అనుమానం పెనుభూతమైంది. జీవితంలో కడదాకా అండగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్యను కడతేర్చి తానూ బలవన్మరణం పొందాడు. ఫలితంగా అభంశుభం తెలియని ఆ చిన్నారి అనాథగా మారింది. పండగ పూట ఈ దారుణం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎమ్మిగనూరు: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని కబరస్తాన్ ప్రాంతానికి చెందిన ఉసేని, మైబున్ కుమార్తె పర్వీన్(30))ను చంద్రయ్యకొట్టాలకు చెందిన మాబుదౌల, సలీమ కుమారుడు బాషా(33))కు ఇచ్చి నాలుగేళ్ల కిత్రం వివాహం జరిపించారు. వీరికి కుమార్తె ఆఫ్రిన్(1)ఉంది. ప్రస్తుతం పర్వీన్ మూడు నెలల గర్భిణి. పెళ్లయిన కొన్ని నెలలుపాటు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు.
ఈక్రమంలో బతుకుదెరువు కోసం బెంగళూరులో ఉన్న తన అన్న మన్సూర్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ భర్త ఒక చోట, భార్య మరో చోట పనిచేస్తుండేవారు. ఈ క్రమంలో అతడు భార్య ప్రవర్తనను అనుమానిస్తూ గొడవకు దిగేవాడు. ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం, వారు సర్దిచెప్పి పంపడం చేస్తుండేవారు. తమ్ముడి ప్రవర్తనపై విసుగుచెందిన మన్సూర్ అతడిని మందలించి ఎమ్మిగనూరుకు వెళ్లాలని చెప్పాడు. ఎమ్మిగనూరుకు వెళ్తామని చెప్పి భార్యను కేరళకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా గొడవ పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మిగనూరులో ఉన్న తల్లిదండ్రులకు చెప్పటంతో వారు తమ కుమార్తెను ఇంటికి పిలుచుకొచ్చారు. భార్యతో పాటు వచ్చిన బాషా ఖాళీగా ఉండేవాడు.
గొడవపడి.. తల నరికి..
శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తుండగా భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఈక్రమంలో కోపోద్రిక్తుడై ఒక్కసారిగా గొడ్డలితో ఆమె తలపై నరికాడు. కేకలు వినిపించడంలో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఆమె రక్తపుమడుగులో కనిపించింది. చేతిలో గొడ్డలితో ఉన్న బాషా అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్‌కు తీసుకెళ్లారు.
చికిత్స ఫలించకపోవడంతో ఆమె మృతి చెందింది. భార్య చనిపోయిందనే విషయం తెలుసుకున్న భర్త భయపడి పట్టణంలోని సంజీవయ్య నగర్ చివరన శనివారం తెల్లవారు జామున చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారి అనాథగా మిగిలిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment