రైతులకు బతుకుదెరువు ఎలా?: ఎన్జీటీ
ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎన్జీటీ.. అమరావతి నిర్మాణంపై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం వ్యవసాయ భూములను తీసుకుంటే రైతులకు బతుకుదెరువు ఎలా? అని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ప్రశ్నించింది. పంటలు పండించి వ్యవసాయం చేయడం మాత్రమే తెలిసిన రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇస్తే దాంతో వాళ్లు ఏం చేసుకుంటారని, వాళ్ల జీవనాధారం ఎలా? అని నిలదీసింది. అమ రావతి నిర్మాణానికి సంబంధించిన పర్యావ రణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురు వారం కూడా విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిం చారు.
శివరామకృష్ణన్ కమిటీ చేసిన ‘తగి నంత భూమి లభ్యత’ సిఫారసుకు అమరా వతి అనుకూలంగా లేకపోయినా.. 33 వేల ఎకరాలను భూ సేకరణ ద్వారా సేకరిం చామని తెలిపారు. ఈ క్రమంలో ధర్మాసనం కల్పించుకొని.. రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేసేందుకు పట్టే కాలంలో రైతుల బతుకుదెరువు ఎలా?, వారికి నష్టపరిహారం ఏమైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించింది. భూములిచ్చిన రైతులకు పింఛన్, భూమి రకాన్ని బట్టి ఏటా కొంత మొత్తం చెల్లిస్తున్నామని గంగూలీ తెలిపారు.
2013 చట్టం ప్రకారం చేయలేదు..
పిటిషన్ల తరఫు న్యాయవాది సంజయ్ పరీఖ్ వాదనలు వినిపిస్తూ.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం భూమి సేకరించలేదని, రైతులకు తగిన పునరావా సం, నష్టపరిహారం కల్పించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది రైతులు తమ భూములు ఇవ్వలేదని తెలిపారు. దీనిపై గంగూలీ స్పందిస్తూ 2013 భూ సేకరణ చట్టం కంటే మెరుగైన ప్రయోజనాలను కల్పిస్తున్నామన్నారు. అనంతరం సంజయ్ స్పందిస్తూ బహుళ పంటలు పండే భూము లను ప్రభుత్వం రాజధానికి ఎంపిక చేసిం దని, దీంతో రైతుల జీవనోపాధి దెబ్బ తింటుందని వివరించారు. తదుపరి విచార ణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.