రియల్ లైఫ్.. రీల్ లైఫ్‌కి దగ్గరయ్యింది. సినిమాల్లోనే సాధ్యమయ్యే సత్వర న్యాయం ఆంధ్రుల సొంతమయ్యింది. ఓ రేప్ కేసును దృష్టిలో పెట్టుకొని ‘టెంపర్’ సినిమా తీశారట పూరి. ఆడపిల్లకు అన్యాయం జరిగితే వాళ్లకు హీరో లాంటి అన్నయ్య ఒకడుంటాడు అని ‘రాఖీ’ సినిమాలో కృష్ణవంశీ చూపించారు. ఇప్పుడు ఆంధ్రాలో ఆడపిల్లలకు నేనున్నాను అంటున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. స్టార్స్ అంతా ‘ఏపీ దిశ యాక్ట్’కు హ్యట్సాఫ్ అంటున్నారు.
జగన్ గారికి అభినందనలు– పూరి జగన్నాథ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రవేశపెట్టిన దిశాచట్టం చాలా చాలా మంచిది. ఇది అవసరం. ఇలాంటి చట్టం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఎంత కిరాతకంగా ఆత్యాచారం చేస్తే అంత కంటే కిరాతకంగా శిక్షలు కూడా ఉంటాయని తెలియాలి. దేశంలో ఇలాంటి చట్టాలు అవసరం. తొంభై శాతం రేప్‌లు మద్యం మత్తులో జరుగుతుంటాయి. మద్యపానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కంట్రోల్ చేసేలా చర్యలు చేపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిగారిని మెచ్చుకోవాలి. నిజానికి ఈ విధానం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది. అయినా సరే చిత్తశుద్ధితో చేస్తున్న ఆయన్ను అభినందించాలి. జగన్‌గారికి హ్యాట్సాఫ్. చాలామంచి పని చేస్తున్నారు. అలాగే గ్రామ సచివాలయ విధానాన్ని ప్రవేశపెట్టి దాదాపు రెండు లక్షల మంది యువతీయువకులకు ఉద్యోగ కల్పన చేశారు జగన్ గారు.
అది చిన్న విషయం కాదు. కొందరు తల్లిదండ్రులు వారి అమ్మాయిలను చాలా అమాయకంగా పెంచాలనుకుంటుంటారు. అది తప్పు. పుస్తకాల్లో కానీ మరోచోట కానీ ‘ఆడవారికి సిగ్గే సింగారం’ అని చెబుతుంటారు. అదీ తప్పే. సిగ్గుపడే మహిళలు అంటే నాకు నచ్చదు. ఏ దేశాల్లో అయితే ఆడవారు ఎక్కువగా సిగ్గుపడుతుంటారో ఆ దేశాల్లో ఆత్యాచారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చైనా, పాకిస్తాన్, ఇండియా.. ఇలా. ఆడవారి సిగ్గుని మగవారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. మగవారితో ధైర్యంగా మాట్లాడటానికి సిగ్గపడకూడదని దయచేసి తల్లిదండ్రులు వారి ఆడపిల్లలకు చెప్పండి. స్ట్రాంగ్ ఉమెన్‌ని రేప్ చేయడానికి మగవారు భయపడతారు. ఆడవారు స్ట్రాంగ్‌గా ఉండేలా వారి తల్లిదండ్రులు పెంపకం ఉండాలి.
మహిళలను మనం పుస్తకాల్లో గౌరవిస్తున్నాం కానీ నిజంగా గౌరవించడం లేదు. ఎన్నో ఏళ్లు బాల్యవివాహాలు ప్రాక్టీస్ చేశాం. చైల్డ్ అబ్యూస్ ప్రాక్టీస్ చేశాం. ఇంకా ఎన్నో ఏళ్లు భర్త చనిపోతే భార్యను తగలబెట్టే సతీసహగమనాన్ని ప్రాక్టీస్ చేశాం. 2002లో రాజస్థాన్‌లో చివరి సతీసహగమనం జరిగింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలంటే దిశ లాంటి చట్టాలు రావాలి. తీహార్ జైల్లో ఉన్న వందమంది రేపిస్ట్‌లను ఒక పాత్రికేయురాలు ఇంటర్వ్యూ చేశారు. అందరితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటంటే... రేపిస్ట్‌లందరూ ఎక్ట్రార్డినరీ వారు కాదు. ఆర్డినరీ వారే. వారు ఎందుకు చేశారు అంటే చదువుకోకపోవడం ఒక కారణం. తల్లిదండ్రుల పెంపకం మరో కారణం. అలాగే రేప్‌కు గురైన ప్రతి అమ్మాయి అమాయకురాలే. అరగంటకో రేప్ జరుగుతుంది. ఆ పాయింట్‌పై ‘టెంపర్’ సినిమా తీశాను. మనకు తెలియకుండా తగలబడిపోయినవారు ఇంకా ఎందరు ఉంటారో!
నేరాలు తగ్గుతాయి – కృష్ణంరాజు
ఏపీ ‘దిశ’ బిల్లు వల్ల నేరాలు కచ్చితంగా తగ్గుతాయనిపిస్తోంది. శిక్ష ఎప్పుడో పడుతుంది? అనే ఆలోచనతో కూడా నేరాలకు పాల్పడేవాళ్లు ఉంటారు. ఇప్పుడు 21 రోజుల్లోనే అనేది ఆహ్వానించదగ్గ మార్పు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఇది. ఎవర్నీ ఎన్‌కౌంటర్ చేయాలని మనం కోరుకోం. కానీ ఘోరాలు చేస్తున్నవాళ్లను ఎలా వదులుతాం? దిశ ఘటన తర్వాత చాలా షాక్ అయ్యాం. ఎన్‌కౌంటర్ వార్త విని, చాలా ఆనందపడ్డాం. నేరం చేయాలనే ఉద్దేశం ఉన్నవారికి ఇదొక పాఠం. శిక్ష వెంటనే పడాలి. అప్పుడు నేరాలు తగ్గుతాయి. ఓ 20, 25 ఏళ్లు కంటికి రెప్పలా పెంచిన కూతుర్ని చీమలా నలిపిస్తే ఏ తల్లిదండ్రికి బాధ ఉండదు చెప్పండి. అలాగే మగపిల్లలనూ ఇష్టంగానే పెంచుతారు తల్లిదండ్రులు.
వాళ్లు నేరం చేశారంటే ఆ పేరంట్స్‌కి కూడా బాధగానే ఉంటుంది. తప్పు చేస్తే సమాజంలో గౌరవం ఉండదనే భావన ఉంటే తప్పు చేయరు. రష్యాలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ డ్రింక్ చేసి బాగా గొడవ చేసేవాళ్లు. అక్కడో బోర్డ్ పెట్టారు. ఎవరెవరు ఎంతెంత తాగారు? అని ఆ బోర్డ్ మీద రాసేవాళ్లు. తర్వాతి రోజు అది చూసుకుని, ఎక్కువ తాగిన వ్యక్తిగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవాడు... ఊళ్లో తనే తాగుబోతు అని చెప్పుకుంటారేమోనని మూడు నుంచి రెండు పెగ్గులకు తగ్గించాడు. అలా అలా పూర్తిగా మానేశాడు. గౌరవంగా బతకాలనుకునేవాళ్లల్లో ఇలా మంచి మార్పు వస్తుంది. పేరంట్స్ పెంపకం వంటివన్నీ వదిలేస్తే.. గౌరవం కాపాడుకోవాలనే తపన ఎవరికి వాళ్లకు ఉండాలి. అప్పుడు హుందాగా బతుకుతారు.
మంచి నిర్ణయం – వెంకటేశ్
‘‘ఈ బిల్లు ద్వారా నేరాలు తగ్గుతాయా లేదా అనే వాదనని పక్కన పెడితే ఇలాంటి నేరాల్లో నిర్ణయం త్వరగా తీసుకోవాలి అనుకోవడం చాలా కరెక్ట్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బిల్ పాస్ చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసులు జరిగినప్పుడు తీర్పు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. ఈ విషయం గురించి మాట్లాడటానికి నేను సరైన వ్యక్తిని కాకపోయినా చెబుతున్నాను. ఇలాంటి విషయంలో టైమ్ వేస్ట్ చేయకూడదు. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరో ఒకరు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. స్త్రీలను ఎలా గౌరవించాలి, వాళ్లను ఎలా సేఫ్‌గా ఉంచగలం అని అందరూ ఆలోచించాలి.
అభినందనీయం – నాగచైతన్య
ఇలాంటి ఇష్యూలకు ఇంత చర్చ ఉండటం అనవసరం. తీర్పు అనేది సత్వరంగా ఉండాలి. జీఎస్టీ లాంటి విషయాల్లోనే తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఆలస్యం ఎందుకు చేస్తున్నాం మనం? ఇలాంటి బిల్‌ను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.
న్యూ ఇయర్ గిఫ్ట్ – జయసుధ
దిశ గురించి దేశమంతా ఎలా మాట్లాడుకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దిశాబిల్లు గురించి కూడా అందరూ మాట్లాడాలి. ఆడపిల్లలను హింసించే వారందరూ ఇక జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో ఏం చేసైనా శిక్ష పడకుండా హాయిగా బయట తిరిగేయొచ్చు, అనే వారందరికి సవాలు విసిరారు జగన్. ఇకనుండి ఇలాంటి వాళ్ల పప్పులు ఉడకవు. 21 రోజుల్లో సత్వర న్యాయం అనే విషయం వింటుంటేనే ఒక ఆడదానిగా, నటిగా, రాజకీయాల్లో ఎంతో మందిని చూసిన నేతగా అన్నీ రకాలుగా హ్యాపీగా ఉన్నాను ఈ బిల్లు గురించి తెలియగానే. అలాంటి సీయం అందరికీ కావాలి. చాలామంది సీయంలకు ఇలా చేయాలని ఉన్నా కూడా చేయలేక పోయారు. ఇప్పుడు అలాంటి డెసిషన్ తీసుకుందాం అనుకునే వాళ్లందరికీ జగన్ మార్గదర్శకుడయ్యారు అనటంలో సందేహం లేదు.
అలాంటి జగన్ గారు నాకు వ్యక్తిగతంగా తెలియటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటం ఏ నాయకుడికైనా అంత ఈజీ ఏం కాదు. ఈయన ఎప్పుడు ఏం తప్పుచేస్తారా ఆయన గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే ప్రతిపక్షాలు ఉంటాయి. వీటన్నిటి గురించి ఆలోచించకుండా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇది హిస్టారికల్ డెసిషన్. నేను ఎన్నో సంఘటనలను చూశాను. ఆడవాళ్ల అందరికి ఈ బిల్లు చాలా ధైర్యాన్నిచ్చింది. ఎందుకంటే ఏ తల్లితండ్రులూ ఇంతటి దారుణాన్ని ఊహించరు. ఓ న లుగురు మనుషులు తమ కూతురుని రేప్ చేసి, హత్య చేసి ఆనక కాల్చి బూడిద చేస్తారని ఊహించటానికి కూడా ఇష్టపడరు.
అలాంటిది అది మనకు తెలిసినవాళ్లకో, మన దగ్గరివాళ్లకో జరిగితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది! అందుకే ఈ బిల్లు ప్రవేశ పెట్టారు అనగానే నేను ఎంత ఆనంద పడ్డానో మాటల్లో చెప్పలేను. ఇదేదో లబ్ధి పొందటానికి జగన్ గారు చేశారనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన సీయం పీఠమెక్కి ఆరు నెలలే. ఇంకా నాలుగున్నరేళ్లు ఆయన పాలన ఎంత డైనమిక్‌గా ఉండబోతుందో ఈ సంఘటన ద్వారా తెలుస్తూనే ఉంది. ఇలాంటి డెసిషన్ తీసుకోవటానికి ఇది కరెక్ట్ టైమ్. యంగర్ జనరేషన్‌కి ప్రాబ్లం వస్తే ఆ తల్లితండ్రుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. అందుకే ఇది 2019లోనే పెద్ద డెసిషన్, 2020 న్యూయర్‌కి ఆడవాళ్లందరికీ జగన్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్‌లా ఫీలవుతున్నాను. జగన్ సీయం పదవిలో ఉండి ఈ బిల్లును పాస్ చేశాడు కాబట్టి మేమందరం కూడా ఇలా చేయాలి అని మిగతా సీయంలు అనుకొని భారతదేశంలోని ఆడవాళ్లందరికీ న్యాయం చేస్తారని అనుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment