గట్టే నగరం కొత్తగా ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వచ్చిందంటే చాలు అందరిలో ‘నూతన’ ఉత్సాహం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పరిస్థితి ఎలా ఉన్నా... రాత్రి అవుతోందంటే ఎక్కడ చూసినా సందడే. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలైతే నూతన సంవత్సరంలోకి వెళుతున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరిది. కేక్‌లు కట్‌చేసి, టపాసులు కాల్చి.. స్వీట్లు పంచి.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం గొప్ప అనుభూతి.
- రాజమండ్రి కార్పొరేషన్, న్యూస్‌లైన్
పూలు మిలమిలమెరిసేనని...
ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు, అలాగే పెద్ద తరహా వారు తమ ఆత్మీయులు, బంధువులకు... రాజకీయ నాయకులు తమ సహ నాయకులు...ఇతరులకు పుష్పగుచ్ఛాలు, పండ్లు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వ్యాపారులు వివిధ ఆకృతుల్లో... అందమైన పూలతో ఆకట్టుకునేలా అలంకరిస్తారు. బెంగళూర్... ఊటి ఇతర సుదూర ప్రాంతాల నుంచి వీటిని కొనుగోలు చేసి ఇక్కడ అందంగా తయారు చేసి విక్రయిస్తుంటారు. బొకే సైజు, రకాన్ని బట్టి రూ. 200 నుంచి రూ. ఐదు వేల వరకూ ఉన్నాయి. ఇక పండ్ల సంగతి చెబితే అమ్మో అంటారు. ఒక్క ఆపిల్ ధర రూ. 25 ఉంది. బత్తాయి కూడా దాదాపు అదే రేంజ్‌లో ఉంది.
మనసులోని భావాలకు రూపం గ్రీటింగ్‌స
టెక్నాలజీ మారుతున్నా క్వాలిటీ ఉన్న గ్రీటింగ్ కార్‌డ్సకు ఆదరణ తగ్గలేదు. మనసులోని భావాలను ఎదుట వ్యక్తికి చెప్పేందుకు మంచి మంచి కొటేషన్‌సతో గ్రీటింగ్ కార్‌డ్స రూపొందించారు. రూ. 10 నుంచి రూ. ఐదు వేల పైబడి ధర వరకూ ఉన్నాయి. ప్రింటింగ్ కార్డులతో పాటు సంగీతం వినిపించే కార్డులు అందుబాటులో ఉన్నాయి.
కెవ్వు‘కేక్’
2014కు ఆహ్వానం పలుకుతూ వెరైటీ కేక్‌లు కేక పుట్టిస్తున్నాయి. బేకరీలన్నీ బిజిబిజీగా ఉన్నాయి. కూల్ కేక్, చాక్లెట్, ఫ్రూట్, హాట్ అంటూ పలు విధాలైన వాటిని ఆకర్షణీయంగా తయారు చేశాయి. రకాన్ని బట్టి రూ.75 నుంచి రూ. 150 వరకూ అంతకంటే ఎక్కువ ధరల్లో కూడా లభిస్తున్నాయి.
Advertisement
Advertisement