ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నూతన సంవత్సరం వచ్చిందంటే అంగన్‌వాడీ కార్యకర్తలు హడలిపోతారు. మిగిలిన వారంతా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకుంటుంటే వారు మాత్రం ఆందోళనకు గురవుతుంటారు. అందుకు కారణం ఆ శాఖలో కీలకమైన స్థానాల్లో ఉన్నవారికి గిఫ్ట్ రూపంలో నజరానాలు సమర్పించాల్సి ఉండటమే. గతంలో తక్కువ మొత్తంలో సమర్పిస్తుండటంతో వారికి పెద్ద భారంగా ఉండేది కాదు. ఈ సారి మాత్రం పెద్ద టార్గెట్‌లే ఇచ్చారు. కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్‌వైజర్ల నుంచి ఆదేశాలు వెళ్లాయి. నూతన సంవత్సర వేడుకలను అన్ని శాఖల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సిబ్బంది తమ స్థోమతను బట్టి అధికారులను కలిసి యాపిల్ పండ్లు లేదా స్వీట్ బాక్స్‌లు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.
మహిళా శిశు సంక్షేమ శాఖలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు యాపిల్ పండ్లు, స్వీట్ బాక్స్‌లతో వస్తే సరిపోదు. న్యూ ఇయర్ ‘గిఫ్ట్*’ భారీగా ఉండేలా ముందుగా ప్లాన్ చేసుకుంటారు. పెపైచ్చు కొంతమంది సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తమపై అధికారులకు నజరానా ఇవ్వాల్సి ఉంటుందని, దానికి తాము కూడా కొంత నగదు జమ చేస్తున్నామని చెప్పి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్న’ చందంగా ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకొని కొంతమంది సీడీపీఓలు, సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం వారు సెక్టార్ల వారీగా తమకు అనుకూలమైన కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.
జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలు, 235 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు అంతే సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి నుంచి కొంతమంది తమపై అధికారుల పేర్లు చెప్పుకొని భారీ నజరానా పొందినట్లు తెలిసింది. అంగన్‌వాడీ కార్యకర్త నుంచి వసూలు చేసిన 350 రూపాయల్లో 100 రూపాయలు సూపర్‌వైజర్, 250 రూపాయలు సీడీపీఓల పర్సుల్లోకి వెళ్లినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ మొత్తానికి తాము మరికొంత జోడించి తమపై వారికి గిఫ్ట్ ఇస్తున్నామని కొందరు సూపర్‌వైజర్లు అంగన్‌వాడీలకు చెప్పి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది.
సహకరించకుంటే చుక్కలు చూపిస్తారు
న్యూ ఇయర్ గిఫ్ట్‌కు అంగన్‌వాడీలు సహకరించకుంటే వారికి చుక్కలు చూపించినంత పనిచేస్తారు. తరచూ ఆ కేంద్రాలను తనిఖీలు చేయడం, ఉన్నది లేనిదీ చూసి హడావుడి చేయడం, చివరకు ‘కొండను తవ్వి ఎలుకను’ పట్టుకున్న చందంగా చిన్నపాటి కారణాలను పెద్దవిగా చూపించి నోటీసులు ఇస్తుంటారు. మూడుసార్లు నోటీసులు అందుకున్నవారిపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. దీనికి భయపడి ఎక్కువ మంది అంగన్‌వాడీ కార్యకర్తలు వారు చెప్పినట్లుగా నజరానాలు ముట్టచెబుతున్నట్లు తెలిసింది.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా అడిగినంత మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు. ఈ విషయమై మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మను వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ఫోన్ ద్వారా సంప్రదించినా ఆమె అందుబాటులోకి రాలేదు.
ఐసీడీఎస్‌లో న్యూ ఇయర్ ‘గిఫ్ట్’
Published Sun, Jan 5 2014 4:56 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement