సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 99.35 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా... మొదట్లో మందకొండిగా ప్రారంభమైన మధ్యాహ్నానికి ఊపందుకుంది. సమయం ముగిసే సరికి మొత్తం 1087 మంది ఓటర్లలో 1080 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌కు దూరంగా ఉండాలని సీపీఐ నిర్ణయం తీసుకోవడంతో... ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్‌కు హాజరుకాలేదు.
ఇక మిగిలిన ముగ్గురిలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో, ఒకరు అధికార పార్టీ అడ్డుకోవడంతో ఓటింగుకు రాలేదని సమాచారం. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థు డి. వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిలతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు దండు శేషుయాదవ్, వి. వెంకటేశ్వరరెడ్డిలు.. కర్నూలు ఎన్నికల కేంద్రంలో ఉదయం నుంచి పోలింగ్ ముగిసే వరకూ ఓటింగ్ సరళిని దగ్గరుండి పరిశీలించారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి..కర్నూలు పోలింగు కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు నంద్యాల కేంద్రంలో, కర్నూలులో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మణిగాంధీ, ఐజయ్యలు తమ ఓటు వేశారు. ఆదోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, జయ నాగేశ్వరరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని పరిశీలకులు కరికాల వలన్, టీజీ వెంకటేష్‌లు కర్నూలు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బందోబస్తు తీరును డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆదోని డీఎస్పీలు పర్యవేక్షించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్... ఆదోని, నంద్యాలలో ఎన్నికల తీరును పరిశీలించారు. ఇదిలా ఉండగా ఎవరికి వారు తమదే గెలుపని ప్రకటించుకున్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే... ఓటమి భయం కళ్లకు కట్టినట్టు కనిపించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కార్లలో తరలింపు
పోలింగ్ కేంద్రానికి పలువురు ఓటర్లను అధికార పార్టీ నాయకులు.. కార్లలో తరలించారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో ఓటింగు కేంద్రానికి తీసుకొచ్చారు. తమకు ఓటు వేస్తారో లేదోననే అనుమానంతో పలువురు సహాయకులను నియమించుకున్న అధికార పార్టీ... సహాయకులకు ప్రత్యేక సూచనలు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రయత్నాలు చేయడం కనిపించింది.
స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచిన బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు ఎంపీటీసీ సభ్యుడు బాల ఉస్సేనిని కిడ్నాప్ చేశారంటూ అధికార పార్టీ కిడ్నాప్ డ్రామా ఆడించింది. తమ పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని తామెందుకు కిడ్నాప్ చేస్తామని.. అధికార పార్టీనే కిడ్నాప్ చేసిందని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.
కర్నూలు డివిజన్‌లో అత్యధికం..
జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రెవెన్యూ డివిజన్‌లో ఓటింగ్ జరిగింది. మొత్తం 1087 మంది ఓటర్లు ఉండగా... 1080 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నూలు డివిజన్‌లో అత్యధికంగా 99.74 శాతం ఓటింగ్ నమోదయ్యింది. కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో 387 మంది ఓటర్లకుగానూ 386 మంది ఓటు వేశారు. ఇక నంద్యాల డివిజన్‌లో 307 మందికిగానూ 306 మంది ఓటు వేశారు. ఆదోనిలో 393 మంది ఓటర్లు ఉండగా... 388 మంది మాత్రమే ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా సగటున 99.35 శాతం ఓటింగు నమోదయ్యింది.
99%
Published Sat, Jul 4 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement