బాబు కోట నుంచి జగన్ శంఖారావం
*నేడు కుప్పం నుంచి సమైక్య శంఖారావం ప్రారంభం
*వివిధ ప్రాంతాల నుంచి కుప్పం చేరుకుంటున్న అభిమానులు
*టీడీపీలో గుబులు
సాక్షి, తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెప లాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబు ఇలాకాలో శనివారం అతి పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. దీనికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. బాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించలేదు. తొలిసారిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ సభ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాక సందర్భంగా కుప్పం సరిహద్దు కాళికమ్మ ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం నాయకుల్లో గుబులు నెలకొంది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం కుప్పంలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగనుంది. తొలి రోజున నాలుగు చోట్ల దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గం వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి ఏర్పాట్లు చేపడుతున్నారు.
ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి జిల్లా కన్వీనర్ నారాయణస్వామి కుప్పం చేరుకున్నారు. జగన్ పర్యటన పర్యవేక్షణను టూర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం చేపడుతున్నారు. సమైక్య శంఖారావం సభకు కుప్పం పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి కుప్పం నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ శ్రేణులతో నిండిపోయింది. జగన్ పైపాళెంలో ఓదార్పు ముగించుకుని వచ్చిన తరువాత సమైక్య శంఖారావం సభను బస్‌స్టాండ్ వద్ద నిర్వహిస్తారు.
దీనికోసం భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సమైక్య శంఖారావానికి జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో పాటు, కార్యకర్తలు, పార్టీలకతీతంగా ప్రజలు హాజరుకానున్నారు. వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సమైక్య సభపై కుప్పం వాసులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ సమైక్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సమైక్యత కోసం కట్టుబడిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు కుప్పంలో నీళ్లు రాకపోయినా పట్టించుకోవడం లేదని, విభజన జరిగితే అసలు నీళ్ల్లే దొరకవని ఆందోళనగా ఉందంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కుప్పంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.