
నిఘావర్గాలు హెచ్చరించినా పోలీసుల నిర్లక్ష్యం..
గోరంట్ల పరిధి ప్రశాంతినగర్‌లో దొంగల హల్‌చల్
పట్టపగలే యథేచ్ఛగా రూ.30 లక్షల విలువైన సొత్తు దోపిడీ
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాలన్నా, బంగారు ఆభరణాలు ధరించి బయటకు రావాలన్నా జనం హడలిపోతున్నారు. నిఘా వర్గాలు హెచ్చరించిన రెండు రోజులకే నగర శివారు గోరంట్ల గ్రామంలో శుక్రవారం దోపిడి దొంగలు హల్‌చల్ చేశారు. ఓ ఇంటిలో పనిమనిషిని కట్టిపడేసి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే సొత్తు దోచుకెళ్లడం పోలీసులు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.
నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు చేసే ముఠాలు తిరుగుతున్నాయని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు రెండు రోజుల కిందట హెచ్చరికలు చేశాయి. ఈ విషయంపై అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ నగరంలోని అన్ని పోలీసు స్టేషన్‌ల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా గోరంట్లలో జరిగిన దోపిడీ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది.
గోరంట్లలో దోపిడీ.... గోరంట్ల పరిధి నగరాలులోని పాండురంగానగర్‌లోగల ప్రశాంతినగర్ రెండో లైన్‌లో రిటైర్డ్ అగ్రికల్చర్ అధికారి మిరియూల లక్ష్మినారాయణ కుమారుడు మిరియూల మురళీకృష్ణ నివాసం ఉంటున్నారు. ఆయన బ్రాడీపేటలో పంచమి ప్రాజెక్ట్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వృద్ధుడైన తండ్రి లక్ష్మీనారాయణను ఇంట్లో ఉంచి తెల్లవారుఝామున మురళీకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లల్ని తీసుకుని అన్నవరం వెళ్లారు.
ఇది గమనించిన ఆరుగురు గుర్తు తెలియని దుండగులు తెల్లని కారులో మురళీకృష్ణ ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్న లక్ష్మినారాయణను అమాంతం ఎత్తుకెళ్లి ఇంట్లో కూచోబెట్టారు. అనుకోని సంఘటనతో ఆయన నోటమాటరాలేదు. ఇదే అదనుగా దొంగలు తమ పని కానిచ్చారు.
సుమారు 12.45 గంటల సమయంలో మురళీకృష్ణ కార్యాలయంలో పనిచేస్తున్న దబేర శ్రీనివాసరావు అనే యువకుడు లక్ష్మీనారాయణకోసం హోటల్ నుంచి భోజనం తీసుకుని వచ్చాడు. ఓ దుండగుడు శ్రీనివాసరావును లోపలకు లాగి కాళ్ళు, చేతులు కట్టేసి, ముఖానికి ప్లాస్టర్ వేశారు. హతమారుస్తామని బెదిరించారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు రూ. 23లక్షల బంగారు ఆభరణాలు, రూ. 7లక్షల నగదును చక్కబెట్టారు
ఒంటిగంటన్నర సమయంలో అక్కడకు పనిమనిషి రావడాన్ని బయటవున్న దొంగలకు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లోపలకు సమాచారం అందించారు. దాంతో దొంగలు చప్పుడు కాకుండా బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. ఇప్పటికైనా దృష్టి సారించాలి....
నగరంలో ఆరు పోలీసు స్టేషన్లు ఉండగా, ఇటీవల వరకు అరండల్‌పేట, గుంటూరు రూరల్, కొత్తపేట, పాతగుంటూరు స్టేషన్‌లకు సీఐలు లేరు. దీంతో పోలీసు సిబ్బంది ఇష్టాను సారంగా వ్యవహరించారు.
ఇటీవల అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ ఆయా స్టేషన్‌లకు అటాచ్‌మెంట్‌పై సీఐలను నియమించినప్పటికీ కొత్త కావడంతో వారికి ఇంకా అవగాహన రాలేదు. ఏదేమైనా నగరంలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు చూసి నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికైనా దొంగతనాలు, దోపిడీలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నగర వాసులు కోరుతున్నారు.