kunool
-
నేడు కర్నూలుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలు వెళ్తున్నారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడులో జరిగే పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 10.40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.10 గంటలకు దిన్నెదేవరపాడు గ్రామంలోని రాగమయూరి రిసార్ట్స్‌కు చేరుకుని, వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. 1.20 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
‘రాష్ట్రం బాగుపడటం చంద్రబాబు, పవన్‌కు ఇష్టం లేదు’
సాక్షి, కర్నూలు: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు రాష్ట్రాన్ని అప్పుల ఊబీలో ముంచి దివాల తీయించేలా చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ మండిపడ్డారు. సోమవారం విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేరు, ప్రత్యేకత కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని ఆయన అన్నారు. రాష్ట్రం బాగుపడటం చంద్రబాబుకు ఆయన దత్త పుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదని, ఇందుకోసమే పదే పదే అడ్డుపుల్లలు వేస్తూ విమర్శిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పథకాలను పచ్చచొక్క నాయకులకే ఇళ్లు, పెంచన్లు, జన్మభూమి పేరిట పంచి పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు ఎటువంటి పక్షపాతం లేకుండా పథకాలను అందేలా తమ ప్రభుత్వం చోరవ తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. -
డెంగీ బూచి.. రోగులను దోచి..
సాక్షి, నంద్యాల(కర్నూలు) : నంద్యాల పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ పేరిట దోపిడీ సాగుతోంది. జ్వరమని వెళితే చాలు..ప్లేట్లెట్లు తగ్గాయని, డెంగీ ఉండొచ్చంటూ భయపెడుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు ఎక్కువయ్యాయి. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగాన పల్లె, నందికొట్కూరు, ఆత్మకూరు నియోజక వర్గాల ప్రజలు ఎక్కువగా నంద్యాలకు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అనుమతి లేకున్నా.. వాస్తవానికి నంద్యాలలోని ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. పైగా ఏ ఆసుపత్రిలోనూ అందుకు అవసరమైన పరికరాలు కూడా లేవు. నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. ఈ వైద్య పరీక్ష కిట్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆగస్టులో 1,200 మందికి డెంగీ పరీక్షలు చేశారు. ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ కాలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా.. పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు మాత్రం ‘డెంగీ నిర్ధారణ పరీక్ష చేశాం, మీకు పాజిటివ్ వచ్చిందం’టూ రోగులను బెంబేలెత్తిస్తున్నారు. రోగులు విధిగా ఆసుపత్రిలో చేరేలా, వారు చెప్పిన వైద్యపరీక్షలన్నీ చేయించుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఐసీయూలో ఉంచి అడ్డంగా దోపిడీ కొన్ని ఆసుపత్రుల్లో దోపిడీ మరీ శ్రుతిమించుతోంది. జ్వరం తగ్గే వరకు రోగులను బలవంతంగా ఐసీయూలో ఉంచుతున్నారు. ఇందుకు గాను రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచిన తర్వాత ప్రత్యేక గదికి మార్చి.. అక్కడ కూడా కనీసం వారం రోజులు ఉంచుతున్నారు. అలాగే మందుల చీటీపై ఖాళీ ఎంత ఉంటుందో అన్ని రకాల ఔషధాలు రాస్తున్నారు. సదరు ఆసుపత్రి మెడికల్ స్టోర్‌లోనే కొన్పిస్తున్నారు. ఇలా రోగి స్థోమతను బట్టి ఎంత వీలైతే అంత గుంజుతున్నారు. ఒక్కో రోగి కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్ష దాకా సమర్పించుకోవాల్సి వస్తోంది. ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన.. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల ప్లేట్లెట్లు ఉంటాయి. అనారోగ్యానికి గురైనప్పుడు ఇవి కొంతమేర తగ్గుతుంటాయి. సాధారణ జ్వరాల్లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. డెంగీ బారిన పడితే మాత్రం బాగా తగ్గుముఖం పడతాయి. 20 వేల కంటే దిగువకు పడిపోయి.. కళ్లు, మూత్రంలో రక్తం రావడం, జ్వరం ఎంతకీ తగ్గకపోవడం, శరీరంపై దద్దుర్లు, తీవ్ర తల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పించినప్పుడు మాత్రమే ఆందోళన చెందాల్సి ఉంటుంది. డెంగీ నిర్ధారణ ఇలా.. డెంగీ అనే అనుమానం ఉంటే ఎన్ఎస్–1, ఐజీఎం పరీక్షలు చేస్తారు. పాజిటివ్‌గా నివేదిక వస్తే ఎలిసా పరీక్ష చేసి..నిర్ధారిస్తారు. కొన్నిసార్లు మొదటి, రెండు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా..ఎలీసా పరీక్షలో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రైవేటు ఆసుపత్రికి డెంగీ అనుమానిత రోగి వెళ్తే వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా ప్రైవేటు వైద్యులు కొందరు రోగులను భయపెట్టి వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ ఆర్థికంగా దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ అని నిర్ధారిస్తే చర్యలు నంద్యాల చుట్టుపక్కల ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే డెంగీ అనుమానితుల వివరాలను వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు తెలియజేయాలి. వెంటనే అవసరమైన వైద్యపరీక్షలు చేయిస్తాం. ఎలిసా వంటి పరీక్షలు చేసి, పాజిటివ్ అని తేలితేనే డెంగీగా గుర్తిస్తాం. దాంతో పాటు రోగి నివాసం ఉండే పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచిస్తాం. అలా కాకుండా కార్పొరేట్, ప్రైవేటు వైద్యశాలల్లో డెంగీగా నిర్ధారించినట్లు తేలితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. నంద్యాల ఆసుపత్రిలో ఇంత వరకు ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన అది డెంగీగా భావించవద్దు. –డాక్టర్ రామకృష్ణారావు, డీసీహెచ్ఎస్, నంద్యాల వాస్తవాలు ఇవీ.. ⇔ నంద్యాలలో ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. ⇔ నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. ⇔ నంద్యాల ప్రాంతంలో మూడు నెలలుగా ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. ⇔ ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన డెంగీ కాదు. సాధారణ జ్వరపీడితుల్లోనూ ఈ లక్షణం కన్పిస్తుంది. దగ్గు, జ్వరానికే రూ.70 వేలు 247 ఏళ్ల వయస్సుండే ఓ ప్రైవేటు ఉద్యోగి దగ్గు, జ్వరంతో నంద్యాల వన్‌టౌన్ ఏరియాలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు శ్రీనివాస సెంటర్లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌కు పంపి వైద్యపరీక్షలు చేయించారు. ప్లేట్లెట్లు 50 వేలు ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యులు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి, అనంతరం మరో వారం రోజులు జనరల్‌వార్డులో ఉంచుకుని రూ.70 వేలు వసూలు చేశారు. మరో 10 రోజులకు మందులు రాసిచ్చి పంపారు. ప్లేట్లెట్లు తగ్గాయని రూ.40 వేల వసూలు 2నంద్యాల గిరినాథ్ సెంటర్ ప్రాంతంలో ఉండే పదేళ్ల బాలికకు పది రోజుల క్రితం జ్వరమొచ్చింది. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు సంజీవనగర్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్ కౌంట్ పరీక్షలు రాశారు. ప్లేట్లెట్లు 60 వేలకు తగ్గకూడదని, మీ పాపకు 55 వేలు ఉన్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని భయపెట్టారు. చేసేది లేక చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారం రోజులు ఉంచుకుని రూ.40 వేల బిల్లు వేశారు. -
‘యువత, విద్యార్థులంతా వైఎస్ జగన్‌కు అండగా నిలబడాలి’
సాక్షి, కర్నూలు : రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి ప్రభుత్వాన్ని పారదోలి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యువత, విద్యార్థులంతా అండగా నిలబడాలని నందికొట్కూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయి ప్రత్యేక హోదాను విస్మరించారని విమర్శించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని అందులో వైఎస్సార్సీపీదే బలమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో ఫీరియింబర్స్‌మెంట్ పథకం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగకరమైందనీ, నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. చంద్రబాబు విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విద్యార్థి లోకం జగన్ వెంటే ఉందన్నారు. -
కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు ఆదేశాలు
కర్నూలు జిల్లా: జంట హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమావేశం
సాక్షి, కర్నూలు : నియోజకవర్గ ఇన్‌ఛార్జి హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమావేశం జరిగింది. బుధవారం రాయల్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బివై రామయ్య, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రాజా విష్ణు వర్థన్ రెడ్డి, రెహామాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు వందల మంది వైఎస్సార్ సీపీలో చేరారు. -
స్కార్పియోతో ఢీకొట్టి.. కత్తులతో నరికారు !
సాక్షి, పసుపల ( కర్నూలు): పసుపల గ్రామం సమీపంలో దారుణహత్య జరిగింది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య నడుస్తున్న అధిపత్యం ఈ దారుణానికి దారితీసింది. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి సమాచారం మేరకు.. రుద్రవరం గ్రామానికి చెందిన బోయకృష్ణ (33)కర్నూలులోని ముజఫర్ నగర్లో తన రెండవ భార్య ఇంట్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద ప్రత్యర్థులు కాపు కాశారు . అక్కడికి రాగానే తన స్కార్పియో ఏపీ 26 ఏఎన్ 4945తో బోయ కృష్ణ నడుపుతున్న పల్సర్ వాహనాన్ని ఢీ కొట్టి ఆయన కాలుపై ఎక్కించారు. కాలు విరిగిన కృష్ణ అక్కడి నుంచి కదలలేకపోయాడు. తర్వాత అతడిని అతి దారుణంగా కత్తులతో తలపై, గొంతుపై నరికి పరారయ్యారు. తర్వాత ఆ దారిగుండా వెళ్తున్న స్థానికులు రక్తపుమడుగులో పడి ఉన్న బోయకృష్ణను గుర్తించి కర్నూలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ మహేశ్వరరెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతీకార హత్యే బోయకృష్ణను ప్రత్యర్థులే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. కురువవేంకటేశ్వర్లు, కురువ మధుసూదన్, బోయ పెద్ద ఎల్లయ్య, బోయ చిన్న ఎల్లయ్య, కురువజగదీశ్, కురువమురళీ, కురవ మధులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హతుడు బోయకృష్ణ 2016 డిసెంబర్ 6న సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరిగిన కురువరాముడి హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇతను ఆరు నెలల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడు. మొదటి భార్యను చూసేందుకు ఊరికి రావడంతో ఆయన ప్రత్యర్థులు పథకం రచించి తిరిగి వెళ్తుండగా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాటర్ ప్లాంట్ విషయంలో విభేదాలు 2015 సంవత్సరంలో గ్రామంలోని సుంకులమ్మ గుడిలో ఫిల్టర్ నీళ్ల ప్లాంట్ పెట్టడానికి కురువరాముడు ఏర్పాట్లు చేశాడు. బోయ కృష్ణ వర్గం దేవాలయంలో నీళ్ల ప్లాంట్ వద్దని వేరే చోట పెట్టాలని అడ్డుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యం మొదలైంది. ఈ పోరులో కురువ రాముడుని గతేడాది డిసెంబర్లో ప్రత్యర్థులు మట్టుబెట్టారు. ఏడాది తిరగకముందే హతుడి కుమారులు ప్రతీకారం తీర్చుకున్నారని గ్రామంలో చర్చ సాగుతోంది. స్కార్పియోలో టీడీపీ కండువాలు బోయకృష్ణను చంపడానికి నిందితులు వాడిన ఏపీ 26 ఏఎన్ 4945 స్కార్పియో వాహనంలో టీడీపీ కండువాలు ఉన్నాయి. అనుమానితుల్లో ఒకరైన కురువ వేంకటేశ్వర్లు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడి అనుచరుడు. తండ్రి హత్య తర్వాత ఆయన పంచాన చేరాడు. అంతకు ముందు ఆ నేతే.. తన అనుచరుడిగా ఉండమని బోయకృష్ణను కోరితే ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో తమ ప్రత్యర్థి వెంకటేశ్వర్లుకు ఆ నేత అన్ని విధాలుగా సహాయం చేసి హత్య చేయించాడని బోయకృష్ణ బంధువులు సంఘటన స్థలంలో ఆరోపించారు. -
గొడవపడి.. గొడ్డలితో తల నరికేశాడు !
అనుమానం పెనుభూతమైంది. జీవితంలో కడదాకా అండగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్యను కడతేర్చి తానూ బలవన్మరణం పొందాడు. ఫలితంగా అభంశుభం తెలియని ఆ చిన్నారి అనాథగా మారింది. పండగ పూట ఈ దారుణం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎమ్మిగనూరు: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని కబరస్తాన్ ప్రాంతానికి చెందిన ఉసేని, మైబున్ కుమార్తె పర్వీన్(30))ను చంద్రయ్యకొట్టాలకు చెందిన మాబుదౌల, సలీమ కుమారుడు బాషా(33))కు ఇచ్చి నాలుగేళ్ల కిత్రం వివాహం జరిపించారు. వీరికి కుమార్తె ఆఫ్రిన్(1)ఉంది. ప్రస్తుతం పర్వీన్ మూడు నెలల గర్భిణి. పెళ్లయిన కొన్ని నెలలుపాటు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో బతుకుదెరువు కోసం బెంగళూరులో ఉన్న తన అన్న మన్సూర్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ భర్త ఒక చోట, భార్య మరో చోట పనిచేస్తుండేవారు. ఈ క్రమంలో అతడు భార్య ప్రవర్తనను అనుమానిస్తూ గొడవకు దిగేవాడు. ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం, వారు సర్దిచెప్పి పంపడం చేస్తుండేవారు. తమ్ముడి ప్రవర్తనపై విసుగుచెందిన మన్సూర్ అతడిని మందలించి ఎమ్మిగనూరుకు వెళ్లాలని చెప్పాడు. ఎమ్మిగనూరుకు వెళ్తామని చెప్పి భార్యను కేరళకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా గొడవ పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మిగనూరులో ఉన్న తల్లిదండ్రులకు చెప్పటంతో వారు తమ కుమార్తెను ఇంటికి పిలుచుకొచ్చారు. భార్యతో పాటు వచ్చిన బాషా ఖాళీగా ఉండేవాడు. గొడవపడి.. తల నరికి.. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తుండగా భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఈక్రమంలో కోపోద్రిక్తుడై ఒక్కసారిగా గొడ్డలితో ఆమె తలపై నరికాడు. కేకలు వినిపించడంలో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఆమె రక్తపుమడుగులో కనిపించింది. చేతిలో గొడ్డలితో ఉన్న బాషా అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్‌కు తీసుకెళ్లారు. చికిత్స ఫలించకపోవడంతో ఆమె మృతి చెందింది. భార్య చనిపోయిందనే విషయం తెలుసుకున్న భర్త భయపడి పట్టణంలోని సంజీవయ్య నగర్ చివరన శనివారం తెల్లవారు జామున చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారి అనాథగా మిగిలిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
అత్యవసరం.. అక్రమాలకు ఆజ్యం
రోగులకు ప్రాణం మీదకొచ్చిందంటే.. కొందరు వైద్యులకు కాసుల పంటే. ఉచిత వైద్యం మాటున..సొంత లాభం వారి ప్రత్యేకత. అత్యవసరం పేరిట.. మందులు, వైద్య పరీక్షలను బయటకు రాస్తూ కమీషన్లు దండుకోవడం పరిపాటిగా మారింది. ఆసుపత్రి ఆదాయం పెంపొందించి సౌకర్యాలు మెరుగుపర్చాల్సిన అధికారులు అందులో తప్పేముందని చెబుతుండగా.. ఇంక అడ్డెవరూ లేరనే ధోరణి అక్రమార్కుల్లో కనిపిస్తోంది. కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత ఆర్థిక సంవత్సరంలో 7,50,830 మంది ఓపీ రోగులకు.. 72,788 మంది ఇన్పేషంట్లకు చికిత్స అందించారు. ఇందులో 10,006 మంది డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పథకం కింద చికిత్స పొందారు. 