తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇలాకా అయిన కుప్పం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోన్‌రెడ్డి సమైక్య శంఖారావం వినిపించనున్నారు.
=30న కుప్పం రానున్న వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి
=ఆయన రాకకు వైఎస్‌ఆర్ సీపీ ఘనంగా ఏర్పాట్లు
=కుప్పంలో ఓదార్పుతో పాటు బహిరంగ సభ
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇలాకా అయిన కుప్పం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోన్‌రెడ్డి సమైక్య శంఖారావం వినిపించనున్నారు. కుప్పం వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేపట్టేందుకు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈనెల 30వ తేదీన ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. దీనికి సంబంధించి బుధవారం పార్టీ కా ర్యకర్తలు సమావేశమయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరు సమీక్షించారు.
తొలిరోజున కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేష్ కుటుంబానికి ఓదార్పునిస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. తరువాత కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబానికి ఓదార్పునిస్తారు. అనంతరం పలమనేరుకు వెళతారు.
కుప్పం ‘దేశం’లో గుబులు
కుప్పంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కోసం ఆ పార్టీ కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న ఏర్పాట్లు తెలుగుదేశం నాయకుల్లో గుబులు రేపుతోంది. ఏర్పాట్ల సమావేశానికే భారీగా కార్యకర్తలు తరలిరావడం కొత్త పరిణామమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో జరిగే సభకు ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు జగన్‌మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన నివేదికను చంద్రబాబుకు అందజేసినట్లు సమాచారం. ఆ సభకు కుప్పంవాసులు హాజరుకాకుండా చూడాలని పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు కోరినట్లు తెలిసింది. కుప్పంవాసులు సభ రోజు ఇళ్లకు తలుపులు వేసుకోవాలని సూచిం చినట్లు సమాచారం.
వైఎస్‌ఆర్ సీపీ ఉత్సాహం
ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమ బలం నిరూపించుకునేందుకు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో తెలుగుదేశం ఓటు బ్యాంకు తగ్గినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్లు గతుకుల మయం కావడం, వీధి కొళాయిల్లో నీళ్లు రాకపోవడం, విద్యుత్ కోతలతో కుప్పం వాసులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి రాకతో చంద్రబాబు ఓటు బ్యాంకు వైఎస్‌ఆర్ సీపీ వైపు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన పర్యటకు హాజరు కాకూడదని కుప్పం ప్రజలను టీడీపీ నేతలు అభ్యర్థిస్తున్నారు. జగన్ పర్యటన కుప్పం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.