సాక్షి అమరావతి/భువనేశ్వర్/మహారాణిపేట: ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో గాయపడి, బాలాసోర్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆదివారం పరామర్శించారు. అంతకు ముందు ఆయన బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులను సమీక్షించి, ఘటన పూర్వాపరాలపై అధికారులతో విశ్లేషించారు.
లోటుపాట్లు లేకుండా సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగేలా వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా చర్చించారు. స్థానికుల సహాయ, సహకారాలను మంత్రి ప్రశంసించారు. బాధితులను ఆదుకునే దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. అత్యవసర సేవలకు అనుకూలంగా భువనేశ్వర్‌లో 16 అంబులెన్స్‌లు, 10 మహా ప్రస్థానం వాహనాలు, బాలాసోర్‌లో 5అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచిందని చెప్పారు.
భువనేశ్వర్‌లో బాధితుల సహాయ కేంద్రం
ఆచూకీ తెలియని వారి కోసం భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేస్తోందన్నారు. భువనేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో 120 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయన్నారు. మృతులను గుర్తించడానికి కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సహాయం కోసం 1929 హెల్ప్‌లైన్‌తో పాటు ప్రత్యేక అధికారి తిరుమల నాయక్(ఐఏఎస్) 8895351188ను బాధిత కుటుంబాలు సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల, మృతుల వివరాలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారన్నారు. కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్‌సీబీ మెడికల్ కళాశాల, భువనేశ్వర్ రైల్వేస్టేషన్, బారముండా బస్టాండ్, విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌లు పని చేస్తున్నాయన్నారు.
క్షతగాత్రులకు విశాఖలో చికిత్స
రైలు ప్రమాదంలో గాయపడ్డ పలువురికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సెవెన్ హిల్స్, ఐఎన్‌ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో ఇద్దరి చొప్పున, కేజీహెచ్‌లో ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎ.శంకరరావుకు అన్ని పరీక్షలు చేశామని, ఆరోగ్యం స్థిరంగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. బాధితుల కోసం కేజీహెచ్ క్యాజువాలిటీ వద్ద 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన భారతి, మాధవరావులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నామన్నారు. కె.పూజ అనే మహిళను భువనేశ్వర్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.
గురుమూర్తికి అక్కడే అంత్యక్రియలు
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన సి.గురుమూర్తి ఒక్కరే మృతి చెందారు. ఆయన కుటుంబం బాలాసోర్‌లో ఉంటున్నందున మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల్లో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 18004250101, 8333905022 (వాట్సాప్) సంప్రదించవ్చని తెలిపారు.
చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. పట్టాలపై ప్రేమ కథ!
Comments
Please login to add a commentAdd a comment