2008లో ప్రారంభమైన ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదట్లో మందకొడిగా సాగినా 2011 నుంచి ఊపందుకుంది. అప్పటి నుంచి యేటా 8వేల నుంచి 10వేల మంది దాకా ఈ పథకం కింద ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఈ రోగులకు ఆసుపత్రిలో మందులు, వైద్య పరీక్షలు, భోజనం, ప్రయాణ ఖర్చులు చెల్లించాలి. ఒక్క రూపాయి కూడా రోగి తన జేబు నుంచి వైద్యం కోసం ఖర్చు చేయకూడదనేది పథకం ఉద్దేశం. కానీ ఆసుపత్రి అధికారులు, వైద్యులు మాత్రం రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఆసుపత్రిలో అందుబాటులోని వైద్య పరీక్షలను సైతం బయటకు రాస్తున్నా రు. ఖరీదైన బ్రాండెడ్ కంపెనీ మందులను బయట నుంచి తెప్పిస్తున్నారు. వీటన్నింటినీ రోగి డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు తిరిగి చెల్లిస్తారు. అయితే రోగికి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వచ్చినా ఆసుపత్రి ఖజానాకు మాత్రం భారీగా గండిపడుతోంది. ఒక్కో రోగికి అవసరాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు తిరిగి చెల్లిస్తున్నారు. ఈ మొత్తం యేటా రూ.2కోట్లకు పైగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... రామాంజినమ్మ అనే రోగికి నెఫ్రాలజి విభాగం వైద్యులు కిడ్నీ బయాప్సీ(ఎం అండ్ ఐఎఫ్) పరీక్ష రూ.2000లకు చేయించారు. లక్ష్మి అనే మహిళకు యూరినరి ప్రొటీన్ క్రియాటినిన్ రేషియో, ఆల్బుమిన్ సీరమ్ పరీక్షలను గాయత్రి ఎస్టేట్స్‌లోని ఓ ప్రముఖ ల్యాబ్‌లో చేయించారు. ఇందుకు ఆ మహిళ రూ.360 ఖర్చు చేసింది. ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మన్న అనే రోగికి హెచ్‌సీవీ, హెచ్ఐవీ, హెచ్‌బీఎస్ కిట్లను బయట నుంచి తెప్పించారు. తాడిపత్రికి చెందిన రంగస్వామిరెడ్డి అనే వ్యక్తికి వైద్యపరీక్షలు, మందుల కోసం రూ.3వేల దాకా ఖర్చు చేశారు. కోడుమూరుకు చెందిన మద్దిలేటి అనే వ్యక్తి నరాలకు సంబంధించిన పరీక్ష ఈఈజీని ప్రైవేట్ క్లినిక్‌లో రూ.1000 ఖర్చుతో చేయించుకుని ఆరోగ్యశ్రీలో బిల్లు పెట్టాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జె.రాజారంగారెడ్డికి గాల్‌బ్లాడర్‌లో సమస్య ఉంటే ఆసుపత్రిలోని ఎంఎస్-1లో గత నెల ఒకటో తేదీన చేర్పించగా.. 20న డిశ్చార్జ్ అయ్యారు. మందులు, వైద్య పరీక్షల కోసం రూ.3వేలు ఖర్చు పెట్టారు. ఆత్మకూరు మండలం తూముపల్లి గ్రామానికి చెందిన నవీన్‌కు ఫిట్స్ రావడంతో గత నెల 26న ఆసుపత్రిలో చేర్పించి, ఈ నెల 4న డిశ్చార్జ్ చేశారు. నరాలకు సంబంధించిన పరీక్ష ఈఈజీని ప్రైవేట్‌గా రూ.1000 ఖర్చు పెట్టి చేయించారు. దీంతో పాటు కొన్ని మందులూ బయట కొనుగోలు చేశారు. డబ్బు కంటే రోగి ప్రాణమే ముఖ్యం ఆసుపత్రిలో రోగికి ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పూర్తి ఉచిత వైద్యం అందిస్తున్నాం. చికిత్సను బట్టి ఒక్కోసారి అత్యవసరంగా మందులు బయటి నుంచి తెప్పించాల్సి వస్తుంది. ఇదే సమయంలో అత్యవసర వైద్య పరీక్షలు ప్రైవేట్‌గా చేయించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని రోగి తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తున్నాం. దీనివల్ల ఆసుపత్రికి ఆదాయం తగ్గినా.. రోగి ప్రాణమే మాకు ముఖ్యం. - డాక్టర్ వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
99%
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 99.35 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా... మొదట్లో మందకొండిగా ప్రారంభమైన మధ్యాహ్నానికి ఊపందుకుంది. సమయం ముగిసే సరికి మొత్తం 1087 మంది ఓటర్లలో 1080 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌కు దూరంగా ఉండాలని సీపీఐ నిర్ణయం తీసుకోవడంతో... ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్‌కు హాజరుకాలేదు. ఇక మిగిలిన ముగ్గురిలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో, ఒకరు అధికార పార్టీ అడ్డుకోవడంతో ఓటింగుకు రాలేదని సమాచారం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థు డి. వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిలతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు దండు శేషుయాదవ్, వి. వెంకటేశ్వరరెడ్డిలు.. కర్నూలు ఎన్నికల కేంద్రంలో ఉదయం నుంచి పోలింగ్ ముగిసే వరకూ ఓటింగ్ సరళిని దగ్గరుండి పరిశీలించారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి..కర్నూలు పోలింగు కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు నంద్యాల కేంద్రంలో, కర్నూలులో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మణిగాంధీ, ఐజయ్యలు తమ ఓటు వేశారు. ఆదోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, జయ నాగేశ్వరరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని పరిశీలకులు కరికాల వలన్, టీజీ వెంకటేష్‌లు కర్నూలు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బందోబస్తు తీరును డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆదోని డీఎస్పీలు పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్... ఆదోని, నంద్యాలలో ఎన్నికల తీరును పరిశీలించారు. ఇదిలా ఉండగా ఎవరికి వారు తమదే గెలుపని ప్రకటించుకున్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే... ఓటమి భయం కళ్లకు కట్టినట్టు కనిపించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కార్లలో తరలింపు పోలింగ్ కేంద్రానికి పలువురు ఓటర్లను అధికార పార్టీ నాయకులు.. కార్లలో తరలించారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో ఓటింగు కేంద్రానికి తీసుకొచ్చారు. తమకు ఓటు వేస్తారో లేదోననే అనుమానంతో పలువురు సహాయకులను నియమించుకున్న అధికార పార్టీ... సహాయకులకు ప్రత్యేక సూచనలు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రయత్నాలు చేయడం కనిపించింది. స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు ఎంపీటీసీ సభ్యుడు బాల ఉస్సేనిని కిడ్నాప్ చేశారంటూ అధికార పార్టీ కిడ్నాప్ డ్రామా ఆడించింది. తమ పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని తామెందుకు కిడ్నాప్ చేస్తామని.. అధికార పార్టీనే కిడ్నాప్ చేసిందని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కర్నూలు డివిజన్లో అత్యధికం.. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రెవెన్యూ డివిజన్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 1087 మంది ఓటర్లు ఉండగా... 1080 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నూలు డివిజన్లో అత్యధికంగా 99.74 శాతం ఓటింగ్ నమోదయ్యింది. కర్నూలు రెవెన్యూ డివిజన్లో 387 మంది ఓటర్లకుగానూ 386 మంది ఓటు వేశారు. ఇక నంద్యాల డివిజన్లో 307 మందికిగానూ 306 మంది ఓటు వేశారు. ఆదోనిలో 393 మంది ఓటర్లు ఉండగా... 388 మంది మాత్రమే ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా సగటున 99.35 శాతం ఓటింగు నమోదయ్యింది.