సాక్షి, పసుపల ( కర్నూలు): పసుపల గ్రామం సమీపంలో దారుణహత్య జరిగింది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య నడుస్తున్న అధిపత్యం ఈ దారుణానికి దారితీసింది. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి సమాచారం మేరకు.. రుద్రవరం గ్రామానికి చెందిన బోయకృష్ణ (33)కర్నూలులోని ముజఫర్ నగర్‌లో తన రెండవ భార్య ఇంట్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు.
ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద ప్రత్యర్థులు కాపు కాశారు . అక్కడికి రాగానే తన స్కార్పియో ఏపీ 26 ఏఎన్ 4945తో బోయ కృష్ణ నడుపుతున్న పల్సర్ వాహనాన్ని ఢీ కొట్టి ఆయన కాలుపై ఎక్కించారు.
కాలు విరిగిన కృష్ణ అక్కడి నుంచి కదలలేకపోయాడు. తర్వాత అతడిని అతి దారుణంగా కత్తులతో తలపై, గొంతుపై నరికి పరారయ్యారు. తర్వాత ఆ దారిగుండా వెళ్తున్న స్థానికులు రక్తపుమడుగులో పడి ఉన్న బోయకృష్ణను గుర్తించి కర్నూలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ మహేశ్వరరెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రతీకార హత్యే
బోయకృష్ణను ప్రత్యర్థులే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. కురువవేంకటేశ్వర్లు, కురువ మధుసూదన్, బోయ పెద్ద ఎల్లయ్య, బోయ చిన్న ఎల్లయ్య, కురువజగదీశ్, కురువమురళీ, కురవ మధులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హతుడు బోయకృష్ణ 2016 డిసెంబర్ 6న సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరిగిన కురువరాముడి హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇతను ఆరు నెలల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడు. మొదటి భార్యను చూసేందుకు ఊరికి రావడంతో ఆయన ప్రత్యర్థులు పథకం రచించి తిరిగి వెళ్తుండగా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
వాటర్ ప్లాంట్ విషయంలో విభేదాలు
2015 సంవత్సరంలో గ్రామంలోని సుంకులమ్మ గుడిలో ఫిల్టర్ నీళ్ల ప్లాంట్ పెట్టడానికి కురువరాముడు ఏర్పాట్లు చేశాడు. బోయ కృష్ణ వర్గం దేవాలయంలో నీళ్ల ప్లాంట్ వద్దని వేరే చోట పెట్టాలని అడ్డుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యం మొదలైంది. ఈ పోరులో కురువ రాముడుని గతేడాది డిసెంబర్‌లో ప్రత్యర్థులు మట్టుబెట్టారు. ఏడాది తిరగకముందే హతుడి కుమారులు ప్రతీకారం తీర్చుకున్నారని గ్రామంలో చర్చ సాగుతోంది.
స్కార్పియోలో టీడీపీ కండువాలు
బోయకృష్ణను చంపడానికి నిందితులు వాడిన ఏపీ 26 ఏఎన్ 4945 స్కార్పియో వాహనంలో టీడీపీ కండువాలు ఉన్నాయి. అనుమానితుల్లో ఒకరైన కురువ వేంకటేశ్వర్లు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడి అనుచరుడు. తండ్రి హత్య తర్వాత ఆయన పంచాన చేరాడు. అంతకు ముందు ఆ నేతే.. తన అనుచరుడిగా ఉండమని బోయకృష్ణను కోరితే ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో తమ ప్రత్యర్థి వెంకటేశ్వర్లుకు ఆ నేత అన్ని విధాలుగా సహాయం చేసి హత్య చేయించాడని బోయకృష్ణ బంధువులు సంఘటన స్థలంలో ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment