28 నుంచి జగన్ సమైక్య శంఖారావం
హైదరాబాద్ : సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేయనున్నారు. ఈ నెల 28 నుంచి సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. తాజా మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమైక్య శంఖారావం యాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా మూడు ప్రాంతాల్లో కొనసాగుతుందని తెలిపారు.
ఢిల్లీ అహంకారాన్ని నిలదీస్తూ, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబడుతూ ఈ యాత్ర కొనసాగుతుందని అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరుగుతుందని జగన్ పదేపదే చెప్తున్నారని ఆయన అన్నారు. ఈ యాత్రద్వారా ప్రజానీకాన్ని చైతన్యం చేస్తారన్నారు. తెలంగాణలో కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునేవారు ఉన్నారన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ కలిసి రాష్ట్ర విభజనకోసం కేంద్రానికి గండ్రగొడ్డలి ఇచ్చారాని అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. బాబును చూసి చిత్తూరు జిల్లా ప్రజలు తలదించుకుంటున్నారని ఆయన అన్నారు. టీడీపీని కాపాడేందుకు రాష్ట్రాన్నే కాక... దేశాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో ఓదార్పు జరగలేదని.... కాబట్టి సమైక్య శంఖారావం యాత్రలో ఓదార్పు కుటుంబాలను కూడా జగన్ పరామర్శిస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, మిధున్ రెడ్డి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.