
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈనెల 15వ తేదీన నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఇందులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధి, తీవ్రవాద నియంత్రణ ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇతర అంశాలపైనా చర్చిస్తారు. ఈ సమావేశానికి హాజరుకావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను నీతి ఆయోగ్ ఆహ్వానించింది. ఆ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లతో హై టీ కార్యక్రమం ఉంటుంది. అనంతరం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ప్రాధాన్యం, తీవ్రవాద కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షా ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రులు మాట్లాడతారు. సమావేశంలో ఒక్కో ముఖ్యమంత్రి/లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఏడు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు సమయం ఇస్తారు. అక్షర క్రమం ప్రకారం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మొట్టమొదట ప్రసంగించే అవకాశం దక్కనుంది. ముఖ్యమంత్రుల ప్రసంగాల అనంతరం నీతి ఆయోగ్ చైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తారు.