‘‘తెలుగువారందరూ 50-60 ఏళ్లుగా గొప్పగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నేడు మనం గర్వించే రాజధానిగా తయారైంది. అలాంటిది ఉన్నఫళంగా సీమాంధ్రలో వేరే రాజధాని కట్టుకోమంటే చంద్రబాబు కూడా సరేనంటూ నాలుగు లక్షల కోట్లు అడిగారు. విభజనకు సరేనని ఉత్తరం ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు.. తన ఎంపీలతో రాజీనామాలు చేయించి.. మరికొందరితో పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపచేయించారు. బాబును భావితరాలు కూడా క్షమించవు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబు కూడా ఆలోచించాలి. తన మాట కాదని ఎంపీలు రాజీనామా చేశారా? ఆయనిచ్చిన ఉత్తరానికి వ్యతిరేకంగా చేశారా? అదే జరిగితే మీ పార్టీలో మీ మాటకు కట్టుబడే పరిస్థితి లేదా? తెలుగు ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో మీరు ఆడుతున్న నాటకాల్ని నేడు ప్రతి చిన్న కుటుంబంలోని వారూ గ్రహించారు, మీ మోసాల్ని ఎవరూ మెచ్చరు..’’ అని హితవు పలికారు.
వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనే..
‘‘సీమాంధ్రలోనే కాదు తెలంగాణలో సైతం జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజాభిమానం చాలా గొప్పగా ఉంది. మొత్తం 30-37 ఎంపీ సీట్లు గెలవడంతోపాటు, 180-190 అసెంబ్లీ సీట్లు సాధించి మా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏం చేసైనా ఈ అవకాశాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే విభజన ప్రకటన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచీ వాళ్ల ధ్యేయమంతా ఎలా ఇబ్బంది పెట్టాలన్నదే. ఆ ధ్యేయంతోనే సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం ప్రకటించింది. ఇది అనాలోచిత నిర్ణయం’’ అని విమర్శించారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి సీఎంగా ఉండగా తీర్మానం చేసి పంపితే.. దాన్ని పట్టించుకోకుండా ఇప్పటివరకూ తెలంగాణపై అసెంబ్లీలో ఏ తీర్మానం చేయని ఆంధ్రప్రదేశ్‌ను చీల్చాల్సిన అవసరం ఏమిటి? నేడు దేశంలో చాలా రాష్ట్రాలను విభజించాలని చాలా డిమాండ్‌లు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాటన్నింటి జోలికీ పోకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగు ప్రజలను రాజకీయ కారణాలతో, తెలంగాణలో పది సీట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇలా చేస్తారా?’’ అని మేకపాటి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
చీల్చడం చంద్రబాబుకు కొత్త కాదు: జూపూడి
రాష్ట్రాన్ని, కులాలను, కుటుంబాన్ని చీల్చడం చంద్రబాబుకు కొత్త కాదని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ దుయ్యబట్టారు. విభజనపై సీమాంధ్ర అగ్నిగుండంలా రగులుతోంటే బాబు సమైక్యంగా ఉండాలని అమెరికా సభల్లో కథలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ ధర్నాలో జూపూడి మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఢిల్లీ పెద్దలతో మాట్లాడే బాబు రాష్ట్ర విభజనపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘సమన్యాయం చేయలేకపోతే విభజనపై నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్‌కు లేదు. విజయమ్మ దీక్ష దేశ రాజకీయాల్లో మలుపు. జగన్ దీక్ష దేశ రాజకీయ నేతలను ఆలోచింపజేస్తుంది. ఆయన నాయకత్వంలో 42 మంది ఎంపీలు పార్లమెంటుకు వస్తే దేశ రాజకీయాలను శాసిస్తారనే భయంతోనే ఢిల్లీ పెద్దలు కుట్రతో ఆయనను జైలులో పెట్టారు’ అని ధ్వజమెత్తారు. జగన్‌ను ఎదుర్కోలేకే కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డాయని వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, భూమన కరుణాకర్‌రెడ్డి, టి.బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
బాబు లేఖతోనే విభజన: ఉమ్మారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విడగొడితే తనకు అభ్యంతరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇచ్చారని.. ఆ కారణంతోనే విభజనకు కాంగ్రెస్ సిద్ధపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారమిక్కడ వైఎస్ విజయమ్మ ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే బాబు.. నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వండి, మేం వెళ్లి ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అంటూ బేరసారాలకు దిగారు. సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని గమనించి వెంటనే ప్లేటు ఫిరాయిస్తూ సమస్యలంటూ ప్రధానికి లేఖ రాశారు. రెండు కళ్ల ధోరణి, రెండు నాల్కల ధోరణి మానుకోకపోతే బాబు చరిత్రహీనులవుతారు’ అని విమర్శించారు. ఆత్మగౌరవ యాత్రకు వెళ్తే.. జనాగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందనే మానుకున్నారని చెప్పారు.
బాబును భావితరాలు క్షమించవు: ఎంపీ మేకపాటి
Published Thu, Aug 29 2013 1:42 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM
Advertisement