అప్పుడే మహిళా సాధికారత: అమ్రపాలి
వరంగల్: మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే మహిళా సాధికారత సాకార మవుతుందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్‌శాఖల సం యుక్త ఆధ్వర్యంలో జరిగిన మహిళల కలల సాకారం ‘నడక’ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమస్యలు, వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమ్రపాలి ‘వియ్ శుడ్ ఆల్ బి ఫెమినిస్ట్ (మేమంతా స్త్రీ వాదులం)’ పేరున్న టీషర్ట్ ధరించి ఆకట్టుకున్నారు.
మహిళా దినోత్సవాన బతుకమ్మ ఆటలు
- పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్ వర్షిణి
పెద్దపల్లి రూరల్: ‘తంగెడు పూలో.. తడి తామెర పూలో.. ఎంగిలి పూలో.. ఎద పొంగును సూడో..’ అంటూ బతుకమ్మల చుట్టూ మహిళలతో కలసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి ఉత్సాహంగా చిందులేసి ఆకట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ మహిళలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఐకేపీ మహిళా సంఘాలతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆటలాడి మహిళా దినోత్సవాలకు మరింత ఉత్సాహాన్ని నింపారు.