ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతితో స్వగ్రామమైన నిమ్మకూరు లో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుటుంబసభ్యుడ్ని కోల్పోయినట్లు గ్రామస్తులు రోదించారు. బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. జ్ఞాపకాలు తలచుకుంటూ విచారం వ్యక్తం చేశారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు బుధవారం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.
సాక్షి,విజయవాడ/ పామర్రు : టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఆయన స్వస్థలం నిమ్మకూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోయాడని తెలుసుకున్న గ్రామస్తులు విలపించారు. ఆయన పుట్టిన నిమ్మకూరులోనే అంత్యక్రియలు జరిగితే బాగుంటుదని పలువురు భావించినా, అది అసాధ్యమని మౌనంగా ఉండిపోయారు. హరికృష్ణ గురించి ఆయన సన్నిహితులు, గ్రామస్తులు అభిప్రాయాలు వారి మాటల్లోనే....
వరదయ్య కొట్టే అడ్డా.....
హరికృష్ణకు చిన్నప్పుడు ఒక స్నేహితుల బృందం ఉండేదట. పాఠశాల సమీపంలో వరదయ్య కొట్టే వారకి అడ్డా. స్నేహితులతో కలిసి అక్కడ కూర్చుని చిరుతిళ్లు తిన్నేవారు. స్నేహితులకు చిరుతిళ్లు అన్ని హరికృష్ణ ఖాతాలోనే. డబ్బులు లేకపోతే వరదయ్య కోట్లోనే అప్పు చేసేవాడు. తరువాత నానామ్మ వెంకట రావమ్మ వద్ద దాచుకున్న డబ్బులు తెచ్చి అప్పు తీర్చేవాడని వరదయ్య సాక్షికి వివరించారు. తరువాత కాలంలో వరదయ్యకు అనారోగ్యం వస్తే హరికృష్ణ ఆయన్ను నిమ్స్ పిలిపించుకుని వైద్యం చేయించుకున్నారు. నిమ్మకూరులో హరికృష్ణకు సన్మానం చేసినప్పుడు వరదయ్య షాపు వద్ద తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
మామగారి పేరుతో బస్ షెల్టర్....
హరికృష్ణ మామగారు సోమశేఖరరావు చనిపోయిన తరువాత ఆయన జ్ఞాపకార్థం నిమ్మకూరులో బస్‌షెల్టర్ నిర్మించారు. దీనికి హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ కూడా వచ్చి అందర్ని పేరు పేరునా పలకరించారని కుదరవల్లి సతీష్ బాబు తెలిపారు.
మంచి చతురుడు..
ఆయన అందరితోనూ ఎంతో సన్నిహితంగా, చతురతతో ఉండేవారని, మహిళల్ని అక్కా,అమ్మా అంటూ సంబోధించేవారని ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండే పద్మ తెలిపింది. లక్మయ్య, ఎన్టీఆర్, హరికృష్ణ ఆమెకు సుపరిచితులే. రజక వృతి చేసుకుని జీవించే తనను హరికృష్ణ ఆర్థ్ధికంగా ఆదుకున్నారని పద్మ ‘సాక్షి’ కి తెలిపారు.
కొడాలి నాని అంటే ఎంతో అభిమానం
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అంటే హరికృష్ణకు ఎంతో అభిమానం. అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, గుడివాడ నుంచి పోటీ చేసినప్పుడు నాని వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు స్థాపించడంలో కొడాలి నాని ఎంతో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణకు గ్రామస్తులు సన్మానం చేసినపుడు నాని స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని హరికృష్ణను సత్కరించారు. తరువాత నానికి గుడివాడ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిచడంలోనూ హరికృష్ణ ఎంతో ఆసక్తి చూపించారని గ్రామస్తులు
చెబుతున్నారు.
చెరువులో ఈత... తాతతో కలిసి వ్యవసాయం
నిమ్మకూరు చెరువులో స్నేహితులతో కలిసి ఈత కొట్టేవారు. తాతయ్య సాగు చేసే పొలానికి స్నేహితులతో కలిసి వెళ్లేవారు. తండ్రి ఎన్టీఆర్, తాతయ్య లక్ష్మయ్య లాగానే వ్యవసాయం అన్నా సినిమాలు అంటే ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు. అందువల్లనే నిమ్మకూరులో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ ఆయనకు ఆ గ్రామంలో పంటభూములు ఉన్నాయి. ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఈ గ్రామంలో పొలాలు కొనిపించటం విశేషం.
గ్రామంలో అందరితోనూ సన్నిహితంగా..
