రోగులకు ప్రాణం మీదకొచ్చిందంటే.. కొందరు వైద్యులకు కాసుల పంటే. ఉచిత వైద్యం మాటున..సొంత లాభం వారి ప్రత్యేకత. అత్యవసరం పేరిట.. మందులు, వైద్య పరీక్షలను బయటకు రాస్తూ కమీషన్లు దండుకోవడం పరిపాటిగా మారింది. ఆసుపత్రి ఆదాయం పెంపొందించి సౌకర్యాలు మెరుగుపర్చాల్సిన అధికారులు అందులో తప్పేముందని చెబుతుండగా.. ఇంక అడ్డెవరూ లేరనే ధోరణి అక్రమార్కుల్లో కనిపిస్తోంది.
కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత ఆర్థిక సంవత్సరంలో 7,50,830 మంది ఓపీ రోగులకు.. 72,788 మంది ఇన్‌పేషంట్లకు చికిత్స అందించారు. ఇందులో 10,006 మంది డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పథకం కింద చికిత్స పొందారు. 2008లో ప్రారంభమైన ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదట్లో మందకొడిగా సాగినా 2011 నుంచి ఊపందుకుంది. అప్పటి నుంచి యేటా 8వేల నుంచి 10వేల మంది దాకా ఈ పథకం కింద ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఈ రోగులకు ఆసుపత్రిలో మందులు, వైద్య పరీక్షలు, భోజనం, ప్రయాణ ఖర్చులు చెల్లించాలి. ఒక్క రూపాయి కూడా రోగి తన జేబు నుంచి వైద్యం కోసం ఖర్చు చేయకూడదనేది పథకం ఉద్దేశం. కానీ ఆసుపత్రి అధికారులు, వైద్యులు మాత్రం రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఆసుపత్రిలో అందుబాటులోని వైద్య పరీక్షలను సైతం బయటకు రాస్తున్నా రు. ఖరీదైన బ్రాండెడ్ కంపెనీ మందులను బయట నుంచి తెప్పిస్తున్నారు. వీటన్నింటినీ రోగి డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు తిరిగి చెల్లిస్తారు. అయితే రోగికి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వచ్చినా ఆసుపత్రి ఖజానాకు మాత్రం భారీగా గండిపడుతోంది. ఒక్కో రోగికి అవసరాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు తిరిగి చెల్లిస్తున్నారు. ఈ మొత్తం యేటా రూ.2కోట్లకు పైగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు...
రామాంజినమ్మ అనే రోగికి నెఫ్రాలజి విభాగం వైద్యులు కిడ్నీ బయాప్సీ(ఎం అండ్ ఐఎఫ్) పరీక్ష రూ.2000లకు చేయించారు.
లక్ష్మి అనే మహిళకు యూరినరి ప్రొటీన్ క్రియాటినిన్ రేషియో, ఆల్బుమిన్ సీరమ్ పరీక్షలను గాయత్రి ఎస్టేట్స్‌లోని ఓ ప్రముఖ ల్యాబ్‌లో చేయించారు. ఇందుకు ఆ మహిళ రూ.360 ఖర్చు చేసింది.
ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మన్న అనే రోగికి హెచ్‌సీవీ, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్ కిట్లను బయట నుంచి తెప్పించారు.
తాడిపత్రికి చెందిన రంగస్వామిరెడ్డి అనే వ్యక్తికి వైద్యపరీక్షలు, మందుల కోసం రూ.3వేల దాకా ఖర్చు చేశారు.
కోడుమూరుకు చెందిన మద్దిలేటి అనే వ్యక్తి నరాలకు సంబంధించిన పరీక్ష ఈఈజీని ప్రైవేట్ క్లినిక్‌లో రూ.1000 ఖర్చుతో చేయించుకుని ఆరోగ్యశ్రీలో బిల్లు పెట్టాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జె.రాజారంగారెడ్డికి గాల్‌బ్లాడర్‌లో సమస్య ఉంటే ఆసుపత్రిలోని ఎంఎస్-1లో గత నెల ఒకటో తేదీన చేర్పించగా.. 20న డిశ్చార్జ్ అయ్యారు. మందులు, వైద్య పరీక్షల కోసం రూ.3వేలు ఖర్చు పెట్టారు.
ఆత్మకూరు మండలం తూముపల్లి గ్రామానికి చెందిన నవీన్‌కు ఫిట్స్ రావడంతో గత నెల 26న ఆసుపత్రిలో చేర్పించి, ఈ నెల 4న డిశ్చార్జ్ చేశారు. నరాలకు సంబంధించిన పరీక్ష ఈఈజీని ప్రైవేట్‌గా రూ.1000 ఖర్చు పెట్టి చేయించారు. దీంతో పాటు కొన్ని మందులూ బయట కొనుగోలు చేశారు.
డబ్బు కంటే రోగి ప్రాణమే ముఖ్యం
ఆసుపత్రిలో రోగికి ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పూర్తి ఉచిత వైద్యం అందిస్తున్నాం. చికిత్సను బట్టి ఒక్కోసారి అత్యవసరంగా మందులు బయటి నుంచి తెప్పించాల్సి వస్తుంది. ఇదే సమయంలో అత్యవసర వైద్య పరీక్షలు ప్రైవేట్‌గా చేయించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని రోగి తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తున్నాం. దీనివల్ల ఆసుపత్రికి ఆదాయం తగ్గినా.. రోగి ప్రాణమే మాకు ముఖ్యం.
- డాక్టర్ వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్
అత్యవసరం.. అక్రమాలకు ఆజ్యం
Published Fri, Jul 10 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement