విద్యుదాఘాతానికి ట్రాక్టర్ ట్రాలీ వెనుక చక్రం నల్లగా మాడిపోయిన చిత్రం
కాసేపట్లో ఇల్లు చేరతామంటూ మిర్చి కూలీలంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం. ట్రాక్టర్‌లోంచి కొందరు ఎగిరిపడ్డారు. మరికొందరు ట్రాలీలోనే ఉండిపోయారు. వారిపై విద్యుత్ తీగలు పడ్డాయి. కేకలు.. అరుపులు.. ఏం జరిగిందో అర్థం కాకముందే ఘోరం జరిగిపోయింది.
నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం సమీపంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. కుమ్మరిడొంక వద్ద మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని పొలాల్లో మిర్చి కోతలకు వెళ్లిన కూలీలు ట్రాక్టర్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
► మాచవరం గ్రామానికి చెందిన నల్లూరి చెంచయ్య తాను కౌలుకు తీసుకున్న 3 ఎకరాల పొలంలో మిర్చి కోతలకు 23 మంది కూలీలను తన ట్రాక్టర్‌లో ఎక్కించుకుని మధ్యాహ్నం పొలానికి వెళ్లాడు. ఈ కూలీలంతా ఉదయం ఉపాధి పనులకు వెళ్లి వచ్చారు.
► ఇంటికి తిరిగి వస్తుండగా అమ్మనబ్రోలు–నాగులుప్పలపాడు మధ్య హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉన్న స్తంభాన్ని ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.
సంఘటనా స్థలంలో మృతి చెందింది వీరే
► పీకా కోటేశ్వరమ్మ (50), నూకతోటి లక్ష్మమ్మ (65), కాకుమాను రమాదేవి (55), రమాదేవి కొడుకు, కాకుమాను శివ (17), కాకుమాను కుమారి (60), కాకుమాను రవీంద్ర (మహిళ– 40), గోళ్ల రవిశంకర్ (20), కాకుమాను మౌనిక (18), కాకుమాను అమూల్య (18).
► పొలం కౌలుదారు, ట్రాక్టర్ డ్రైవర్, యజమాని నల్లూరి చెంచయ్య (48), కాకుమాను భాగ్యవతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ చెంచయ్య
మృతి చెందాడు. రోదనలు మిన్నంటిన కుమ్మరి డొంక
► ప్రమాదం జరిగిన కుమ్మరిడొంకలో రోదనలు మిన్నంటాయి. రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న మాచవరానికి చెందిన మిర్చి కూలీలు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో మాచవరం, రాపర్ల గ్రామాల్లోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు,పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
► ప్రమాదం జరిగిన ట్రాక్టర్ ట్రక్కులోనే విగతజీవులై పడివున్న మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కాటేసిందంటూ కన్నీరు మున్నీరుగా రోదించారు. మృతదేహాలపై పడి తల్లడిల్లిపోయారు. మృతులంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు.
వెంటనే స్పందించిన పరిసర ప్రాంతాల రైతులు
► ప్రమాదం జరిగిందని గమనించిన కుమ్మరిడొంక పరిసర ప్రాంతాల్లో పొలం పనులు చేసుకుంటున్న రైతులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులైన నల్లూరి చెంచయ్య (ఆసుపత్రిలో చనిపోయాడు), కాకుమాను భాగ్యవతిని, స్వల్ప గాయాలైన మరో 11 మందిని వేరే ట్రాక్టర్‌లో చికిత్స నిమిత్తం తరలించారు.
► నాగులుప్పలపాడు ఎస్‌ఐ జి సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్‌కు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్–1 జేవీ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
సీఎం దిగ్భ్రాంతి.. సహాయక చర్యలకు ఆదేశం
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో కూలీలు మరణించిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, బాధిత కుటుంబాలను పరామర్శించాలని జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు.
బాధితులను ఆదుకుంటాం : మంత్రి బాలినేని
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన అధికారులను అప్రమత్తం చేసి ఘటనాస్థలానికి పంపించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల పరామర్శ
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కాకుమాను భాగ్యలక్ష్మి, నల్లూరి చెంచయ్యలను జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. చెంచయ్యకు కాలు తెగిపోగా శరీరంలో సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. భాగ్యలక్ష్మి శరీరం కూడా 70 శాతం కలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చికిత్స పొందుతూ కాసేపటి తర్వాత చెంచయ్య మృతి చెందాడు. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్‌ఎంఓ వేణుగోపాలరెడ్డి పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. కాగా, అంతకు ముందు క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జేసీ మురళి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగతో పాటు మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమాలపు కృష్ణారెడ్డి తదితరులు పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును కలెక్టర్ భాస్కర్, జేసీ వెంకట మురళి వాకబు చేశారు.
ప్రమాద స్థలం వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు
Comments
Please login to add a commentAdd a comment