హరికృష్ణ గ్రామంలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. రాజ్యసభ సభ్యుడుగా స్వగ్రామనికి వచ్చినప్పుడు కూడా కారు గానీ, గన్‌మెన్ గానీ ఉండేవి కాదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. నడుచుకుంటూనే గ్రామమంతా తిరిగే వారు. పేరు పెట్టి కాకుండా బాబాయి, అన్నాయ్, తమ్ముడు, మామయ్య, అమ్మ, అక్కా అంటూ బంధుత్వాలను కలుపుకుని పిలిచేవారని ఏ మాత్రం బేషజం లేకుండా అందరితో కలిసి కూర్చుని మాట్లాడేవారని గ్రామస్తులు చెబుతున్నారు.
నిమ్మకూరులోనే ఓటు..
హరికృష్ణ జీవితకాలమంతా నిమ్మకూరునే శ్వాస, ధ్యాసగా భావించారు. నిమ్మకూరులో పుట్టడమే కాకుండా అక్కడమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత నిమ్మకూరుకు తన ఓటును మార్చుకున్నారని ఆయన స్నేహితులు గుర్తు చేసుకున్నారు.
నిమ్మకూరు అభివృద్ధిలో కీలకపాత్ర....
అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.25 లక్షలు, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.05 కోట్లు, ఏపీఆర్‌జేసీ గురుకుల పాఠశాలకు రూ.40 లక్షలు, సోలార్ విద్యుదీపాలకు రూ.1 కోటి రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి చేశారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.
అంతే కాకుండా నిభానుపూడి వెళ్లే రోడ్డు, అవురుపూడి వెళ్లే రోడ్లకు కూడా నిధులు కేటాయించారని ఆయా గ్రామాల ప్రజలు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు.
గరికపర్రుతో ప్రత్యేక అనుబంధం
తోట్లవల్లూరు: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చైతన్యరధ సారథి, సినీనటుడు దివంగత నందమూరి హరికృష్ణ మృతితో మండలంలోని గరికపర్రులో విషాదచాయలు అలముకున్నాయి. తోడల్లుడి స్వగ్రామమైన గరికపర్రుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. కృష్ణా జిల్లాకు ఎప్పుడు వచ్చినా హరికృష్ణ గరికపర్రులోని ఆయన తోడల్లుడు సూరపనేని హనుమంతరావు నివాసంలోనే ఎక్కువగా గడిపేవారు. నాలుగైదు రోజులు ఉండి బంధువులతో ఆత్మీయంగా గడిపి హైదరాబాద్ వెళ్లేవారు. హరికృష్ణ రాక విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పార్టీ నాయకులు అధికసంఖ్యలో వచ్చి కలుసుకునే వారు. గరికపర్రు అభివృద్దికి హరికృష్ణ ఎనలేని కృషి చేశారు. ఆయన రవాణా మంత్రిగా పని చేసినప్పుడు ప్రత్యేకంగా గ్రామానికి బస్సు ఏర్పాటు చేశారు. ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలకుపైగా మంజూరు చేయించి సిమెంటు రహదారులు, వంతెనలు నిర్మింపజేశారు.
రూపాయి పాతి డబ్బుల చెట్టుకోసం..
రూపాయి బిళ్ల భూమిలో పాతితే డబ్బులు చెట్టు వస్తుందని అతని మిత్రుడు గాంధీ చెప్పడంతో నమ్మిన హరికృష్ణ తన ఇంట్లో రూపాయి బిళ్ల పాతి రోజు నీళ్లు పోసేవాడు. అయితే వారం తరువాత కూడా డబ్బులు చెట్లు రాకపోవడంతో స్నేహితులందరికి చెప్పడంతో అంతా సరదాగా నవ్వుకునేవారంట! అని ఆయన స్నేహితుడు కుదరవల్లి రఘురామయ్య సాక్షికి తెలిపారు.
–రఘురామయ్య
ఇద్దరం ఒకే చోట ఉండేవాళ్లం
నేను హరికృష్ణ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. అయితే లక్మయ్య తాత ఇంట్లో, లేదా మా ఇంట్లో ఉండేవాళ్లం. పెళ్లయ్యే వరకు మద్రాసు వెళ్లినా కలిసి వెళ్లేవారం. కలిసి వచ్చేవాళ్లం. చిన్నప్పుడు వాళ్ల ఇంటి నుంచి సవారీ (పరిగెత్తు) చేసూ కొస్తున్నాం. ఇద్దరం కలిసే పొలానికి వెళ్లేవారం. మోటర్ సైకిల్ ఎక్కితే ఎదురుగా ఎవరు వచ్చినా చూసేవాడు కాదు. ఇద్దరం కలిసి పోటీ పెట్టుకుని పరిగుపెడుతుంటే ఎదురుగా వచ్చిన ఒక రైతు చేతిలో ఉన్న పలుగు ఇద్దరికి రెండువైపుల తగిలి ఇద్దరం ఒకేసారి కిందపడిపోయాం.
–యలవర్తి శరత్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment